Home Latest News IND vs AUS | టీమిండియాకు తప్పని పరాజయం.. మూడో టెస్టులో ఆసీస్ జయభేరి..

IND vs AUS | టీమిండియాకు తప్పని పరాజయం.. మూడో టెస్టులో ఆసీస్ జయభేరి..

IND vs AUS | టైమ్ 2 న్యూస్, ఇండోర్: బౌలింగ్, బ్యాటింగ్లో విఫలమైన భారత జట్టు.. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పరాజయం చవిచూసింది. ఇండోర్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుచేసింది. 76 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి గెలుపొందింది. తొలి రెండు టెస్టుల్లో రోహిత్ సేన విజయం సాధించగా.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. ఫలితంగా 4 మ్యాచ్ల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 2-1తో నిలిచింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్లూ్యటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించింది.

స్పిన్ తంటాలు..

సొంతగడ్డపై అనుకూల పిచ్‌లు తాయారు చేయించిన టీమిండియాకు.. ఆస్ట్రేలియా అదిరిపోయే షాక్ ఇచ్చింది. గత రెండు మ్యాచ్‌లో టాస్ నెగ్గలేకపోయిన రోహిత్ శర్మ.. ఇండోర్‌లో తొలుత బ్యాటింగ్ చేసే నిర్ణయం తీసుకున్నాడు. తొలి రోజు నుంచే అనూహ్యంగా స్పందించిన పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస పోరాటం కనబర్చకపోవడంతో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన 22 పరుగులే భారత ఇన్నింగ్‌లో టాప్ స్కోర్ అంటే మనవాళ్ల ఆటతీరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్ స్పిన్నర్లు కునెమన్ 5, లియాన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం సిరీస్‌లో తొలిసారి పట్టుదల కనబర్చిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసి భారీ ఆధిక్యం మూటగట్టుకుంది. ఉస్మాన్ ఖవాజా (60) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

లియాన్ ధాటికి..

రెండో ఇన్నింగ్స్‌లోనైనా మనవాళ్ల ఆట మారుతుందనకుంటే.. అదీ అత్యాశే అయింది. తొలి ఇన్నింగ్స్ తడబాటునే కొనసాగించిన భారత బ్యాటర్లు.. ఎప్పుడెప్పుడు పెవిలియన్ చేరిపోదామా అన్నట్లు క్రీజులో గడిపారు. పుజారా (59) ఒంటరి పోరాటం చేయగా.. అతడికి కనీస మద్దతు ఇచ్చే ఆటగాళ్లే కరువయ్యారు. ఒకటి నుంచి 9వ స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే అయినా.. అంతా కలిసి 163 పరుగులకు ఆలౌటయ్యారు. లియాన్ 8 వికెట్లతో విజృంభించాడు. దీంతో ఆసీస్ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నిలువగా.. ఆ జట్టు ఏమాత్రం ఇబ్బంది పడకుండా.. ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేదించింది. తొలి ఓవర్లోనే ఉస్మాన్ ఖవాజా (0) ఔట్ కాగా.. ట్రావిస్ హేడ్ (49 నాటౌట్), మార్నస్ లబుషేన్ (28 నాటౌట్) మిగిలిన పని పూర్తి చేశారు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 11 వికెట్లు పడగొట్టిన లియాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా చివరి టెస్టు జరుగనుంది.

Exit mobile version