Home Latest News RCB vs PBKS | సిరాజ్‌ సూపర్‌ స్పెల్‌.. పంజాబ్‌పై బెంగళూరు జయభేరి

RCB vs PBKS | సిరాజ్‌ సూపర్‌ స్పెల్‌.. పంజాబ్‌పై బెంగళూరు జయభేరి

RCB vs PBKS | టైమ్‌ 2 న్యూస్‌, మొహాలీ: హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (4/21) విశ్వరూపం కనబర్చడంతో పంజాబ్‌తో జరిగిన పోరులో బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) 24 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసింది. డుప్లెసిస్‌కు గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ బెంగళూరుకు సారథ్యం వహించాడు.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన డుప్లెసిస్‌ (56 బంతుల్లో 84; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), కోహ్లీ (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలతో రాణించారు. వీరిద్దరి ధాటికి 16 ఓవర్లలో 137/0తో అత్యంత పటిష్ట స్థితిలో కనిపించిన బెంగళూరు.. చివరి నాలుగు ఓవర్లలో ఆశించినంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2, అర్ష్‌దీప్‌, ఎలీస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ 18.2 ఓవర్లలో 150 రన్స్‌కు ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), జితేశ్‌ శర్మ (41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగా రెండు వికెట్లు పడగొట్టారు. వీరిద్దరూ డైరెక్ట్‌ హిట్‌ ద్వారా చెరో రనౌట్‌ చేయడం విశేషం.

దంచికొట్టిన డుప్లెసిస్‌

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది. గాయం కారణంగా నాయకత్వ పగ్గాలు పక్కనపెట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్రీజులో అడుగుపెట్టిన డుప్లెసిస్‌ బ్యాట్‌తో అదరగొట్టాడు. ఒక ఎండ్‌లో కోహ్లీ నిధానంగా ఆడినా.. మరో వైపు నుంచి డుప్లెసిస్‌ దంచికొట్టడంతో బెంగళూరు స్కోరు పరుగులు పెట్టింది. వీరిద్దరి ధాటికి పవర్‌ప్లే (6 ఓవర్లు)లో ఆర్సీబీ 59/0తో నిలువగా.. స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం మందగించింది. అడపాదడపా షాట్లు ఆడిన డుప్లెసిస్‌ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. కాసేపటికి కోహ్లీ 40 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ దాటాడు. ఈ సీజన్‌లో కోహ్లీకిది నాలుగో హాఫ్‌సెంచరీ. తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించిన అనంతరం కోహ్లీ ఔట్‌ కాగా.. మ్యాక్స్‌వెల్‌ (0), దినేశ్‌ కార్తీక్‌ (7) ప్రభావం చూపలేకపోయారు.

సిరాజ్‌ తడాఖా

శిఖర్‌ ధవన్‌ గైర్హాజరీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పంజాబ్‌ జట్టును సామ్‌ కరన్‌ నడిపించగా.. తొలి ఓవర్‌ రెండో బంతికే అథర్వ (4)ను సిరాజ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తన తదుపరి ఓవర్‌లో హార్డ్‌ హిట్టర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (2)ను కూడా సిరాజ్‌ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఈ రెండు వికెట్లు సమీక్ష ద్వారా దక్కాయి. ఈ మధ్యలో హసరంగ మాథ్యూ షార్ట్‌ (8)ను ఔట్‌ చేయడంతో పంజాబ్‌ 27/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి స్పెల్‌లో రెండు వికెట్లు తీసిన సిరాజ్‌ ఐదో ఓవర్‌లో బుల్లెట్‌ త్రోతో హర్‌ప్రీత్‌ (13)ను రనౌట్‌ చేశాడు. చివర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్‌ మరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. పంజాబ్‌ సారథి సామ్‌ కరన్‌ (10)ను హసరంగ అదిరిపోయే త్రోతో పెవిలియన్‌ చేర్చాడు. ప్రభ్‌సిమ్రన్‌, జితేశ్‌ పోరాడినా కోహ్లీ నాయకత్వంలో చివరి వరకు ఒత్తిడి కొనసాగించిన ఆర్సీబీ విజయతీరాలకు చేరింది.

Exit mobile version