Home News International Turkey Earthquake | కీలకమైన 72 గంటలు వృథా అయిపోయాయి.. తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య...

Turkey Earthquake | కీలకమైన 72 గంటలు వృథా అయిపోయాయి.. తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్

Turkey Earthquake | టైమ్‌2న్యూస్, అంకారా : ప్రకృతి విలయతాండవం నుంచి తుర్కియే, సిరియా దేశాలు ఇంకా బయటపడలేదు. భూకంప ధాటికి వేలాది భవనాలు కూలిపోయాయి. భూకంపం కారణంగా ఇప్పటికే 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేలాది మంది ఆ శిథిలాల కింద ప్రాణాలతో పోరాడుతున్నారు. వారిని రక్షించేందుకు తుర్కియే, సిరియా దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ప్రపంచ దేశాలు సాయం చేద్దామంటే పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇలా చూస్తుండగానే కీలకమైన 72 గంటలు గడిచిపోయాయి. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడగలిగే చివరి అవకాశాలను కోల్పోయామని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన ఊహకు అందని రీతిలో మృతుల సంఖ్య భారీగా పెరగనుందని భయపడిపోతున్నారు.

turky syria earthquake

ఏం చేసినా తొలి మూడు రోజుల్లోనే..

సాధారణంగా భూకంపాలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు తొలి మూడు రోజులు కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. భూకంపం ధాటికి భవనాల శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు 72 గంటలకు ప్రాణాలతో పోరాడతారు. ఈలోపు వారిని గుర్తించి.. చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. 72 గంటలు దాటితే మాత్రం చాలా కష్టమైపోతుంది. వాళ్లు మనుగడ కోసం పోరాడే సమయం చాలా వేగంగా తగ్గిపోతుంది. అందుకే తొలి మూడు రోజులు చాలా కీలకమని ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీకి చెందిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుడు స్టీవెన్ గాడ్బీ వెల్లడించారు. గతంలో వచ్చిన భూకంపాలను విశ్లేషించిన యూనివర్సిటీ కాలేజీ లండన్‌కు చెందిన డిజాస్టర్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ ఇలాన్ కెల్మెన్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. భూకంపాలు వచ్చిన సమయంలో 90 శాతం మంది 72 గంటల్లోనే రక్షించారని వెల్లడించారు.

ఆ దేశాలు ఎందుకు విఫలమయ్యాయి?

తుర్కియే, సిరియా దేశాల్లో భూకంపం వచ్చి మూడు రోజులు అయిపోయింది. కానీ అక్కడ సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. ఈ రెండు దేశాలకు సహాయక చర్యలు అందించేందుకు భారత్ సహా చాలా దేశాలు ముందుకొచ్చాయి. కానీ వాళ్లు భూకంపం సంభవించిన ప్రాంతానికి వెళ్లడం ఆలస్యం అవుతుంది. విమానాశ్రయాలు, కీలక నౌకాశ్రయాలు దెబ్బతినడంతో ప్రపంచ దేశాల సహాయక బృందాలు అక్కడికి చేరుకోవడం చాలా కష్టమైపోయింది. పైగా భూకంపం వచ్చింది మారుమూల ప్రాంతాలు.. యుద్ధ క్షేత్రాల్లో కావడంతో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి ఒక రోజు పట్టింది. సిరియా సరిహద్దుల్లోని యుద్ధ క్షేత్రాలకు అయితే సహాయక బృందాలను అనుమతించడం లేదు. దీంతో కీలకమైన 72 గంటలు కళ్ల ముందే కరిగిపోయాయి.

వాతావరణం కూడా అనుకూలించట్లేదు

సహాయక సిబ్బంది చేరుకోవడమే ఆలస్యమైంది అంటే.. ఇక్కడి వాతావరణం కూడా ఏ మాత్రం సహకరించడం లేదు. ప్రస్తుతం అక్కడ హైపోథెర్మియా పరిస్థితులు ఉన్నాయి. అంటే.. శరీరంలో పుట్టే వేడి కంటే కూడా.. శరీరం కోల్పోయే వేడి ఎక్కువగా ఉందన్నమాట. ఈ వాతావరణ పరిస్థితి కారణంగా తొందరగా శరీరం చల్లబడిపోతుంది. ఈ సమయంలో శిథిలాల కింద, గాయాలతో ఉన్న వాళ్లు బతకాలంటే ఆహారం, నీరు కచ్చితంగా ఉండాలి. కానీ ఇంకా సహాయక చర్యలే సరిగ్గా అందడం లేదు. వేలాది మంది శిథిలాల కిందనే ఉండిపోయారు. దీంతో భారీ ప్రాణ నష్టాన్ని చూడాల్సి వస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

KA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ పాల్‌ ఫైర్‌!

Exit mobile version