Home Latest News Suresh Raina | ఆసీస్‌ నిర్ణయం ఆశ్చర్యపరిచింది: సురేశ్‌ రైనా

Suresh Raina | ఆసీస్‌ నిర్ణయం ఆశ్చర్యపరిచింది: సురేశ్‌ రైనా

Image Source: Suresh Raina Facebook

Suresh Raina | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: సుదీర్ఘ పర్యటనల్లో భాగంగా టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు పర్యాటకు జట్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడటం ఆనవాయితీ! అయితే బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ ఆడేందుకు భారత్‌లో అడుగుపెట్టిన ఆసీస్‌.. టూర్‌ మ్యాచ్‌ ఆడకుండా నేరుగా తొలి టెస్టు బరిలోకి దిగనుండటం తనను ఆశ్చర్య పరిచిందని భారత మాజీ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా పేర్కొన్నాడు. గత రెండు పర్యాయాలు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ నెగ్గి ఫుల్‌ జోష్‌లో ఉండటంతో ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టు సిరీస్‌ వేడి ప్రారంభమైంది. అటు ఆసీస్‌ మాజీలు.. ఇటు భారత సీనియర్లు మాటల యుద్ధాలతో సిరీస్‌పై అంచనాలు మరింత పెంచుతున్నారు. ఈ సారి ఆస్ట్రేలియా తప్పక సిరీస్‌ నెగ్గుతుందని దిగ్గజ క్రికెటర్‌ చాపెల్‌ జోస్యం చెప్పగా.. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తాము మెరుగుపడ్డామని కంగారూలు అంటున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బెంగళూరులో ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తుండగా.. భారత జట్టు తొలి టెస్టు జరుగనున్న నాగ్‌పూర్‌ స్టేడియంలో నెట్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నది.

ప్రధానమైన పర్యటనలకు ముందు టూర్‌ మ్యాచ్‌లు ఆడటం మంచిదని రైనా అభిప్రాయపడ్డాడు. ‘నేను గతంలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేవాడిని. నిజంగా అవెంతో ముఖ్యమైనవి. అలాంటి మ్యాచ్‌లు ఆడితేనే పిచ్‌ నాణ్యత అర్థమవుతుంది’ అని రైనా చెప్పుకొచ్చాడు. ఇక టెస్టు సిరీస్‌ ప్రారంభం కాకుండానే ఎవరు గెలుస్తారో చెప్పడం సరికాదని రైనా అన్నాడు. ‘రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడం ఆనందంగా ఉంది. రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌తో పాటు జడ్డూ ఈ సిరీస్‌లో కీలకం కానున్నాడు.

ఇక బ్యాటింగ్‌లో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ మరోసారి కీలకం కానున్నారు. వీరి ఆట చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని అన్నాడు. అయితే భారత జట్టులో ప్రతి స్థానం కోసం పోటీ విపరీతంగా ఉందని.. ఇలాంటి వాతావరణం ఉండటం మంచిదే అని ఈ మాజీ ఆల్‌రౌండర్‌ పేర్కొన్నాడు. ఒకరిని మించి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉండటం మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందే అయినా దీర్ఘకాలంగా అది భారత క్రికెట్‌కు మేలుచేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన భారత అమ్మాయిలను ప్రత్యేకంగా అభినందించిన రైనా.. దేశంలో మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యత పెరుగుతోందని అన్నాడు. మహిళల ఐపీఎల్‌.. ఆటను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.

టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన సురేశ్‌ రైనా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడిగా కొనసాగాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. ‘చిన్న తలా’గా గుర్తింపు తెచ్చుకున్న రైనా.. తన ప్రాణ స్నేహితుడు మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రోజే (ఆగస్టు 15, 2020) ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cricket Australia | అశ్విన్‌ ‘డూప్‌’ బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రాక్టీస్‌.. ఎందుకిలా ?

Afridi Marriage | ఒక ఇంటివాడైన అఫ్రిది.. దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కూతురితో ‘నిఖా’

Joginder Sharma | వరల్డ్‌ కప్‌ వీరుడి వీడ్కోలు.. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన జోగిందర్‌ శర్మ

Hardik Pandya | ధోనీ అడుగుజాడల్లో హార్దిక్‌.. సారథ్య బాధ్యతతో తగ్గిన పాండ్యా స్ట్రయిక్‌రేట్‌

Hanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్‌.. రంజీలో అద్భుతం

Exit mobile version