Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsBandi Sanjay on BRS sabha | బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్.. మహిళలు అంటే...

Bandi Sanjay on BRS sabha | బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్.. మహిళలు అంటే కేసీఆర్ బిడ్డ కవిత ఒక్కరేనా.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay on BRS sabha | ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ జోకర్ మాటలేనని అన్నారు. కేసీఆర్ జిమ్మిక్కులు, మాటలను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని అన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని.. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. తెలంగాణలోని ఏ గ్రామంలోనైనా 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు కేసీఆర్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

తెలంగాణలో రైతుబంధు ఒక్కటి ఇచ్చి అన్ని సబ్సిడీలు ఎత్తేశారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌కు దళితుల గురించి మాట్లాడే హక్కేలేదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించింన రాజ్యాగాన్ని కేసీఆర్ అవమానించిండని, అంబేద్కర్ జయంతి, వర్ధంతికి కూడా హాజరు సీఎం దళితులకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. దేశం మొత్తం దళితబంధు ఇస్తా అని గొప్పలు చెబుతున్న కేసీఆర్.. రాష్ట్రంలో ఎంత మంది దళితులకు రైతుబంధు ఇచ్చాడో చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా పాలసీ రూపొందించిందని అన్నారు. ఒక్కో దళితునికి రూ.10 కోట్ల రుణం ఇచ్చి పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తుందన్నారు.

తెలంగాణలో రాబోయేది బీజేపీ సర్కారే

తెలంగాణలో ఏ ఊరిలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్న బండి.. ఇస్తున్నట్లు నిరూపించేందుకు కేసీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. పొలం కాడ ఉచిత కరెంట్ ఇస్తూ.. ఇంటి దగ్గర కరెంట్ బిల్లులు పెంచిండని మండిపడ్డారు. ఇప్పుడిస్తున్న ఉచిత కరెంట్‌‌కు సంబంధించి డిస్కమ్ లకు వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటి వల్ల డిస్కమ్‌లు దివాలా తీసే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిస్కమ్‌లకు బిల్లులు చెల్లించేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. అంటే ఉచిత కరెంట్ బీజేపీ ఇస్తున్నట్లే అయితదని చెప్పారు. తెలంగాణలో రైతులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని అన్నారు.

కాళేశ్వరం కడితే బోర్లు తగ్గాలి కానీ ఎందుకు పెరిగినయ్

గోదావరిలో 800 టీఎంసీలు వాడుకునే హక్కుంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 150 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతుందని అన్నారు. కృష్ణా జలాల్లో 500 టీఎంసీల తెలంగాణ వాటా ఉంటే 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నాడని, ఇప్పుడు అవి కూడా వాడుకునే ఆలోచన లేదని అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి నీళ్లు తరలిస్తుంటే కేసీఆర్ తాగి ఇంట్లో పండుకుంటుండని ఆరోపించారు. తెలంగాణలో 21 డ్యాములను 8 ఏండ్ల నుంచి ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతుందని అన్నారు. తెలంగాణలో 2014లో 18 లక్షల బోర్లు ఉండేవని, ఇప్పుడవి 24 లక్షలకు పెరిగినయన్నారు. కాళేశ్వరం కడితే బోర్లు తగ్గాలి కానీ ఎందుకు పెరిగినయో కేసీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

డిఫెన్స్ మీద పాలసీ ఉందా

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డిఫెన్స్ మీద పాలసీ ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. దాని మీద ఒక్కసారైనా ఆలోచించినవా అంటూ మండిపడ్డారు. అగ్నిపథ్ అనేది దివంగ బిపిన్ రావత్ ఆలోచన అని, ఆయన కంటే కేసీఆర్ పోటుగాడా అంటూ ఎద్దేవా చేశారు. పాత పద్ధతి తీసుకొస్తా అంటే.. నెహ్రూ జమానాకు తీసుకెళ్తావా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోలీసులకు ప్రమోషన్లు రావట్లేదని, వారికి ఇచ్చే బెనిఫిట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదని అన్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్ పేరు చెప్పి.. నిబంధనలు మార్చి 2 లక్షల మందిని రోడ్ల మీద పడేలా కేసీఆర్ చేశాడని మండిపడ్డారు.

