Home Entertainment Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Avatar2 Review | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌గా రూపొందించిన చిత్రం అవతార్. 2009లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులను బద్దలగొట్టింది. ఇప్పుడు దాదాపు 13 ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ వచ్చింది. అవతార్ ది వే ఆఫ్ వాటర్ పేరుతో వచ్చిన ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తికరంగా ఎదురుచూశారు. అవతార్‌లో పండోరా గ్రహ అద్భుతాలను చూపించిన జేమ్స్ కామెరూన్.. అవతార్ 2లో సముద్రంతో ఉన్న అనుబంధాన్ని చూపించనున్నట్టు ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో కనిపించాయి. అది చూశాక నీటి అడుగున అందాలను, చిత్ర విచిత్ర జీవులను జేమ్స్ కామెరూన్ ఎలా చూపించాడనే కుతూహలం అందరిలో పెరిగింది. ఈ ఉత్సుకతకు బ్రేక్ వేస్తూ శుక్రవారం రోజు అవతార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? జేమ్స్ కామెరూప్ మరోసారి మాయ చేశాడా? ఒకసారి చూద్దాం..

కథ ఏంటంటే..

మనుషులను పండోరా గ్రహంపై నుంచి వెళ్లగొట్టిన తర్వాత నావి తెగ ప్రజలు చాలా సంతోషంగా బతుకుతుంటారు. జేక్ సల్లీ ( శామ్ వర్తింగ్టన్ ), నేత్రి ( జో సల్దానా ) పెళ్లి చేసుకుంటారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుడుతుంది. నావి తెగకు జేక్ నాయకుడు అవుతాడు. ఫస్ట్ పార్ట్‌లో చనిపోయిన డాక్టర్ గ్రేస్ జీన్స్ ఆధారంగా ఓ అవతార్‌ను ల్యాబ్‌లో క్రియేట్ చేస్తారు. ఆ పాప కిరిని.. జేక్ దత్తత తీసుకుంటాడు. అలా నలుగురి పిల్లలతో పాటు స్పైడర్ అనే వ్యక్తితో కలిసి హాయిగా జీవిస్తుంటారు.

ఇంతలో భూ గ్రహం అంతరించిపోతుందని తెలిసిన మానవులు పండోరా గ్రహాన్ని ఆక్రమించాలని అనుకుంటారు. ఇందుకోసం నావి తెగను అంతం చేయాలని పండోరా గ్రహానికి దండెత్తి వస్తారు. దీనికి ఆర్మీ కల్నల్ మైల్స్ నాయకత్వం వహిస్తాడు. ఫస్ట్ పార్ట్‌లో మైల్స్ చనిపోయినప్పటికీ అతని మెమొరీతో ఒక అవతార్‌ను సృష్టిస్తారు. పండోరా గ్రహంపైకి వచ్చిన మైల్స్.. జేక్, నేత్రి కుటుంబంపై పగ తీర్చుకోవాలని అనుకుంటారు. దీంతో అక్కడ ఉండటం సురక్షితం కాదని భావించిన జేక్ తన కుటుంబాన్ని తీసుకుని మెట్కాయిన్ గ్రామానికి వెళ్లిపోతారు. అక్కడి ప్రజలకు సముద్రమే ప్రపంచం. సముద్రంతో మనకు ఎనలేని అనుబంధం ఉందని వాళ్లు నమ్ముతుంటారు. అక్కడికి వెళ్లిన జేక్‌ను వెతుక్కుంటూ మనుషులు వెళ్లారా? మైల్స్ పగతీర్చుకోవడానికి ఏం చేశాడు? వారిని జేక్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగిలిన స్టోరీ.

ఎలా ఉందంటే..

