Home Lifestyle Health H3N2 Virus | దేశవ్యాప్తంగా జలుబు, జ్వరంతో భయపెట్టిస్తున్న హెచ్2ఎన్2 నుంచి ఎలా రక్షణ పొందాలి?

H3N2 Virus | దేశవ్యాప్తంగా జలుబు, జ్వరంతో భయపెట్టిస్తున్న హెచ్2ఎన్2 నుంచి ఎలా రక్షణ పొందాలి?

Image by Drazen Zigic on Freepik

H3N2 Virus | ప్రపంచాన్ని కరోనా మహమ్మరి ఇప్పుడిప్పుడే వదిలిపోతున్నది అనుకుంటున్న తరుణంలో నేనున్నానంటూ వచ్చింది మరో వైరస్‌. అదే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా. దేశవ్యాప్తంగా చాలామంది జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణంగా నాలుగు ఐదు రోజుల్లో తగ్గాల్సిన ఈ లక్షణాలు రెండు వారాలు దాటినా తగ్గడం లేదు. దీనికి హెచ్3ఎన్2వైరసే కారణం. అయితే ఇది హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజానా? లేదా సాధారణ అనారోగ్యమా అనేది నిర్ధారించుకోకుండానే జనాలు తమకు తోచిన మందులను వేసేసుకుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ లక్షణాలు ఏంటి? దాన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్షణాలు

జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి శ్వాస కోశ సమస్యలతో పాటు ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటివి ప్రధాన లక్షణాలుగా చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడుతున్నట్లు హెచ్చరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ వైరస్ శ్వాసకోశ ఇబ్బందులనే ఎక్కువగా కలగజేస్తోంది కాబట్టి ఉబ్బసం రోగులు జాగ్రత్తగా ఉండాలి. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎక్కువగా తిరగరాదు. అనారోగ్య వ్యక్తులతో భౌతిక దూరం పాటించాలి. స్వీయ నిర్బంధం ఉండేందుకు దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటికి అడ్డుపెట్టుకోవాలి. ఆరుబయట పొల్యూషన్ మాస్క్ ధరించాలి. చేతులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రెస్ట్ రూంని ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ముఖం, ముక్కు, లేదా నోటిని తాకే ముందు కూడా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ప్రతి ఏటా తీసుకునే ఫ్లూ వ్యాక్సిన్‌లను తప్పనిసరిగా వేయించుకోవాలి. అలాగే వైద్యులను సంప్రదించకుండా ఫార్మసీ మందులు వాడటం, ఇంటి నివారణలకు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. హెచ్‌3ఎన్‌2 వైరస్ సోకిన పిల్లలకైనా, పెద్దలకైనా ఒసెల్టామివిర్, జానామివిర్, పెరామివిర్, బాలోక్సావిర్‌లతో చికిత్స చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. వీటిని మీ దగ్గరలోని వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి.

Exit mobile version