Home Latest News Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Mohammed Shami | టైమ్‌ 2 న్యూస్‌, నాగ్‌పూర్‌: రికార్డుల రారాజు, పరుగుల యంత్రం, చేజింగ్‌ మాస్టర్‌, కింగ్‌ కోహ్లీని.. పేస్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ దాటేయడం ఏంటి అనుకుంటున్నారా! నిజమండి బాబూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు చేసి రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని షమీ అధిగమించాడు. అది కూడా బ్యాటింగ్‌లోనే కావడం మరో విశేషం. అంతేకాదు.. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్‌ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన పలువురు భారత ఆటగాళ్లను షమీ ఓవర్‌టేక్‌ చేశాడు. కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజారా, యువరాజ్‌సింగ్‌ వంటి పలువురు ఆటగాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇంతకీ ఆ జాబితా ఏంటి అనేగా మీ సందేహం! అక్కడికే వస్తున్నా.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో విరాట్‌ కోహ్లీని దాటి మహమ్మద్‌ షమీ ముందుకెళ్లాడు.

షమీ@25

బోర్డర్‌-గవాస్కర్‌ సీరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో షమీ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. పదో ప్లేయర్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన షమీ.. ఆసీస్‌ బౌలర్లను చీల్చి చెండాడుతూ ఎడా పెడా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. టాపార్డర్‌ బ్యాటర్లు కూడా పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట షమీ యధేచ్ఛగా షాట్లు కొట్టాడు. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 4 పరుగులు జోడించి రవీంద్ర జడేజా వెనుదిరిగినా.. అక్షర్‌ పటేల్‌కు అండగా నిలిచిన షమీ.. ప్రొఫెషనల్‌ బ్యాటర్‌ను తలపిస్తూ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో షమీ టెస్టు క్రికెట్‌లో 25 సిక్సర్ల మార్క్‌ దాటాడు. విరాట్‌ ఇప్పటి వరకు 105 టెస్టుల్లో 8131 పరుగులు చేయగా.. అందులో 27 సెంచరీలు, 7 డబుల్‌ సెంచరీలు, 28 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అయితే సిక్సర్ల విషయంలో మాత్రమ కోహ్లీ వెనుకబడి ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఈ పరుగుల వీరుడు ఇప్పటి వరకు 24 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అయితే అదే సమయంలో కెరీర్‌లో ఇప్పటి వరకు 60 టెస్టులు ఆడిన షమీ.. 685 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో 25 సిక్సర్లు ఉండటం విశేషం.

రాహుల్‌, పుజారా కూడా వెనకే..

సంప్రదాయ క్రికెట్‌లో ఎక్కువ క్రీజులో పాతుకుపోవడంపైనే దృష్టి పెట్టే విరాట్‌.. ఎన్నో భారీ ఇన్నింగ్స్‌లు ఆడినా.. పెద్దగా సిక్సర్లు కొట్టలేదు. టీ20, వన్డేల్లో మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు బాదే రన్‌మెషీన్‌ టెస్టుల్లో ఎక్కువ గ్రౌండ్‌ షాట్స్‌నే ఆడుతూ వేలాది పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో షమీ 16వ ప్లేస్‌కు చేరాడు. టీ20 ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ టెస్టు క్రికెట్‌లో 21 సిక్సులకే పరిమితం కాగా.. చాన్నాళ్లుగా టెస్టు జట్టులో కొనసాగుతున్న పుజారా, కేఎల్‌ రాహుల్‌ కూడా షమీ కంటే వెనుకే ఉండటం గమనార్హం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Srikar Bharat | ఇది శ్రీకారం మాత్రమే.. అరంగేట్రంపై శ్రీకర్‌ భరత్‌ వ్యాఖ్య

Exit mobile version