ఇరానీ చాయ్.. ఇరాన్‌లో తయారవుతుందా

కేసీఆర్‌కు మేకిన్ ఇండియాను అవమానిస్తున్నడని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకిన్ ఇండియాను.. జోకిన్ ఇండియా అంటూ చులకన చేస్తున్నాడని ఆరోపించారు. సికింద్రాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ మేకిన్ ఇండియాలో భాగంగా తయారైందేనని అన్నారు. ప్రపంచంలో మొబైళ్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందని అన్నారు. ఆయుధాలను భారత్‌లోనే తయారు చేస్తున్నామని, ఇక్కడి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నామని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు ఇక్కేడే తయారు చేస్తున్నం, బొమ్మల తయారీలో నంబర్ వన్ స్థానానికి చేరుతున్నాం అని బండి సంజయ్ పేర్కొన్నారు. చైనా బజార్ గురించి బండి సెటైర్లు వేశారు. చైనా బజార్‌ అని పేరు పెట్టినంత మాత్రాన అవన్నీ చైనాలో తయారైనట్లేనా అని ప్రశ్నించారు. ఇరానీ చాయ్.. ఇరాన్ ల తయారవుతుందా ? మైసూర్ పాక్ అంటే మైసూర్‌లో తయారవుతుందా ? మైసూర్ శాండల్ అంటే మైసూర్‌లో తయారవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ జిమ్మిక్కులు, మాటలను ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు.

మహిళలు అంటే కేసీఆర్ బిడ్డ ఒక్కరేనా?

మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పుకునే కేసీఆర్.. గత కేబినెట్‌లో, ఇప్పుడు ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిండని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లు చించేసిన పార్టీ సమాజ్ వాదీ పార్టీ అని, అలాంటి పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను పక్కన కూర్చొబెట్టుకుని మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మహిళలంటే కేసీఆర్ దృష్టిలో ఆయన బిడ్డ కవిత మాత్రమేనని అన్నారు. నీ బిడ్డ లంగ దందా చేస్తుందో.. దొంగ దందా చేస్తుందో కానీ దేశం మొత్తం వెలుగుతుందని గొప్పలు చెప్పుకుంటున్నావ్ అని మండి పడ్డారు.

తెలంగాణ ద్రోహి కేసీఆర్..

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్నే ఇప్పుడు కేసీఆర్ మరచిపోయిండన్నారు. ఖమ్మం సభలో ఆ ఊసే లేదన్నారు. కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని.. మేం కష్టపడి తెలంగాణ సాధించి ముఖ్యమంత్రిని చేస్తే జై తెలంగాణ అనడానికి కేసీఆర్ వెనకడుగు వేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ అసలైన తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు.

కేటీఆర్ దావోస్ పర్యటన ఫొటో షూటింగుల కోసమే..

కేటీఆర్ దావోస్ పోయి 2 వేల కోట్లు పట్టుకొచ్చినా అని గొప్పలు చెప్పుకుంటుండు.. కానీ ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వచ్చి 25 వేల కోట్ల పెట్టుబడులు తీసుకుపోయిండని బండి సంజయ్ అన్నారు. కేవలం సినిమా, ఫొటో షూటింగ్‌ల కోసమే కేటీఆర్ దావోస్ పోయిండన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే.. ముఖ్యమంత్రికి కమీషన్లు ఇయ్యాలని, అవి ఇయ్యలేకే తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని ఆరోపించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | బీఆర్‌ఎస్‌ పార్టీని అందుకే పెట్టాల్సి వచ్చింది.. ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

KCR | వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతాం.. ఖమ్మం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

Aravind Kejriwal | ఖమ్మం సభలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

CM KCR | బీఆర్‌ఎస్‌ పార్టీని అందుకే పెట్టాల్సి వచ్చింది.. ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News