Home Latest News Big challenge to congress | హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ముఖ్యమంత్రి సీటు కోసం...

Big challenge to congress | హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి.. ముఖ్యమంత్రి సీటు కోసం నాలుగు ముక్కలాట

Big challenge to congress | హిమాచల్‌ ప్రదేశ్‌లో గెలవడం సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్‌కి తలనొప్పిగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. నేనంటే నేను అంటూ ముఖ్యమంత్రి సీటు కోసం బల ప్రదర్శనలు మొదలు పెట్టారు అక్కడి నాయకులు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్‌ పార్టీ తలలు పట్టుకుంది.

పార్టీ పరిశీలకులుగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ను కాంగ్రెస్‌ పార్టీ హిమాచల్‌ ప్రదేశ్‌ కు పంపించింది. షిమ్లాలోని రాడిసన్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు సమావేశమై ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని ఖరారు చేయనున్నారు. ఈ సమావేశానికి వచ్చిన భూపేశ్‌ బఘేల్‌ కారును హోటల్‌ ముందే అడ్డుకొని హిమాచల్‌ ప్రదేశ్ కాంగ్రెస్‌ చీఫ్‌, మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ భార్య ప్రతిభా సింగ్‌ అనుచరులు అడ్డుకుని బల ప్రదర్శన చేపట్టారు. ప్రతిభా సింగ్‌కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నినాదాలు చేశారు.

ఆయన పనితీరే కాంగ్రెస్‌ను గెలిపించింది

మరోవైపు కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికంటే ముందే ప్రతిభా సింగ్‌ మీడియాతో మాట్లాడారు. తన భర్త దివంగత మాజీ సీఎం వీరభద్ర సింగ్‌ పేరు, ఆయన పనితీరు వల్లనే కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను విస్మరించలేరంటూ వ్యాఖ్యానించారు. ఆ క్రెడిట్‌ మరొకరి ఇవ్వడం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి సీటు కోసం నలుగురు పోటీ

ప్రతిభా సింగ్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, మాజీ సీఎల్పీ నేత ముఖేశ్‌ అగ్నిహోత్రి, మరో నేత హర్షవర్ధన్‌ చౌహాన్‌ కూడా సీఎం సీటు కోసం ఆశపడుతున్నారు. ఈ నలుగురు నాయకుల మధ్య సయోధ్య కుదుర్చితేనే సీఎం ఎంపిక కాంగ్రెస్‌కు సులువు కానుంది. లేదంటే అసమ్మతి రేగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఈలోగా బీజేపీ ఆపరేషన్‌ మొదలుపెడితే.. కాంగ్రెస్‌ కు కష్టమేనని అంటున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Exit mobile version