Home Latest News DC vs KKR | ఎట్టకేలకు ఖాతా తెరిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. రాణించిన వార్నర్‌, ఇషాంత్‌,...

DC vs KKR | ఎట్టకేలకు ఖాతా తెరిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. రాణించిన వార్నర్‌, ఇషాంత్‌, అక్షర్‌

DC vs KKR | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో సతమతమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఖాతా తెరిచింది. ఐదు ఓటముల అనంతరం కోల్‌కతాపై ఢిల్లీ చచ్చీ చెడి విజయం సాధించింది. వర్షం కారణంగా బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట ఢిల్లీ బౌలర్లు విజృంభించడంతో కోల్‌కతా స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ కాగా.. ఛేదనలో టెస్టు మ్యాచ్‌ను తలపించిన ఢిల్లీ చివరకు గెలుపు రుచిచూసింది.

గురువారం జరిగిన రెండో పోరులో వార్నర్‌ సేన 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చేసింది. వర్షం అంతరాయం కారణంగా గంట ఆలస్యంగా ప్రారంభమైన పోరులో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. ఫలితంగా మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన జాసెన్‌ రాయ్‌ (43; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. ఆఖర్లో రస్సెల్‌ (38 నాటౌట్‌; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరితో పాటు మన్‌దీప్‌ సింగ్‌ మాత్రమే రెండంకెల స్కోరు చేయగా.. లిటన్‌ దాస్‌ (4), వెంకటేశ్‌ అయ్యర్‌ (0), కెప్టెన్‌ నితీశ్‌ రాణా (4), రింకూ సింగ్‌ (6), సునీల్‌ నరైన్‌ (4) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ, నోర్జే, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ ఐపీఎల్లో ఇషాంత్‌కు ఇదే తొలి మ్యాచ్‌.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు కోల్పోయి 128 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (41 బంతుల్లో 57; 11 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. పృథ్వీ షా (13), మిషెల్‌ మార్ష్‌ (2), ఫిల్‌ సాల్ట్‌ (5) విఫలమయ్యారు. ఆఖర్లో మనీశ్‌ పాండే (21), అక్షర్‌ (19 నాటౌట్‌) పోరాడారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, అనుకూల్‌ రాయ్‌, నితీశ్‌ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టారు. పిచ్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం లభిస్తుండటంతో కోల్‌కతా తమ స్పిన్నర్లతో 16 ఓవర్లు వేయించింది. సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, అనుకూల్‌ రాయ్‌, నితీశ్‌ రాణా నాలుగేసి ఓవర్ల కోటా పూర్తి చేసుకున్నారు.

కోల్‌కతా బౌలర్లు విజృంభిస్తుండటంతో ఢిల్లీ బ్యాటర్లు పరుగుల రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వార్నర్‌ ధాటిగా ఆడటంతో ఢిల్లికి మంచి ఆరంభం లభించినా.. దాన్ని మిడిలార్డర్‌ కొనసాగించలేకపోయింది. వరుస వైఫ్యాలలతో సతమతమవుతున్న పృథ్వీ షా మరోసారి నిరాశ పరచగా.. మిషెల్‌ మార్ష్‌, ఫిల్‌సాల్ట్‌ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ధాటిగా ఆడితే 10 ఓవర్లలో ముగిసే లక్ష్యాన్ని చివరి ఓవర్‌ వరకు తీసుకొచ్చారు. ఒకదశలో ఢిల్లీకి ఆరో పరాజయం తప్పదనిపించినా.. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ పోరాడాడు. భారీ షాట్లు ఆడకున్నా.. అవసరమైన సమయంలో సింగిల్స్‌ డబుల్స్‌ తీస్తూ జట్టును గెలిపించాడు.

Exit mobile version