Home Latest News Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని...

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

Telangana Assembly Elections | తెలంగాణలో రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే రెండు సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ మూడో సారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టి రికార్డు సృష్టించాలని చూస్తోంది. మరోవైపు బీజేపీ మిషన్‌ 90 టార్గెట్‌తో తెలంగాణలో వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్‌లో జోష్‌ నింపాలని చూస్తున్నారు. వీటికి తోడు తెలంగాణలో వెలువడుతున్న వరుస నోటిఫికేషన్లు.. అధికారుల బదిలీలు చూస్తుంటే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తారా ? అన్న అనుమానాలు మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల్లోనూ ఉన్నాయి.

ఇప్పటికే డబుల్‌ బెడ్‌రూంల పంపిణీపై కసరత్తు చేయడం, సొంత స్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించడం లాంటివి పట్టాలెక్కేశాయి. ఇక నోటిఫికేషన్లకైతే రెస్టే ఉండట్లేదు. వరుస నోటిఫికేషన్లతో ప్రతిపక్షాలకు కేసీఆర్‌ షాకులమీద షాకులిస్తున్నారు. అధికారుల బదిలీలపైనా ఫోకస్‌ పెట్టారు సీఎం. మరోవైపు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై కేసీఆర్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పనితీరు, ఎమ్మెల్యేల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ? నియోజకర్గంలో ఇంకా ఏం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.? ప్రజల అసంతృప్తికి కారణమేంటి? ప్రతిపక్షాల బలాబలాలు.. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే.. సెకండ్‌ ఆప్షన్‌ ఎవరున్నారు? లాంటి విషయాలపై ఇప్పటికే అంతర్గతంగా సర్వే జరిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సర్వేలో వచ్చే నివేదిక ఆధారంగా కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే నిరుద్యోగులపై దృష్టి పెట్టారని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న యువకులే. వాళ్లను నోటిఫికేషన్లతో బిజీ చేస్తే తన పని కొంత సులువు అవతుందన్న అంచనాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వరుస నోటిఫికేషన్లు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజలకు అభిమానం ఉన్నప్పటికీ వాళ్లలో వాళ్లే కొట్లాడుకుంటున్నారు. ఫలితంగా కార్యకర్తలకే తమ పరిస్థితి ఏంటని అర్థం కావటం లేదు. వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర చీఫ్ రేవంత్‌ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. ఇక బీజేపీ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇదే అదనుగా కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. చాలా రోజుల నుంచే తెలంగాణపై మోదీ, అమిత్‌ షాల కన్ను పడింది. ఇటీవల బీఎల్ సంతోష్‌ కూడా టార్గెట్ 20 కాదు మిషన్‌ 90తో ముందుకెళతామని ప్రకటించారు.

దీన్ని బట్టి ప్రతిపక్షాలకు టైం దొరికితే బలోపేతం అయ్యేందుకు కచ్చితంగా ఆ సమయాన్ని వినియోగించుకుంటాయి. కానీ ప్రతిపక్షాలు ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్‌ కొట్టాలని కేసీఆర్‌ చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో దేశ రాజకీయాలపై ఫోకస్‌ పెంచాలనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ముందస్తుకు వెళ్లి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటే లోక్‌సభ ఎన్నికలకు ఏడాది సమయం ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా దేశ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టొచ్చన్న ఆలోచనలో కూడా కేసీఆర్‌ ఉండొచ్చు.

అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఒక వేళ ముందస్తు వెళ్లి ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఎన్నికలొస్తే ఓకే. అలాకాకుండా బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనకు మొగ్గుచూపితే ? ఇప్పటికే కేసీఆర్‌ ఎక్కడ దొరుకుతాడా అని బీజేపీ ఎదురుచూస్తోంది. ఛాన్స్‌ వచ్చిందని రాష్ట్రపతి పాలనవైపు మొగ్గుచూపితే పరిస్థితి ఏందన్న ఆలోచన కూడా కేసీఆర్‌ మదిలో ఉండొచ్చు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుకు వెళ్లి రాష్ట్రపతి పాలన వస్తే.. అసలుకే మోసం వస్తుందంటూ చెవులుకొరుక్కుంటున్నారు. అప్పుడు రాష్ట్రం, అధికారులంతా కేంద్రం గుప్పిట్లోకి వెళ్తారని, అప్పుడు పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలుకలా తయరావుతందని అనుకుంటున్నారు.

రాజ్యాంగం ప్రకారం ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు తెలంగాణ కోసమే మూడు నెలల్లో ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆరు నెలల గరిష్ఠ పరిమితిని ఈసీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఆపద్దర్మ ప్రభుత్వంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అపద్ధర్మ సీఎంగా కేసీఆర్ కొనసాగితే ఇబ్బందులు పడే చాన్సులే ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వాన్ని నడిపించినా అధికారాలు మాత్రం నామమాత్రంగానే ఉంటాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. భారీ ప్రాజెక్టులు, పథకాలు ప్రకటించడానికి వీలుండదు. నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయలేడు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు చాన్సుండదు. ఇప్పటికే రాష్ట్రంలో గవర్నర్‌ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్‌ పట్టు పెరిగితే కేసీఆర్‌తో కేంద్రం ఆటలాడుకునే ఛాన్సుంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తే మాత్రం ముందస్తుపై పునరాలోచనలో పడే ఛాన్సు ఉంటది.

కానీ దూకుడుగా ముందుకెళ్లకపోతే రాష్ట్రంలో సీబీఐ, ఐటీ, ఈడీ దాడులు పెరిగితే ప్రజల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న అభిప్రాయం కూడా ఉన్నట్లుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను లిక్కర్‌ కేసులో విచారించడం, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ కోర్టులోకి వెళ్లడం, కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి సీబీఐని ఆశ్రయిస్తామనడం, ఈలోగా ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల అవినీతి అక్రమాలు బయటపెట్టేందుకు అదే పనిగా ఆరోపణలు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే చాన్సుంటది. అందుకే ముందస్తుకు దూకుడుగానే వెళ్లి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్న ఆలోచన కేసీఆర్‌ మదిలో ఉండొచ్చని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం

Chandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం

SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Exit mobile version