Home Latest News SRH vs LSG | రాత మారని రైజర్స్‌..లక్నో చేతిలోనూ ఓడిన హైదరాబాద్‌

SRH vs LSG | రాత మారని రైజర్స్‌..లక్నో చేతిలోనూ ఓడిన హైదరాబాద్‌

SRH vs LSG | టైమ్‌ 2 న్యూస్‌, లక్నో: గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో పేలవ ప్రదర్శన కనొసాగించిన రైజర్స్‌ తాజా సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. గత మ్యాచ్‌లో కాస్తలో కాస్త మెరుగనిపించిన హైదరాబాద్‌.. ఈ సారి మరీ దారుణ ఆటతీరు కనబర్చింది. శుక్రవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి (41 బంతుల్లో 34; 4 ఫోర్లు), అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో కృనాల్‌ పాండ్యా 3, అమిత్‌ మిశ్రా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 16 ఓవర్లలో 5 వికెట్లకు 127 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (31 బంతుల్లో 35; 4 ఫోర్లు), కృనాల్‌ పాండ్యా (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు శుభారంభం దక్కలేదు. కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న మయాంక్‌ అగర్వాల్‌ 8 పరుగలే చేసి వెనుదిరగగా.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (0) తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ (3) ఆదుకుంటాడు అనుకుంటే అదీ అత్యాశే అయింది. ఒక ఎండ్‌లో వరుస వికెట్లు పడుతుంటే.. మరో ఎండ్‌లో రాహుల్‌ త్రిపాఠి పరుగులు రాబట్టేందుకు తంటాలు పడ్డాడు. మిడిల్‌ ఓవర్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ (28 బంతుల్లో 16)తో కలిసి త్రిపాఠి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. మరీ నెమ్మదిగా ఆడటంతో అభిమానులకు టెస్టు మ్యాచ్‌ చూస్తున్న అనుభవం ఎదురైంది. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ (10 బంతుల్లో 21 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్‌ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో రైజర్స్‌ బౌలింగ్‌ యూనిట్‌ కూడా ఆకట్టుకోలేకపోయింది. తొలి ఓవర్‌ నుంచే లక్నో ఓపెనర్లు బౌండ్రీలు రాబడుతుంటే.. మనవాళ్లు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. రాహుల్‌ త్రిపాఠి స్థానంలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మైదానంలోకి వచ్చిన ఫజల్‌హక్‌ రైజర్స్‌కు తొలి వికెట్‌ అందించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అర్ధశతకాలు సాధించిన కైల్‌ మయేర్స్‌ (13)ను అతడు బుట్టలో వేసుకున్నాడు. కాసేపటికే భువనేశ్వర్‌ చక్కటి రిటర్న్‌ క్యాచ్‌తో దీపక్‌ హుడా (7)ను వెనక్కి పంపాడు. అయితే సాధించాల్సిన లక్ష్యం పెద్దది కాకపోవడం లక్నోకు కలిసొచ్చింది.

కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. అతడికి కృనాల్‌ పాండ్యా చక్కటి సహకారం అందించాడు. రైజర్స్‌ బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డ చోట ఈ జోడీ అలవోకగా పరుగులు రాబట్టింది. దీంతో లక్నో చూస్తుండగానే లక్ష్యానికి చేరువైంది. 14వ ఓవర్లో రషీద్‌ వరుస బంతుల్లో రాహుల్‌, రొమారియో షెఫర్డ్‌ (0)ను ఔట్‌ చేసినా.. అప్పటికే ఆలస్యమైపోయింది.

Exit mobile version