అవతార్‌లో పండోరా గ్రహం అందాలను చూపించిన జేమ్స్ కామెరూన్.. ఈసారి సముద్రంతో ఉన్న అనుబంధాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. దీనికోసం కథ కంటే కూడా ఎక్కువగా వీఎఫ్‌ఎక్స్‌పైనే ఆధారపడ్డాడు. అందుకు తగ్గట్టుగానే అవతార్‌కు మించిన సుందరమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సారి సముద్రంలో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాడు. అయితే కథ విషయానికొస్తే ఫస్టాప్‌లో జేక్ ఫ్యామిలీని పరిచయం చేయడం, మనుషులు జేక్ కుటుంబపై దాడికి దిగడం వంటి సీన్లతో సాగిపోతుంటాయి. ఈ సీన్లన్నీ అవతార్ మొదటి భాగంలో చూసినట్టుగానే కనిపిస్తాయి. ఎప్పుడైతే జేక్ ఫ్యామిలీ మెట్కాయిన్‌కు వెళ్తుందో అప్పుడే కొత్త ప్రపంచం పరిచయమవుతుంది. అక్కడి సముద్ర గర్భంలోని అందాలు.. అక్కడ ఉండే వింతైన జలచరులు ఆడియన్స్‌ను కొత్తలోకానికి తీసుకెళ్తాయి.

అవతార్‌లో గాల్లో ఎగరడానికి ఇక్రాన్ అనే పక్షులు ఉంటే.. ఈ సారి ఈలు అనే సముద్ర జీవులు కనిపిస్తాయి. వీటిని మచ్చిక చేసుకునే సీన్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాడు. సముద్రంతో అనుబంధంతో పాటు కుటుంబాన్ని కాపాడుకునేందుకు తండ్రి పడే కష్టం, భావోద్వేగాలను అందంగా చూపించాడు. ఈ సీన్స్ అన్నీ కూడా ఇండియన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకొస్తుంది. అయితే ఫస్టాప్‌లో సాగదీత ఎక్కువైంది. దీంతో ఫస్టాఫ్ బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ మెట్కాయిన్‌కి జేక్ ఫ్యామిలీకి వెళ్లిన తర్వాత సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.సెకండాఫ్ వేగంగా నడిచిపోతుంది. ఒకవైపు హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్, మరోవైపు సుందరమైన దృశ్యాలతో ప్రేక్షకులు కొత్త లోకంలోకి వెళ్లిపోతారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. నౌకా సన్నివేశాలు టైటానిక్ సినిమాను గుర్తు చేస్తాయి. స్పైడర్, అతని తండ్రికి మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి.అన్నట్టు టైటానిక్ హీరోయిన్ కేట్ విన్‌స్లెట్ ఈ సినిమాలో ఒక పాత్రలో నటించడం విశేషం.

ఎవరు ఎలా చేశారంటే..

ఫస్ట్ పార్ట్‌లో అవతార్‌గా నేవి తెగలోకి ప్రవేశించి.. వారికి అండగా నిలబడే పాత్రలో కనిపించిన సామ్ వర్తింగ్టన్.. అవతార్ 2లో కూడా అదేస్థాయిలో నటించాడు. నావి తెగకు నాయకుడిగా, తండ్రిగా అద్భుతంగా భావోద్వేగాలను పలికించాడు. యాక్షన్ సీన్స్‌లోనూ ఇరగదీశాడు. నేత్రి కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఫస్ట్ పార్ట్‌లో మైల్స్ చనిపోవడంతో సెకండ్ పార్ట్‌లో ఎవరు విలన్‌గా వస్తారా? అని చాలామంది అనుకున్నారు. కానీ అవతార్ రూపంలో మళ్లీ అతన్నే విలన్‌గా తీసుకొచ్చాడు జేమ్స్ కామెరూన్. తన పగను తీర్చుకోవడంతో పాటు పండోరాను ఆక్రమించాలని అనుకునే పాత్రలో స్టీఫెన్ లాంగ్ మెప్పించాడు. టెక్నికల్ విషయానికొస్తే సింపుల్ స్టోరీ అయినా సరే అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో నడిపించారు. ప్రతి సీన్‌లో జేమ్స్ కామెరూన్ కష్టం కనిపిస్తుంది.

బలాలు

+అద్భుతమైన విజువల్స్
+ జేమ్స్ కామెరూన్ మాయాజలం
+ యాక్షన్ సీన్స్

బలహీనతలు

– ఊహకందే స్టోరీ
– సినిమా నిడివి

చివరగా.. వీనులవిందుగా.. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్..

Follow Us : FacebookTwitter

Read More Articles |

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Exit mobile version