Home Latest News Srilanka | శ్రీలంకకు ఘోర అవమానం.. 44 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయిన...

Srilanka | శ్రీలంకకు ఘోర అవమానం.. 44 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయిన లంక

Srilanka | టైమ్‌ 2 న్యూస్‌, వెల్లింగ్టన్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతున్న లంక.. ఈ ఏడాది భారత్‌లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించలేకపోయింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో లంక 0-2తో వైట్‌వాష్‌కు గురవడంతో మెగాటోర్నీ బెర్త్‌ దక్కించుకోలేకపోయింది.

1979లో వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు క్వాలిఫయర్స్‌ ఆడిన శ్రీలంక.. మళ్లీ 44 ఏళ్ల తర్వాత ఇప్పుడు క్వాలిఫయర్స్‌ ఆడాల్సిన పరిస్థితిలో నిలిచింది. క్వాలిఫయర్స్‌లో సత్తాచాటిదే మెగాటోర్నీలో ఆడే అవకాశం ఉంటుంది. లేకపోతే.. 1996లో వన్డే విశ్వ విజేతగా నిలిచిన లంక.. అవమానకర రీతిలో మెగాటోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. 27 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్‌ నెగ్గడంతో పాటు సనత్‌ జయసూర్య, కుమార సంగక్కర, జయవర్ధనే, ముత్తయ్య మురళీధరన్‌, తిలకరత్నె దిల్షాన్‌, లసిత్‌ మలింగ వంటి సూపర్‌ స్టార్లను ప్రపంచ క్రికెట్‌కు అందించింది. 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక.. 2003లో సెమీఫైనల్‌, 2015లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడ ప్రదర్శిస్తూ పెద్ద జట్టుగా ఎదిగిన లంక.. ఇటీవలి కాలంలో తిరోగమన దిశగా పయనిస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు.. నేరుగా క్వాలిఫై అవుతాయి. ఆతిథ్య హోదాలో భారత్‌ నేరుగా అర్హత సాధించగా.. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన జట్లు మెగాటోర్నీ బెర్త్‌ కోసం క్వాలిఫయింగ్‌ టోర్నీలో తలపడాల్సి ఉంది. అక్కడ దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌, జింబాబ్వే, నెదర్లాండ్స్‌ వంటి జట్లతో పాటు సీడబ్లూ్యసీ లీగ్‌ టాప్‌లో నిలిచిన జట్లు మెగాటోర్నీ బెర్త్‌ కోసం పోటీ పడనున్నాయి.

మూడో వన్డేలో 157 ఆలౌట్‌..

న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం జరిగిన మూడో వన్డేలో లంక 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 41.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ పతుమ్‌ నిషాంక (57) అర్ధశతకంతో రాణించగా.. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. కుషాల్‌ మెండిస్‌ (0), ఏంజెలో మాథ్యూస్‌ (0) డకౌటయ్యారు. కెప్టెన్‌ దసున్‌ షనక (31), చమిక కరుణరత్నె (24) ఫర్వాలేదనిపించగా.. నువిండు ఫెర్నాండో (2), చరిత అసలంక (9), ధనంజయ డిసిల్వ (13) వైఫల్యాన్ని కొనసాగించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, షిప్లే, డారిల్‌ మిషెల్‌ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 32.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. విల్‌ యాంగ్‌ (86 నాటౌట్‌; 11 ఫోర్లు), హెన్రీ నికోల్స్‌ (44 నాటౌట్‌) రాణించారు. ఒక దశలో 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కివీస్‌ను వీరిద్దరూ అజేయంగా నిలిచి విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు తొలి వన్డేలో న్యూజిలాండ్‌ జయభేరి మోగించగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IPL 2023 | అట్టహాసంగా ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు.. సందడి చేసిన తమన్నా, రష్మిక మందానా.. హోరెత్తిన తెలుగు పాటలు

Gwyneth Paltrow | ఏడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి ఒక్క డాలర్‌ పరిహారం పొందిన ఐరన్‌ మ్యాన్‌ హీరోయిన్‌.. కేసు గెలిచినందుకు ఫుల్‌ హ్యాపీ

Virus Alert | ఆఫ్రికాలో కలకలం సృష్టిస్తున్న కొత్త వైరస్.. సోకిన 24 గంటల్లో ముక్కు నుంచి తీవ్ర రక్తస్త్రావం.. ముగ్గురు మృతి

Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Exit mobile version