Home Latest News IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

IND vs AUS | టైమ్ 2 న్యూస్, నాగ్పూర్: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో జయకేతనం ఎగరవేసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన మొదటి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేసింది. ఉపఖండంలో స్పిన్ పిచ్లు ఎదురవుతాయని ఊహించి దాని కోసం వారం రోజులు పాటు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసిన కంగరూలు అసలు పోరులో ఆకట్టుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్లో 91 రన్స్కే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా మాయాజాలానికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా ప్రతిష్ఠాత్మక సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యం సాధించడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్లూ్యటీసీ) ఫైనల్కు అర్హత సాధించ దిశగా అడుగు ముందుకేసింది.

షమీ సిక్సర్ల హోరు..

ఓవర్నైట్ స్కోరు 321/7తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 400 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ (174 బంతుల్లో 84; 10 ఫోర్లు, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (185 బంతుల్లో 70; 9 ఫోర్లు) రాణించారు. చివర్లో మహమ్మద్ షమీ (37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. శనివారం జడేజా ఎక్కువసేపు నిలువలేకపోయినా.. అక్షర్, షమీ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో రోహిత్ సేనకు 223 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మార్ఫే 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న తొలి టెస్టలోనే మార్ఫే తన స్పిన్తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.

ఆసీస్ గింగిరాలు..

తొలి ఇన్నింగ్స్లో భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. క్రీజులో పాతుకుపోయి పోరాడాల్సిన చోట కనీస ప్రతిఘటన లేకుండా చేతులెత్తేసింది. డగౌట్లో ఏదో ముఖ్యమైన పని ఉన్నట్లు.. క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లంతా ఎప్పుడెప్పుడు పెవిలియన్కు వెళ్దామా అన్నట్లు కనిపించారు. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (25) టాప్ స్కోరర్ కాగా.. డేవిడ్ వార్నర్ (10), లబుషేన్ (17), కారీ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. భారత బౌలర్లలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఆసీస్ను ఆల్లాడించగా.. మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 7 వికెట్లు తీయడంతో పాటు 70 పరుగులతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Exit mobile version