Home Latest News Virat Kohli | కోహ్లీ కదంతొక్కేనా..!లక్నోసూపర్‌ జెయింట్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పోరు

Virat Kohli | కోహ్లీ కదంతొక్కేనా..!లక్నోసూపర్‌ జెయింట్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పోరు

Virat Kohli | టైమ్‌ 2 న్యూస్‌, బెంగళూరు: వరుస విజయాలతో దూసుకెళ్తున్న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. తాజా సీజన్‌లో రెండు మ్యాచ్‌లాడి ఒక విజయం, ఒక పరాజయం నమోదు చేసుకున్న బెంగళూరు.. బ్యాటింగ్‌పైనే భారీ ఆశలు పెట్టుకుంది. పవర్‌ప్లేలో ధాటిగా ఆడటంతో పాటు.. డెత్‌ ఓవర్స్‌లో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంపై రాయల్‌ చాలెంజర్స్‌ దృష్టిపెట్టింది.

గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో 81 పరుగుల తేడాతో పరాజయం పాలైన ఫాఫ్‌ డుప్లెసిస్‌ సేన.. సొంతగడ్డపై జరుగనున్న మ్యాచ్‌లో తిరిగి గెలుపుబాట పట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో 89 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి.. మ్యాచ్‌పై పట్టు బిగించినట్లే కనిపించినా.. ఆఖర్లో శార్దూల్‌ ఠాకూర్‌ విధ్వంసం సృష్టించడంతో బెంగళూరుకు పరాజయం తప్పలేదు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ డుప్లెసిస్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌పై బెంగళూరు అతిగా ఆధారపడుతోంది. షాబాజ్‌ అహ్మద్‌, ప్రభుదేశాయ్‌, హసరంగ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌తో పాటు హర్షల్‌ పటేల్‌ కీలకం కానున్నాడు. కరణ్‌ శర్మ తన స్పిన్‌తో ఆకట్టుకుంటుండగా.. డేవిడ్‌ విల్లే ఏం చేస్తాడో చూడాలి.

మరోవైపు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ సీజన్‌లో చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తోంది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఆజట్టకు కొండంత అండ కాగా.. విండీస్‌ విధ్వంసక ఆటగాడు కైల్‌ మయేర్స్‌ ఊహించని రీతిలో దంచికొడుతున్నాడు. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యం బౌండ్రీనే అన్నచందంగా ఈ కరీబియన్‌ వీరుడు విరుచుకుపడుతుండటం లక్నోకు బాగా కలిసొస్తుంది. లీగ్‌ ఆరంభ మ్యాచ్‌కు అందుబాటులో లేని క్వింటన్‌ డికాక్‌ రాకతో లక్నో బ్యాటింగ్‌ లైనప్‌ మరింత పటిష్టంగా మారగా.. దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్యా, నికోలస్‌ పూరన్‌తో లక్నో బ్యాటింగ్‌ శత్రు దర్భేద్యంగా కనిపిస్తోంది. ఇక లక్నో తరఫున తొలి సీజన్‌ ఆడుతున్న 40 ఏళ్ల అమిత్‌ మిశ్రా తనలో వాడి తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. గత మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన ఈ లెగ్‌ స్పిన్నర్‌.. ఫీల్డింగ్‌లోనూ అద్భుత క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. మార్క్‌వుడ్‌ రూపంలో సూపర్‌ పేసర్‌ లక్నోకు అందుబాటులో ఉండగా.. రవి బిష్ణోయ్‌ తన స్పిన్‌తో మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

ఐపీఎల్‌ ఆరంభం నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి చిన్నస్వామి స్టేడియంలో చక్కటి రికార్డు ఉంది. సొంత గడ్డపై బెంగళూరు సత్తాచాటాలంటే కోహ్లీ బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంటుంది.

Exit mobile version