Inavolu Mallanna Jatara | తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే జానపదుల జాతర ఐనవోలు. పుట్టమన్నుతో పూజలు అందుకునే మల్లికార్జున స్వామి కొలువుదీరిన ప్రాంతం ఐనవోలు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన దివ్యమంగళ క్షేత్రమిది. ముఖ్యంగా శివ భక్తులకు ప్రీతికరమైన క్షేత్రం. ధ్వజారోహణంతో సంక్రాంతి పండుగకు ముందు ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు కొనసాగడం ఇక్కడ ప్రత్యేకత. ఒగ్గు కథలు, దేవుడి పట్నాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, భక్తుల బోనాలతో ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. మూడు నెలలపాటు కొనసాగే బ్రహోత్సవాలతో జానపదుల జాతరగా గుర్తింపు పొందింది. శుక్రవారం ( ఈ నెల 13 ) నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐనవోలు మల్లన్న ఆలయ విశిష్ఠత.. చరిత్రపై ఓ సారి లుక్కేయండి..

11 వందల ఏళ్ల చరిత్ర..
చాళుక్య, కాకతీయ నిర్మాణ శైలిలో ఐనవోలు మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అద్భుత శిలాసంపదకు నిలయమైన ఈ దేవాలయంలో అష్టోత్తర స్తంభాలు, విశాల ఆలయ ప్రాంగణం, రాతి ప్రాకారాలతో ఎంతో అందంగా నిర్మితమైంది. రాష్ట్ర కూటుల కాలంలోనే ఐనవోలు గ్రామం ప్రస్తావన ఉంది. రాష్ట్ర కూట రాజు కృష్ణ 2 పాలన క్రీ.శ 850 నుంచి 914 వరకు కొనసాగింది. అంటే దాదాపు 1100 ఏళ్ల నుంచే ఐనవోలు ఉందని చారిత్ర క ఆధారాలను బట్టి తెలుస్తోంది. కాలక్రమేణా ఈ ప్రాంతాన్ని వెలమ రాజులు పరిపాలన చేసినట్లుగా ఇక్కడి శిలాశాసనంలో ఉంది. కాలక్రమంలో మార్నేని వంశస్తులు 1966లో దేవాదాయ శాఖకు బాధ్యతలు అప్పగించారు. కాకతీయుల చరిత్రకు ఐనవోలు దేవాలయంతో పాటుగా గ్రామ సమీపంలోని దేవునిగుట్ట, పెద్ద చెరువులు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి.

ఆలయ విశేషాలు
పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యు ( సా .శ. 1076-1127) ని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరిట అయ్యన-ప్రోలుగా పిలువబడి కాలాంతరంలో అయినవోలు, ఐనవోలుగా పిలువబడుతున్నది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింపబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది. ఇటువంటి నిర్మాణం, చాళుక్య కాలానికే చెందిన వరంగల్లు భద్రకాళి దేవాలయంలో కనిపిస్తుంది. క్రీ.శ.1369 ప్రాంతంలో ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించిన అనపోతనాయుడు మల్లిఖార్జునస్వామిని పూజించి యుద్ధ్దాలలో విజయాలు సాధించడం వల్ల ఈ గ్రామానికి ఐనవోలుగా పేరు వచ్చినట్లు మరో కథనం ఉంది.

