Chilkur Balaji Temple | కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్లందరూ చూడాలనుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్. తెలంగాణ తిరుమలగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకుని.. మనసులో స్వామివారిని కోరికలు కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి రోజూ వేలాది మంది చిలుకూరు దర్శనానికి వస్తుంటారు. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. సెలవు రోజులైతే ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తారు. అయితే ఎందుకు ఇంత మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు? ఈ ఆలయం చరిత్ర.. ప్రత్యేకత ఏంటి ? ఓసారి లుక్కేయండి..
Chilkur Balaji Temple ఆలయ నిర్మాణం వెనుక చరిత్ర..
చిలుకూరి బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి చిలుకూరులో ఉండేవారు. ఆయన ప్రతి సంవత్సరం ఎంత కష్టమైనా కానీ కాలినడకన తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. వయసు పైబడినాగానీ కాలినడకన వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మాత్రం ఆపలేదు. అలా ఒకసారి మాధవరెడ్డి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా మార్గం మధ్యలో అలసిపోయి సొమ్మసిల్లి పడిపోయారు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో మాధవరెడ్డికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు.
మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి కాలినడకన రావాల్సిన అవసరం లేదు. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా. వెలికి తీసి గుడి నిర్మించమని చెప్పి మాయమయ్యాడట. నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి చిలుకూరు చేరుకుని ఇదే విషయాన్ని గ్రామస్థులకు చెప్పాడు.
దీంతో అందరూ కలిసి పుట్ట వద్దకు వచ్చి గునపాలతో పెకిలించారు. అయితే పుట్టలో ఉన్న బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం తగిలి రక్తం వచ్చింది. అలా దొరికిన బాలాజీకి గ్రామస్తులు అక్కడే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆలయంలో కొలువైన బాలాజీ విగ్రహం ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. అయితే చిలుకూరి బాలాజీ దేవాలయంలో 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు.

ఈ రావి చెట్టు వెరీ వెరీ స్పెషల్..
బాలాజీ ఆలయం ప్రాంగణంలో 450 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. ఈ చెట్టును తాకి శివ దర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరుతాయనేది భక్తు ల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో శివాలయం, ఉపాలయాలుగా సుందరేశ్వర, హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 :45 వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
ఇక్కడ అందరూ సమానమే..
ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయం. ఇక్కడ అందరూ సమానమే. ఇక్కడ ప్రత్యేక పూజలు, వీఐపీ దర్శనాల వంటివి ఏమీ ఉండవు. అందరికీ ఒకటే క్యూలైన్. దర్శన సమయంలో విరామం ఉండదు. ఈ ఆలయానికి వచ్చిన ప్రతిఒక్కరూ రూల్స్ పాటించాల్సిందే. ఇక్కడ హుండీ కూడా ఉండదు. హారతులు ఇచ్చినప్పుడు కానుకలు కూడా వేసే అవకాశం ఉండదు.
వీసా గాడ్..
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కును చెల్లించుకుంటారు. ఇంజినీరింగ్ పూర్తైన విద్యార్థులు చిలుకూరు బాలాజీని దర్శించుకొని మొక్కుకుంటే వీసా వస్తుందనే బాగా నమ్ముతారు. అందుకే ఈ స్వామికి వీసా గాడ్ అని కూడా పేరొచ్చింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే
Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?