Home Lifestyle Do you know World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి...

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

World Idli Day | ఉదయం పూట మనం తినే టిఫిన్స్ దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ, వడ.. ఇలా ఎన్ని ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది మాత్రం ఇడ్లీనే. ఒంట్లో బాగాలేకపోయినా, జ్వరంతో బాధపడేవారికి కూడా సులభంగా జీర్ణం కాగల అమృత శక్తిగా ఇడ్లీని గుర్తిస్తారు. నీటి అవిరితో ఉడికే ప్రత్యేకత కల్గిన ఏకైన వంటకం ఇడ్లీ మాత్రమే. సాంబార్ ఇడ్లీ అంటే ఇక నోరూరాల్సిందే.

టిఫిన్స్‌ అనగానే ముందుగానే గుర్తొచ్చేది ఇడ్లీ. ఏ హోటల్‌కు వెళ్లినా అక్కడి లిస్ట్‌లో ఫస్ట్‌ కనిపించే పేరు ఇడ్లీనే. సాఫ్ట్‌గా ఉండటంతో పాటు తొందరగా జీర్ణమవుతుంది అందుకే దీన్ని చాలామంది ప్రిఫర్‌ చేస్తుంటారు. ఆయిల్‌ లేకుండా దీన్ని వండుతారు కాబట్టి డైట్‌ ఫాలో అయ్యే వాళ్లు కూడా మస్ట్‌గా దీన్ని తింటుంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో ఇడ్లీకి విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. తమిళనాడులో ప్రతిరోజు లక్షలాది మంది ఇడ్లీని తింటుంటారని ఒక అంచనా. అక్కడే కాదు ఆంధ్రపదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ర్టాల్లో కోట్ల ఇడ్లీలను జనాలు తినేస్తున్నారు. ఇంతకీ ఇడ్లీ భారతీయ వంటకమేనా? ఇడ్లీల్లో ఎన్నిరకాలు ఉన్నాయో తెలుసా? అసలు ఇడ్లీ పేరుతో ఒక రోజుందని ఎంతమందికి తెలుసు?

ఇడ్లీ ఇండియాకు ఎలా వచ్చింది?

ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకం అని భావిస్తాం. కానీ ఈ ఇడ్లీ అనేది ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చింది. ఇది ఇండోనేషియాలో పుట్టిందని చరిత్రకారుడు, ఫుడ్ హిస్టోరియన్ కే.టి ఆచార్య వెల్లడించారు. ఒకప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలను కనుగొన్నారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారు చేయడం మొదలుపెట్టారట. 800-1200 సంవత్సరాల మధ్య ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టింది. మనదేశంలో తొలిసారి కర్ణాటకలో ఇడ్లీలను తయారు చేశారు. వాటిని ఇడ్డలిగే అని పిలిచేవారు. వీటిని సంస్కృతంలో ఇడ్డరికా ( ఉడికించిన పదార్థం ) అని పిలిచేవారట.

దక్షిణాది వంటకం ఎలా అయ్యింది?

కైరోలోని అల్-అజహర్ యూనివర్సిటీ లైబ్రరీలో ఉన్న కొన్ని రచనల ప్రకారం.. దక్షిణ భూభాగంలో నివసించిన అరబ్ వ్యాపారులు ఇండియాకు రావడం ద్వారా ఇడ్లీని ఇక్కడ పరిచయం చేశారని తెలుస్తున్నది. వారు దక్షిణాది ప్రజలను వివాహం చేసుకుని స్థిరపడటం వల్ల ఇడ్లీ దక్షిణాది వంటకంగా పేరొందింది. ముస్లిం వంటకాలైన హలీమ్‌లా కొంచెం ప్రత్యేకంగా కనిపించేందుకు రైస్ బాల్స్ (ఉడికించిన బియ్యం ఉండలు) తయారు చేసేవారట. క్రమేణా వాటిని గుండ్రంగా సన్నగా ప్రస్తుతం ఉన్న ఇడ్లీల రూపంలోకి మలిచి కొబ్బరి చట్నీతో తినడాన్ని అలవాటు చేసుకున్నారట. 8వ శతాబ్దం నుంచి ఆ రైస్ బాల్స్.. ఇడ్లీ పేరుతో ప్రచారంలోకి వచ్చి దేశమంతటా వ్యాపించాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఇడ్లీలు ఎప్పుడు.. ఎక్కడ పుట్టినా ప్రపంచమంతా దీన్ని ఇండియన్‌ వంటకంగానే చూస్తున్నారు.

Exit mobile version