కాకతీయ కీర్తితోరణాలు మొదట ఏర్పాటైంది ఇక్కడే
మల్లన్న ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తితోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణానికి పూర్వమే వీటిని నిర్మింపజేశాడు. కాకతీయ ప్రోలరాజు ఒకరోజున వేయిస్తంభాల దేవాలయంలోనిద్రలో ఉన్న తనకుమారుడు రుద్రదేవుణ్ణి పుత్రవాత్సల్యంతో స్పృశించగా నిద్రలో ఉన్న రుద్రదేవుడు, తనను ఎవరో శత్రువులు చంపడానికి వచ్చినారని భావించి, తన మొలలోఉన్న కైజారును తీసి రుద్రదేవుణ్ణి పొడుస్తాడు. తండ్రి చావుకు కారకుడనైనానన్న పాపభీతితో ఐనవోలు ఆలయానికి శిలాతోరణాలను నిర్మింపజేశాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయం ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాత:కాల నృత్యం చేసేవారు.
10 అడుగుల ఎత్తులో స్వామివారి రూపం..
సుమారు 10 అడుగుల ఎత్తులో విశాల నేత్రాలు, కోర మీసాలతో మల్లన్న రూపం దర్శనమిస్తుంది. కోర మీసాల మల్లన్న ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలంతో ఖండేలు రాయుడిగా దర్శనమిస్తారు. ఇరువైపు గొల్లకేతమ్మ, బలిజమేడలమ్మ కొలువుదీరి ఉంటారు. కుడి పాదం కింద మల్లన్న చేతిలో చనిపోయిన మాణిమల్లసూరుల శిరస్సులు కనిపిస్తాయి. వీటి ముందు భాగంలో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, ఖండేల రాయుడు అని కూడా పిలుస్తారు. కర్ణాటక పాంత్రంలో పుట్టిన ఖండేలురాయుడు కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు పరిపాలించాడు. ఆయన ఇద్దరి భార్యలలో బలిజమేడల్లమ్మ కర్ణాటక ప్రాంతవాసి. రెండో భార్య గొల్లకేతమ్మ మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన వారుగా చెబుతారు. తమ ఆడపచు గొల్లకేత్మమ్మను పెళ్లి చేసుకున్నందున మల్లికార్జునస్వామిని వారి ఇలవేల్పుగా గొల్లకురుమలు పసుపు బండారితో పూజిస్తారు.
జానపదుల జాతర
మల్లన్న ప్రధానంగా యాదవుల, కురుమల ఇష్టదైవం. సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో ఐనవోలులో జాతర జరుగుతుంది. బోనాలు చేసి స్వామివారికి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. ఒగ్గు పూజారులు ఢమరుకాన్ని వాయిస్తూ, రంగురంగుల ముగ్గులేసి, జానపద బాణిలో స్వామివారి కథాగానాన్ని చేస్తారు.

ఆలయ నిర్వహణ వారిదే..
కాకతీయుల కాలం నుంచి ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్తులు దేవాలయ నిర్వహణను చూసేవారు. ఆలయంలో 50 శాతం మార్నేని వంశస్తులకు చెందితే మరో 50 శాతం ఒగ్గు, తమ్మల్ల పూజారులు, నాయి బ్రాహ్మణులు, రజకులకు హక్కుగా ఉండేది. ఈ దేవాలయ స్థలం కూడా పూర్తిగా మార్నేని వంశస్తులదే కావడంతో 1968కి ముందు జాతరలో షిడిరథం, కుక్కల కొట్లాట, చల్లకుండల నెత్తుట, తలబండారి పెట్టుకొని మొక్కుల చెల్లించుట తదితర కార్యక్రమాలను వినోదాత్మకంగా నిర్వహించేవారు. కానీ ఈ ఆటలు హింసాత్మకంగా ఉన్నాయని ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. ఆ తరువాత 1969 సంవత్సరంలో మార్నేని వంశస్తులు స్వచ్ఛందంగా ఈ దేవాలయాన్ని దేవాదాయశాఖకు అప్పగించడంతో అప్పటి నుంచి దేవాలయంలో ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
ఎలా వెళ్లాలి ?
వరంగల్ నుంచి ఐనవోలుకు 20 కిలోమీటర్ల దూరమే. హైదరాబాద్ నుంచి వరంగల్ 145 కిలోమీటర్లు. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఐనవోలు మల్లన్న క్షేత్రం వస్తుంది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బస్సు, రైలు మార్గాల ద్వారా వెళ్లొచ్చు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే
Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?