Saleswaram Temple | మీరు ఎప్పుడైనా శ్రీశైలం ( Srisailam ) వెళ్లారా? ఆ పక్కనే ఉన్న సలేశ్వరం ( Saleswaram ) శివయ్య గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది చాలా ఫేమస్. చుట్టూ అడవి, కొండలు కోనలు, జలపాతాల మధ్య ఎంతో రమణీయంగా ఉంటుంది ఈ ఆలయం. ఆదిమవాసి యాత్రస్థలంగా దీనికి పేరు. ఇక్కడ ఈశ్వరుడు లింగం రూపంలో దర్శనమిస్తాడు. సలేశ్వరం లోయలో ఉండే గుహాలో ఈ లింగం ఉంటుంది. ఏడాదిలో మూడు రోజులు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఇవాల్టి (బుధవారం) నుంచి 7వ తేదీ వరకు మాత్రమే భక్తులకు ఈ గుడిలోకి అనుమతిస్తారు. ఇదే దీని ప్రత్యేకత.
ఎలా వెళ్లాలి?
నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అడవు ( Nallamala Forest )ల్లో సలేశ్వరం ఆలయం ( Saleswaram Temple ) ఉంది. శ్రీశైలం-హైదరాబాద్ రహదారి నుంచి ఇక్కడికి వెళ్లాలి. ప్రధాన రహదారి నుంచి అడవిలోంచి వెళితే 35 కిలోమీటర్ల దూరం. అందులో 30 కిలోమీటర్లు వాహనాల్లో వెళ్లొచ్చు. మరో ఐదు కిలోమీటర్లు రాళ్లు, రప్పల్లో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. సలేశ్వరం లోయ దాదాపు రెండు కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో చెంచుల గుడారాలు ఉంటాయి. ఇక్కడి జలపాతాలు ప్రతిఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తాయి.

మూడు రోజులే తెరచి ఉంటుంది..
దట్టమైన నల్లమల అడవిలో ఉండే సలేశ్వరం ఏడాదిలో కొన్ని రోజులే తెరచి ఉంటుంది. చైత్ర పౌర్ణమి రోజునే ఈ ఆలయాన్ని తెరుస్తారు. చైత్ర పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటు జాతర జరిగే సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం జంతువుల సంచారం ఎక్కువగా ఉంటడం వల్ల మిగతా రోజుల్లో అనుమతించరు. సలేశ్వరం ఆలయాన్ని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, కర్నాటక , ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు ఎక్కువగా వస్తారు.
పురాణాల్లోనూ సలేశ్వరం ప్రస్తావన
అతి పురాతనమైన దేవాలయమైన సలేశ్వరం గురించి పురాణాల్లోనూ ప్రస్తావించారు. గుడి శంఖు ఆకారంలో ఉంటుంది. పరమశివుడికి అంకితం చేసిన ఈ గుడిని ఆరో శతాబ్దంలో కట్టారు. నల్లమలలో ఉండే చెంచులే ఈ ఆలయంలో పూజలు చేయడం ఆనవాయితీ. నైవేద్యంగా ఇప్పపువ్వు, తేనెను పెడతారు. చెంచులు తమ సలేశ్వర శివయ్యను తమ కులదైవంగా భావిస్తారు. ప్రకృతిలో గడపాలనుకునేవారికి ఈ ప్రదేశం అద్భుతంగా కనిపిస్తుంది.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
ఒక వ్యక్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అతని సొంతమవుతుంది?