Home Latest News India Vs New Zealand | రాయ్‌పూర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే… రోహిత్‌...

India Vs New Zealand | రాయ్‌పూర్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే… రోహిత్‌ సేన జోరు కొనసాగిస్తారా?

Image Source : Rohit Sharma Facebook

India Vs New Zealand | రాయ్‌పూర్‌: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఘనవిజయం సాధించిన భారత్‌.. శనివారం న్యూజిలాండ్‌తో రెండో వన్డే ఆడనుంది. భారీ స్కోర్లు నమోదైన ఉప్పల్‌ మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న రోహిత్‌ సేన.. ఇక్కడే సిరీస్‌ పట్టేయాలని తహతహలాడుతుంటే.. సమం చేయాలని న్యూజిలాండ్‌ పట్టుదలతో ఉంది.

తొలి వన్డేలో రికార్డు డబుల్‌ సెంచరీ నమోదు చేసిన శుభ్‌మన్‌ గిల్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి యువ ఆటగాళ్లు సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలిస్తామని ఇప్పటికే టీమ్‌మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేయగా.. వచ్చిన చాన్స్‌లు వినియోగించుకునేందుకు యంగ్‌ గన్స్‌ కసరత్తులు చేస్తున్నారు. రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ ఫుల్‌ ఫామ్‌లో ఉండగా.. మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోతున్న రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లోనైనా అభిమానుల కోరిక తీరుస్తాడా చూడాలి.

సిరాజ్‌పైనే భారం..

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పనికిరాడని పక్కనపెట్టిన వాడే.. ఇప్పుడు భారత ప్రధాన పేసర్‌గా ఎదుగుతున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో అడపాదడపా వన్డేల్లోకి వచ్చి వెళ్లిన హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌.. ఇప్పుడు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లే కనిపిస్తున్నాడు. గతేడాది భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచిన సిరాజ్‌.. ఈ ఏడాది మరింత పదునెక్కాడు. కొత్త బంతితో ప్రత్యర్థిని హడలెత్తిస్తున్న ఈ గల్లీబాయ్‌.. స్వింగ్‌తోనూ ఫలితం రాబడుతున్నాడు.

భారత ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీలో జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన సిరాజ్‌.. గత రెండు వన్డేల్లోనూ నాలుగేసి వికెట్లతో విజృంభించాడు. కివీస్‌తో రెండో వన్డేలోనూ ఈ హైదరాబాదీ అదే జోరు కొనసాగిస్తే.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే టీమ్‌ఇండియా సిరీస్‌ పట్టేయడం ఖాయమే. అతడితో పాటు సీనియర్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ పేస్‌ భారాన్ని మోయనున్నాడు.

శార్దూల్‌ ఠాకూర్‌, హార్దిక్‌ పాండ్యా రూపంలో తగినన్ని పేస్‌ వనరులు భారత్‌కు అందుబాటులో ఉండగా.. కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ భారాన్ని మోయనున్నారు. అయితే గత మ్యాచ్‌లో పరుగులు ఎక్కువ ఇచ్చుకున్న శార్దూల్‌ ఠాకూర్‌ను కొనసాగిస్తారా.. లేక అతడి స్థానంలో జమ్ము ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. శ్రీలంకపై సునాయాసంగా సిరీస్‌ పట్టేసిన టీమ్‌ఇండియాకు న్యూజిలాండ్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

తొలి పోరులో భారీ స్కోరు చేసిన అనంతరం కూడా రోహిత్‌ సేన విజయం కోసం ఆఖరి ఓవర్‌ వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘ఫైటర్స్‌’గా గుర్తింపు పొందిన న్యూజిలాండ్‌ ప్లేయర్లు అంత త్వరగా ఓటమిని అంగీకరించారనే విషయం హైదరాబాద్‌లో మరోసారి రుజువైంది. కివీస్‌ను కట్టడి చేయాలంటే టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాల్సిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు అండగా రోహిత్‌ శర్మ

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!

Exit mobile version