Home Latest News Dharmapuri Sanjay | కాంగ్రెస్‌లో చేరిన 24 గంటల్లోనే డీఎస్ ఎందుకు రాజీనామా చేశాడు? బీజేపీ...

Dharmapuri Sanjay | కాంగ్రెస్‌లో చేరిన 24 గంటల్లోనే డీఎస్ ఎందుకు రాజీనామా చేశాడు? బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడా?

Dharmapuri Sanjay | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించిన సీనియర్ నేత డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) చాలారోజుల తర్వాత మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న డీఎస్.. ఆదివారం నాడు గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. ఇంతలోనే ఏమైందో ఏమో గానీ.. 24 గంటలు తిరగకుండానే కాంగ్రెస్ ఫార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఆరోగ్యం సహకరించట్లేదని.. అందుకే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆ లేఖ విడుదల చేశారు. డీఎస్ రాసినట్లుగా చెబుతున్న ఈ లేఖను ఆయన సతీమణి మీడియా ముందుంచారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎవరూ కూడా తమ ఇంటివైపు రావద్దని.. మీ రాజకీయాల కోసం ఆయన పేరును వాడుకోవద్దంటూ విజ్ఞప్తి చేసింది. నిన్ననే పార్టీలో చేరిన డీఎస్ ఇంతలోనే ఎందుకు మాట మార్చారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా తన ఇద్దరు కొడుకుల మధ్య నలిగిపోతూ డీఎస్.. ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోతున్నారని ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది.

ఎందుకంటే.. కొద్దిరోజులుగా డీఎస్ ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు. నిన్న కాంగ్రెస్ కార్యాలయానికి కూడా డీఎస్ వీల్‌ఛైర్‌లోనే వచ్చాడు. అతనితో పాటే డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. చిన్న కొడుకు ధర్మపురి అర్వింద్‌ ఏమో నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నాడు. పైగా అర్వింద్ ఇంట్లోనే డీఎస్ ఉంటున్నాడు. దీంతో తన ఇంట్లో ఉంటూ తన తండ్రి కాంగ్రెస్‌లోకి వెళ్లడమేంటని ధర్మపురి అర్వింద్ సీరియస్‌గా ఉన్నాడట. అందుకే డీఎస్‌తో బలవంతంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసేంది మరెవరో కాదు.. డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్. తన సోదరుడి పేరు చెప్పకుండా పరోక్షంగా ఈ విమర్శలు చేశారు.

తన తండ్రి రాజీనామా వెనుక తమ కుటుంబానికి చెందిన బీజేపీ నాయకుడి హస్తం ఉందని సంజయ్ ఆరోపించారు. ఇది పక్కా అతని పనేని స్పష్టం చేశారు. నిన్న తన తండ్రి డీఎస్ సంతోషంగా అందరి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారని.. మూడు గంటల పాటు గాంధీభవన్‌లో ఉన్నారని గుర్తు చేశారు. ఉన్నట్టుండి ఇవాళ రాజీనామా లేఖను విడుదల చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన తండ్రి డీఎస్‌పై కుట్ర జరుగుతోందని.. ఆయనకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన తమ్ముడే తండ్రిని చంపేందుకు చూస్తున్నాడని ఆరోపించారు. అర్వింద్ తమ నాన్నను బ్లాక్‌మెయిల్ చేసి రాజీనామా లేఖపై సంతకం చేయించారని.. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారని ఆరోపించారు.

తన తండ్రి ఇష్టపూర్వకంగా రాజీనామా చేయలేదని.. ఓ రూంలో బంధించి బలవంతంగా సంతకం చేయించారని ధర్మపురి సంజయ్ ఆరోపించారు. తమ తండ్రికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయనివ్వడం లేదని.. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఆందోళనగా ఉందని చెప్పారు. రౌడీలు, డబ్బు అడ్డుపెట్టుకుని అర్వింద్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో అర్వింద్‌కు కొంతమంది సహకరిస్తున్నారని.. వాళ్లు తమ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని హెచ్చరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP Politics | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు దేవుడు రాసిన స్క్రిఫ్టే ట్రెండింగ్.. వచ్చే ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందా.. చంద్రబాబుకు బొక్క పడనుందా ?

LB Nagar Flyover | ఎల్బీ నగర్ జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు.. హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణం.. కేటీఆర్ కీలక ప్రకటన

Exit mobile version