Home Latest News Harish Rao on Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డ హరీశ్‌రావు.. ఎన్టీఆర్ పేరు...

Harish Rao on Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డ హరీశ్‌రావు.. ఎన్టీఆర్ పేరు ఎత్తే హక్కు లేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజం

Harish Rao on Chandrababu | ఖమ్మంలో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన శంఖారావంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. చంద్రబాబు ఖమ్మంలో చేసిన షో.. గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్త అన్నట్లుగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేసి డెవలప్ చేయలేక అక్కడి ప్రజల చీత్కారానికి గురైపోయి, ఇఫ్పుడు తెలంగాణ మీద పడ్డడని విమర్శించారు. తెలంగాణను డెవలప్ చేస్తా, గతంలో నేనే చేసిన.. ఇప్పుడు మళ్లీ ఉద్దరిస్తా అని మాట్లాడే చంద్రబాబు మాటలు.. సచ్చిపోయిన బర్రె పలిగిపోయి బుడ్డెడు పాలు
ఇచ్చినట్లు ఉందన్నారు. అసలు చంద్రబాబు పాలన బాగోలేదనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం అత్యధికంగా దోపిడీకి గురైందంటే.. అత్యధికంగా నిర్లక్ష్యానికి గురైందంటే అది చంద్రబాబు తొమ్మిదేండ్ల పాలనలో జరిగిందని
విమర్శించారు.

యువతకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, రైతులకు ఇలా అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఆనాడు తెలంగాణ యువత ఉద్యోగాలు కావాలని, తెలంగాణ పల్లెలు డెవలప్ కావాలని అడిగితే నక్సలైట్ల పేరిట కాల్చి చంపిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం ఈ విషయాన్ని మరచిపోలేదన్నారు. ఉద్యోగులను గుర్రాలతో తొక్కించి వాటర్ క్యాన్లతో కొట్టించిన విషయం.. యువత, విద్యార్థులను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపిన విషయం తెలంగాణ సమాజం మరచిపోలేదన్నారు. హైదరాబాద్‌ను ఫ్రీ జోన్ చేసి, ఉద్యోగాలను ఆక్రమించి నిరుద్యోగ యువత నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. తెల్లవారుతుందంటే నా వల్లనే.. కోడి కూస్తోందంటే కూడా నావల్లనే అని చెప్పే వ్యక్తి చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.

” నల్లగొండలో ఫ్లోరోసిస్‌ను పారదోలినా అని చెబుతున్నడు. ఇంతకంటే పెద్ద జోకు ఉంటదా. ఫ్లోరైడ్ పారదోలింది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఫ్లోరైడ్ పేరుతో ఓట్లు దండుకుని ప్రజలను మోసం చేసింది మీరు. కానీ నల్లగొండ ప్రజలకు శాశ్వతంగా ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించింది కేసీఆర్. ఈ విషయం అక్కడి ప్రజలకు తెలుసు. చంద్రబాబు హయాంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో జరిగినయ్. రైతులు ఉచిత కరెంట్ ఇయ్యమని హైదరాబాద్‌కు వస్తే బషీర్‌బాగ్ చౌరస్తాలో పిట్టలను కాల్చినట్లు కాల్చిన చరిత్ర చంద్రబాబుది. రైతులకు ఉచిత కరెంట్ కావాలంటే వైర్లపై బట్టలు ఎండేసుకోవాల్సిందే అంటూ రైతులను అవమానించింది చంద్రబాబు. మీరా రైతుల గురించి మాట్లాడేది. రైతులకు సీఆర్ చేసినట్లు దేశంలో ఎవరైనా చేసినరా? రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా తీసుకొచ్చినం. మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసి 25 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం. మహబూబ్‌నగర్ ప్రజలను కల్వకుర్తి పేరుతో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మోసం చేసినరు. మేం కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరు జిల్లాను పచ్చబడేలా చేసినం. వ్యవసాయం దండగా అన్నడు చంద్రబాబు. కానీ వ్యవసాయాన్ని పండగ చేసిండు కేసీఆర్.రైతుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు” అంటూ తీవ్ర స్థాయిలో హరీశ్‌రావు విమర్శించారు.

