Home Latest News Naveen Murder Case | నవీన్‌ హత్య తర్వాత హరిహరకృష్ణకు 1500 ఇచ్చిన నిహారిక.. లొంగిపోయే...

Naveen Murder Case | నవీన్‌ హత్య తర్వాత హరిహరకృష్ణకు 1500 ఇచ్చిన నిహారిక.. లొంగిపోయే ముందు ప్రేయసి ఇంట్లోనే స్నానం.. వెలుగులోకి సంచలన విషయాలు

Naveen Murder Case | ఎల్బీనగర్‌, టైమ్‌2న్యూస్‌ : బీటెక్‌ విద్యార్థి నవీన్ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలి కోసం ప్రాణ స్నేహితుడిని చంపడమే కాకుండా.. అత్యంత కిరాతకంగా గుండె చీల్చి.. మొండెం వేరు చేసిన హరిహర కృష్ణకు అతని స్నేహితుడు హాసన్‌, ప్రేమించిన యువతి సహకరించారని వెల్లడైంది. మొదట్నుంచి తానొక్కడే హత్య చేశానని చెప్పుకొచ్చిన హరిహరకృష్ణ.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో తడబడ్డాడు. శరీర భాగాలను ఎక్కడెక్కడ పడేశాడు.. వాటిని తిరిగి ఎలా సేకరించాడో చెప్పే సమయంలో గందరగోళానికి గురయ్యాడు. అనుమానం వచ్చిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు తమదైన శైలిలో విచారించగా తనకు హాసన్‌ సాయపడ్డాడని బయటపెట్టాడు. అంతేకాదు హత్య అనంతరం తన ప్రేయసిని కలవడమే కాకుండా ఆమెకు ఘటనాస్థలిని చూపించినట్లు షాకింగ్‌ విషయాలు చెప్పుకొచ్చాడు. దీంతో నిందితుడికి సహకరించిన స్నేహితుడు ప్రభాలితి హాసన్‌ (21), కట్టా నిహారిక రెడ్డి (20)ని నిందితులుగా చేర్చి వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

స్నేహితుడితో కలిసే..

గత నెల 17న సేనావత్‌ నవీన్‌ నాయక్‌ (22)ను నల్గొండలో విడిచిపెడతానని హరిహరకృష్ణ బైక్‌ ఎక్కించుకున్నాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ దగ్గర ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ప్రేయసి నిహారిక గురించి మాట్లాడుకుంటూ రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి నవీన్‌ను తీసుకెళ్లాడు. అక్కడే గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పెద్ద కత్తితో గుండెను చీల్చడమే కాకుండా మొండెం నుంచి తలను వేరు చేశాడు. తన ప్రేయసిని తాకిన పెదాలు, చేతి వేళ్లతో పాటు మర్మాంగాన్ని కోసేశాడు. అనంతరం బ్రాహ్మణపల్లి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో ఉంటున్న తన స్నేహితుడు హాసన్‌ ఇంటికి వెళ్లాడు. నవీన్‌ను హత్య చేశానని హాసన్‌కు చెప్పిన హరిహరకృష్ణ.. తనకు సాయం చేయాలని కోరారు. దీంతో నవీన్‌ మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ముక్కలుగా చేసిన అవయవాలతో పాటు తలను ఒక బియ్యం సంచిలో కుక్కి మన్నెగూడ ప్రాంతంలో పడేశారు. అనంతరం ఇద్దరూ హాసన్‌ ఇంటికి వెళ్లారు. హరిహరకృష్ణ రాత్రి అక్కడే రెస్ట్‌ తీసుకున్నాడు.

హత్య చేసిన ప్లేస్‌కి ప్రేయసిని తీసుకెళ్లిన హరిహరకృష్ణ.. అక్కడి నుంచి రెస్టారెంట్‌కు

నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఫొటోలను నిహారికకు హరిహరకృష్ణ వాట్సాప్‌లో పంపించాడు. కానీ ఆమె నమ్మలేదు. దీంతో మరుసటి రోజు ( గత నెల 18న ) ఉదయం హస్తినాపురంలోని క్రిస్టియన్‌ కాలనీలో ఉంటున్న నిహారిక దగ్గరకు వెళ్లి హరిహరకృష్ణ కలిశాడు. ఆమెకు ఫోన్‌ చేసి బయటకు పిలిపించాడు. నిజంగానే హత్య చేశానని నమ్మించి.. ఆమె దగ్గర ఖర్చుల కోసం రూ.1500 తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పట్నుంచి వాళ్లిద్దరూ పలుమార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. 20వ తేదీన సాయంత్రం మళ్లీ నిహారికను హరిహరకృష్ణ కలుసుకున్నాడు. ఆమెను తన బైక్‌ ఎక్కించుకుని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొంచెం దూరం నుంచే ఆ ప్రాంతాన్ని చూపించి తిరిగొచ్చారు. తర్వాత స్థానికంగా ఉన్న ఒక రెస్టారెంట్‌లో భోజనం చేశారు. అక్కడి నుంచి హరిహరకృష్ణ వెళ్లిపోయాడు.

లొంగిపోయే ముందు నిహారిక ఇంటికి..

నవీన్ కనిపించడం లేదంటూ ఫోన్లు ఎక్కువ కావడంతో దొరికిపోతానేమో అని కంగారుపడ్డ హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 24న పోలీసులకు లొంగిపోయే ముందు సాక్ష్యాధారాలు అన్నింటినీ నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. దీనికోసం మరోసారి హాసన్‌ సాయం తీసుకున్నాడు. తల, ముక్కలైన ఇతర అవయవాలను హాసన్‌ సేకరించి.. హరిహరకృష్ణకు అప్పగించాడు. వాటిని తీసుకున్న హరిహరకృష్ణ.. నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి కాల్చేశాడు. అనంతరం హాసన్‌ ఫోన్‌లోని కాల్‌ డేటా, మెసేజ్‌లు, వాట్సాప్‌ డేటా మొత్తం డిలీట్‌ చేశాడు. అదే రోజు సాయంత్రం నిహారిక ఇంటికి వెళ్లాడు. అక్కడే స్నానం చేసి.. ఆమె మొబైల్‌లోని డేటాను కూడా డిలీట్‌ చేసేశాడు. అనంతరం అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

సీన్‌ రీకన్‌స్ట్రక్చన్‌లో బయటపడ్డ ప్రియురాలి పాత్ర

కస్టడీలోకి తీసుకుని హరిహరకృష్ణను విచారిస్తే తానొక్కడే ఇదంతా చేసినట్లు ముందు నుంచి చెప్పుకొచ్చాడు. ఎక్కడా యువతి, తన స్నేహితుడి పాత్రను బయటపెట్టలేదు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో తడబడటంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయాలను బయటపెట్టాడు. దీంతో హాసన్‌, నిహారికను సోమవారం నాడు పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తొలుత తమకేమీ తెలియదని బుకాయించారు. కానీ పోలీసులు సాక్ష్యాధారాలు చూపించడంతో నిజం ఒప్పుకున్నారు. దీంతో వాళ్లిద్దరినీ కూడా నవీన్‌ హత్య కేసులో నిందితులుగా చేర్చారు. నిందితులు ఇద్దరినీ హయత్‌ నగర్‌ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు.

Exit mobile version