Home Latest News SaiChand | తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు సాయిచంద్ అకాల మరణం.. భావోద్వేగానికి గురైన సీఎం...

SaiChand | తెలంగాణ మలిదశ ఉద్యమ గాయకుడు సాయిచంద్ అకాల మరణం.. భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్

SaiChand | తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్య పరిచిన గాయకులు సాయిచంద్ హఠాన్మరణం చెందారు. గుండెపోటు రావడంతో 39 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. బుధవారం సాయంత్రం నాగర్‌కర్నూలు జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌‌కి సాయిచంద్ కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. అక్కడే అర్ధరాత్రి సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతోసాయిచంద్‌ను హుటాహుటిన నాగర్‌కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటనే గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడే చికిత్స పొందుతూ సాయిచంద్ తుదిశ్వాస విడిచారు. సాయిచంద్‌కు భార్య, కూతురు ఉన్నారు.

ఇదీ సాయిచంద్ నేపథ్యం.

వనపర్తి జిల్లా అమరచింతలో 1984 సెప్టెంబర్ 20న సాయిచంద్ జన్మించారు. పీజీ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుంచే కళాకారుడిగా, గాయకుడి పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో సమయంలో తన పాటలతో ఎంతోమందిలో ఉద్యమస్ఫూర్తి రగలించారు. ముఖ్యంగా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. పాట ఉద్యమ సమయంలో చాలా పాపులర్ అయ్యింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రగతిని, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా పలు పాటలు పాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాయిచంద్ చేస్తున్న కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్.. 2021 డిసెంబర్‌లో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌ పదవినిచ్చి గౌరవించారు.

సాయిచంద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

సాయిచంద్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ తదితరులు నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుణ్ని కోల్పోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న సాయిచంద్ అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

కేటీఆర్ భావోద్వేగం

తెలంగాణ ఉద్యమంలో తన అరుదైన కళా నైపుణ్యం, గాత్రంతో అలరించిన తమ్ముడు సాయిచంద్ మరణం చాలా బాధాకరమని మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటు అని అన్నారు. ఆయన హైదరాబాద్‌లోనే ఉండి ఉంటే బతికి ఉండేవాడేమో అని అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబాన్ని చూస్తే జాలేస్తోందని.. వారికి సర్దిచెప్పే పరిస్థితి మాకెవరికీ లేదంటూ బాధపడ్డారు.

Exit mobile version