బీజేపీతో పొత్తు కోసమే నీ డ్రామా

2018లో మహాకూటమి పేరుతో చంద్రబాబు కుట్ర చేసే ప్రయత్నం చేసిండని హరీశ్ రావు మండిపడ్డారు. ” మహాకూటమి పేరుతో కుట్ర చేసే ప్రయత్నం చేసినవ్. తెలంగాణ ప్రజలంతా ఏకమై ఆ కుట్రను గమనించి చిత్తు చేసినరు. ఇప్పుడు కూడా నీ కుట్ర ఏందో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఇదంతా డ్రామా ఆడుతున్నవ్. తెలంగాణలో బలం ఉన్నదని చూపించి అక్కడ పొత్తు పెట్టుకోవాలన్నదే నీ కుటిల ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయిన ఖమ్మంలో మీటింగ్ పెట్టి.. పక్క రాష్ట్రం నుంచి మందిని తెచ్చుకుని బలం చూపించుకునే ప్రయత్నం చేసినవ్. కానీ ఇదంతా బీజేపీతో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు కోసమే అని అందరికీ తెలుసు. 2018లో మహాకూటమి తెస్తే నీ దెబ్బకు అందరూ ఖతమైపోయినరు. నీతో ఎవరైనా పెట్టుకుంటే భస్మాసుర హస్తమే. నీ ఆటలు తెలంగాణలో నడవయ్. ఈ కష్టమేదో ఆంధ్రప్రదేశ్‌ల పడ్డా నాలుగు ఓట్లైనా పడ్తయ్. కానీ ఇక్కడ ఒరిగేదేం లేదు. జరిగేదేం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చెల్లని రూపాయి తెలంగాణలో చెల్లుతదా. అందులో తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు చెల్లుతడా. అక్కడే నువ్ చెల్లవని వెల్లగొట్టినరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకాలడుతున్నవ్” అంటూ చంద్రబాబుపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ పేరు ఎత్తే హక్కు చంద్రబాబుకు లేదు

ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ పడిన కష్టం గురించి, చేసిన పనుల గురించి అప్పుడప్పుడు కేసీఆర్ కూడా చెబుతాడన్నారు. పేదల గురించి ఆలోచించిననాయకుడు ఎన్టీఆర్ అంటూ హరీశ్‌రావు కొనియాడారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చెప్పడమంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ఉంటదన్నారు. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ.. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం కాదన్న హరీశ్.. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఏం చేసిండో తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ విలక్షణమైన నేత అని, ఆయన సంస్కరణల గురించి కేసీఆర్ చాలాసార్లు అసెంబ్లీలో చెప్పిండని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు ఎత్తే హక్కు కూడా చంద్రబాబుకు లేదంటూ మండిపడ్డారు. ఈ విషయం రాష్ట్రంలోనే కాదు దేశప్రజలకు కూడా దీనిపై స్పష్టత ఉందన్నారు.

కరోనా వ్యాక్సిన్ చంద్రబాబు వల్లేనట..

చంద్రబాబు ఉద్యమ సమయంలో తెలంగాణకు ఎట్లా ద్రోహం చేసిండో అందరికీ తెలుసన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు ఎట్లా పడ్తడో అందరికీ తెలుసని హరీశ్‌రావు విమర్శించారు. “కరోనాకు వ్యాక్సిన్ నావల్లనే వచ్చిందంటుండు చంద్రబాబు. ఇంకో పార్టీ వాళ్లు నరేంద్రమోదీ వల్లనే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటరు. కనిపెట్టిన శాస్త్రవేత్తలు పోయనరు. కంపెనీ పోయింది. నా వల్లనే వ్యాక్సిన్ వచ్చిందని చంద్రబాబు, నా వల్లనే వ్యాక్సిన్ వచ్చిందని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నరు. వీళ్లను ఏమనాలో కూడా అర్థమైతలే. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఎలా డెవలప్ అయిందో ప్రజలకు క్లారిటీ ఉంది. తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి దిక్సూచీగా మారింది. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలకు
దేశానికి మోడల్ గా నిలిచినయ్. ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టి అమలు చేయడం అనేది తెలంగాణ ప్రజలకు గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం” అని హరీశ్ రావు అన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

DMHO Srinivasa rao | ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది.. తెలంగాణ డీఎంఎచ్‌ఓ శ్రీనివాస్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

కరోనా లాక్‌డౌన్‌ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు

Omicron BF.7 variant | భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ BF.7.. చైనాను అతలాకుతలం చేస్తోంది ఇదే

Adar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ..

Exit mobile version