Home Latest News Virat Kohli | కోహ్లీ ఖతర్నాక్‌ ఇన్నింగ్స్‌.. మూడేండ్ల తర్వాత టెస్టు శతకం..

Virat Kohli | కోహ్లీ ఖతర్నాక్‌ ఇన్నింగ్స్‌.. మూడేండ్ల తర్వాత టెస్టు శతకం..

Virat Kohli | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: ఇటీవలి కాలంలో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతులకు పదే పదే వికెట్‌ సమర్పించుకుంటున్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో కొత్తగా కనిపించాడు. ఆఫ్‌స్టంప్‌ లైన్‌లో బ్యాటింగ్‌ చేస్తూ.. దూరంగా వెళ్తున్న బంతులను వదిలేశాడు. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే పరిణతి చెందిన ఇన్నింగ్స్‌తో ఆలరించాడు. ఏమాత్రం తొందరపడకుండా ముందుకు సాగిన కోహ్లీ.. శతకం సాధించేందుకు 241 బంతులు తీసుకున్నాడు. మామూలుగా అయితే విరాట్‌ రేంజ్‌కు ఇవి చాలా ఎక్కువ బంతులే అయినా.. పరిస్థితులకు తగ్గట్లు ఆడిన మాజీ కెప్టెన్‌ ఒక్కసారి శతకం పూర్తయిన తర్వాత గేర్లు మార్చాడు. సెంచరీ అనంతరం విరాట్‌ తన మెడలో ఉన్న ప్రత్యేకమైన లాకెట్‌ను ముద్దాడుతూ సంబురాలు జరుపుకున్నాడు. అప్పటి వరకు బౌండ్రీలు బాదేందుకు ఎక్కువ ప్రయత్నించని విరాట్‌.. సెంచరీ తర్వాత ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. పదే పదే బంతిని గీత దాటిస్తూ స్ట్రయిక్‌రేట్‌ పెంచాడు. ఈ క్రమంలో కోహ్లీ బ్యాట్‌ నుంచి అత్యుత్తమ కవర్‌ డ్రైవ్‌లు, ఆఫ్‌ డ్రైవ్‌లు దర్శనమిచ్చాయి. పూర్తి క్రమశిక్షణతో కూడిన ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ.. 84 సింగిల్స్‌, 18 డబుల్స్‌ తీశాడు. రెండుసార్లు మూడేసి పరుగులు రాబట్టాడు.

అనారోగ్యంతోనే..

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారీ సెంచరీతో అదరగొట్టిన విరాట్‌ కోహ్లీ.. అనారోగ్యంతోనే ఆణిముత్యంలాంటి ఇన్నింగ్స్‌ ఆడాడని అతడి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ పేర్కొంది. తాజా పోరులో 8 గంటలా 36 నిమిషాల పాటు క్రీజులో గడిపిన కోహ్లీ.. అస్వస్థతతోనే 364 బంతులు ఎదుర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అనుష్క వెల్లడించింది. కొద్దిలో డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న కోహ్లీ.. ఔటై వెళ్తున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సహా ఆటగాళ్లంతా అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం అభిమానులను కట్టిపడేసింది.

శ్రేయస్‌కు గాయం.. వన్డే సిరీస్‌కు దూరం!

తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేకపోయిన శ్రేయస్‌ అయ్యర్‌ విషయంలో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్యర్‌ గాయంపై స్పష్టత లేకుండానే అతడిని మ్యాచ్‌ ఆడించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తొలి రెండు రోజులు ఫీల్డింగ్‌ చేసిన అయ్యర్‌ ఆదివారం బ్యాటింగ్‌ సమయానికి అందుబాటులో లేకుండా పోయాడు. అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్‌కు పంపినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు శ్రేయస్‌ అందుబాటులో ఉండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ రాణించడం సరిపోయింది కానీ, తొలి ఇన్నింగ్స్‌లో మనవాళ్లు భారీ స్కోరు చేయకపోయుంటే ఇది పెద్ద అంశంగా పరిణమించేదే!

అభిమానుల అత్యుత్సాహం!

ఒకవైపు అభిమానులంతా భారత్‌ విజయ తీరాలకు చేరాలని ఆకాంక్షిస్తున్న సమయంలో అహ్మదాబాద్‌లో కొందరు ఆకతాయిలు.. తమ చర్యలతో భారత ప్లేయర్లను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేశారు. మ్యాచ్‌ విరామ సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లంతా డగౌట్‌ సమీపంలో నిల్చున్న సమయంలో స్టాండ్స్‌లో నుంచి కొందరు ప్రేక్షకులు.. రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ అని అరుస్తూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇక్కడి వరకు ఓకే కానీ.. ఆ తర్వాతే కొందరు అభిమానులు కావాలనే సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ పేరు పిలుస్తూ.. ‘జై శ్రీరామ్‌’అనే నినాదాలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Exit mobile version