Home News AP Vijayawada | పురుగు కుట్టిందని వెళ్తే.. చేతినే తీసేయాల్సిన పరిస్థితికి తెచ్చారు.. విజయవాడ ఆస్పత్రిలో వైద్యుల...

Vijayawada | పురుగు కుట్టిందని వెళ్తే.. చేతినే తీసేయాల్సిన పరిస్థితికి తెచ్చారు.. విజయవాడ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

Vijayawada | చేతికి పురుగుకుట్టిందని ఆస్పత్రికి వెళ్తే.. ఇప్పుడు మొత్తం చేతినే తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సర్జరీ చేసిన తర్వాత చేతిలోనే బ్లేడ్‌ను మరిచిపోయి డ్రెస్సింగ్‌ చేయడంతో మొత్తం చేతికి ఇన్‌ఫెక్షన్‌ సోకింది. విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళా కూలీ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. తిరువూరు నియోజకవర్గం విసన్నపేట గ్రామానికి చెందిన నందిపాం సురేశ్‌, తులసి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తులసి ఇంటిని సర్దుతుండగా చేతికి ఏదో పురుగు కుట్టినట్టు అనిపించింది. మంట ఎక్కువగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఏది కుట్టిందో తెలియడం లేదని.. మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ తులసిని గమనించిన వైద్యులు ఆమె చేతికి ఇన్ఫెక్షన్‌ సోకిందని నిర్ధారించారు. మరింత మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం తులసిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ తులసిని పరీక్షించిన వైద్యులు చేతికి మైనర్ సర్జరీ చేశారు. చేతికి అయిన ఇన్‌ఫెక్షన్‌ను తొలగించి కట్టు కట్టారు. అయితే డ్రెస్సింగ్‌ చేసే సమయంలో ఓ బ్లేడ్‌ను లోపలే మరిచిపోయారు. దీంతో ఆ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైంది. దీంతో ఆమె చేతిని తొలగించాలని వైద్యులు సూచించారు. డాక్టర్లు చెప్పిన ఆ మాటతో తులసి ఒక్కసారిగా అయోమయ స్థితిలోకి వెళ్లింది. ఏదో పురుగు కుట్టిందని ఆస్పత్రికి వస్తే ఇప్పుడు చేతిని తీసేసే పరిస్థితికి తీసుకొచ్చారని బాధితురాలు వాపోతోంది.

Exit mobile version