Home Latest News Sunrisers Hyderabad | సన్‌రైజర్స్‌ జోరు సాగేనా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అమీతుమీ

Sunrisers Hyderabad | సన్‌రైజర్స్‌ జోరు సాగేనా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అమీతుమీ

Sunrisers Hyderabad | టైమ్‌ 2 న్యూస్‌, కోల్‌కతా: తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలు రుచి చూసి.. ఉప్పల్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి ఐపీఎల్లో బోణీ కొట్టిన సన్‌రైజర్స్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌లో భాగంగా శుక్రవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై నెగ్గిన జోష్‌ను కొనసాగించాలని హైదరాబాద్‌ చూస్తుంటే.. రింకూ సింగ్‌ అద్వితీయ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌పై జయభేరి మోగించిన కోల్‌కతా పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలని భావిస్తోంది.

పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శార్దూల్‌ ఠాకూర్‌, రింకూ సింగ్‌ దుమ్మురేపడంతో వరుస విజయాలు సాధించిన కోల్‌కతాను సొంతగడ్డపై ఎదుర్కోవడం రైజర్స్‌కు శక్తికి మించిన పనిలాగే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండిట నెగ్గిన నైట్‌రైడర్స్‌.. హ్యాట్రిక్‌పై కన్నేయగా.. సన్‌రైజర్స్‌ రెండో విజయం కోసం ఎదురుచూస్తోంది. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ బలంగా కనిపిస్తుండగా.. కోల్‌కతా బ్యాటింగ్‌ లైనప్‌ హిట్టర్లతో నిండి ఉంది. రహ్మానుల్లా గుర్బాజ్‌ రూపంలో కోల్‌కతాకు స్థిరమైన ఓపెనర్‌ లభించగా.. గత మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు మూడు వర్వేరు భాగస్వామ్యాలను పరిశీలించింది. ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్లను మార్చే అవకాశం ఉంది. రహ్మానుల్లాతో పాటు జాసెన్‌ రాయ్‌, లిటన్‌ దాస్‌లో ఒకరు ఓపెనింగ్‌ చేసే చాన్స్‌ ఉంది.

బ్రూక్‌పై భారీ అంచనాలు..

ఇక సీజన్‌ ఆరంభానికి ముందు జరిగిన వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న ఇంగ్లండ్‌ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో మిడిలార్డర్‌లో వచ్చి విఫలమైన బ్రూక్‌.. పంజాబ్‌తో పోరులో ఓపెనర్‌గా బరిలోకి దిగినా.. పెద్దగా ఫలితం లేకపోయింది. టెస్టుల్లో సంచలన ప్రదర్శనలు నమోదు చేసిన బ్రూక్‌ భారత పిచ్‌లపై పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది.

గత మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి రాణించగా.. కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ ఫర్వాలేదనిపించాడు. వీరితో పాటు హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌ సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. సమద్‌ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నా.. అతడికి తగినన్న బంతులు ఆడే అవకాశం దక్కడం లేదు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అతడికి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌ దక్కుతుందా చూడాలి. ఇక బౌలింగ్‌లో ఎప్పట్లాగే భువనేశ్వర్‌కుమార్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ కీలకం కానుండగా.. మయాంక్‌ మార్కండే, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు. పంజాబ్‌పై పోరులో నాలుగు వికెట్లతో సత్తాచాటిన మయాంక్‌ మార్కండే నుంచి మేనేజ్‌మెంట్‌ ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. అయితే స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న సన్‌రైజర్స్‌.. కోల్‌కతా మిస్టరీ స్పిన్‌ త్రయం సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, సుయాశ్‌ శర్మను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం.

Exit mobile version