Home News Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Telangana Cabinet | జాగా ఉండి ఇల్లు కట్టుకునేందుకు స్థోమత లేని వారికి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సొంత స్థలం ఉన్న పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. గృహలక్ష్మీ పథకంతో పాటు రెండో విడత గొర్రెల పంపిణీ, పోడు భూముల పట్టాల పంపిణీకి ఆమోదం తెలిపింది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.

సొంత జాగాలో ఇళ్లు కట్టుకునేందుకు సాయం

రాష్ట్రంలో ఇప్పటివరకు ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వమే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిచ్చేది.. ఇప్పుడు సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకునేందుకు సాయం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ పథకానికి గృహలక్ష్మీ అని నామకరణం చేశామని తెలిపారు. గృహలక్ష్మీ పథకం కింద 4 లక్షల మందికి ఇల్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3వేల మంది చొప్పున 3,57,000 మందికి, స్టేట్ కోటా కింద 43వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎంపిక చేసిన 4 లక్షల మందికి రూ.3 లక్షల రూపాయలను మూడు విడతల్లో అందజేస్తామని పేర్కొన్నారు. ఒక్కో విడతలో లక్ష రూపాయలు అందజేయనున్నట్లు చెప్పారు. దీనివల్ల లబ్ధిదారులు తమకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. మహిళల పేరు మీదనే ఈ ఇల్లు మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం రూ.12వేల కోట్లు ఖర్చవుతాయని.. వీటికోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చెప్పారు.

రెండో విడత గొర్రెల పంపిణీ

రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కోసం 7.31 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని.. మొదటి దఫా కింద ఇప్పటికే సగం మందికి గొర్రెలు పంపిణీ కూడా పూర్తి చేశామని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. మిగిలిన సగం మందికి రెండో విడత కింద గొర్రెల పంపిణీకి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఇందుకోసం రూ.4,463 కోట్ల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీని ఏప్రిల్‌లో ప్రారంభించి.. ఆగస్టు కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

పోడు భూముల పట్టాలు రెడీ

పోడు భూముల పట్టాలకు సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ప్రక్రియ పూర్తి చేశారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో 4 లక్షల 903 ఎకరాల పోడు భూములను 1,55,393 మందికి పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే పట్టాలు ముద్రించి పంపిణీకి సిద్దంగా ఉన్నారని తెలిపారు.

ఏప్రిల్ 14న అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఏప్రిల్ 14న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దళిత బిడ్డలను హైదరాబాద్‌కు పిలిపించి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం జీవో నంబర్ 58, 59 కింద కొంతమంది మిగిలిపోయారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సకాలంలో దరఖాస్తు చేసుకోకపోవడంతో వాళ్లు అలాగే మిగిలిపోయారని.. వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. 2014 వరకు ఉన్న కటాఫ్ డేట్‌ను 2020 వరకు పొడిగిస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి కూడా నెల రోజుల సమయం ఇస్తున్నామని చెప్పారు.

కాశీ, శబరిమలలో వసతీగృహాలు

సనాతన ధర్మాన్ని పాటించేవాళ్లందరూ కాశీకి వెళ్తుంటారు.. కాశీలో మరణిస్తే పుణ్యం వస్తుందని హిందువుల నమ్మకం. రాష్ట్రంలో నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కాశీకి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కాశీలో తెలంగాణ ప్రభుత్వం తరఫున వసతీగృహం నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. ఇందుకోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం వేగంగా పూర్తి చేసేందుకు మంత్రులు, సీఎస్ బృందంతో కలిసి కాశీ వెళ్లి అక్కడి అధికారులతో చర్చించనున్నారు. ప్రైవేటు స్థలం కొనుగోలు చేసైనా సరే.. సకల సౌకర్యాలతో ఈ వసతీగృహం నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. అలాగే కాశీలో కూడా రూ.25 కోట్ల నిధులతో వసతీగృహం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

Exit mobile version