Peddagattu lingamanthula jathara | తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కోసం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఇంత భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడంతో అసలు ఈ జాతర ప్రత్యేక ఏంటి ? ఎక్కడ .. ఎప్పుడు జరుగుతుంది? ఎలా వెళ్లాలనే దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ జాతర గురించి విశేషాలు మీకోసం..
తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అంతటి వైభవం ఉన్న జాతర పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర. తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా దీనికి పేరుంది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఫిబ్రవరి 5 నుంచి ఐదు రోజులపాటు జరగనుంది. దీన్ని దురాజ్ పల్లి జాతర లేదా లింగమంతుల జాతర అని కూడా పిలుస్తారు. ఇక్కడ యాదవులే పూజారులుగా ఉంటారు. అందుకే గొల్లగట్టు జాతర అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు తడిబట్టలతో గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు లింగమతుల స్వామిని దర్శించుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసేందుకు రూ. 5కోట్లు విడుదల చేసింది.
జాతరకు ఎలా వెళ్లాలి ?
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలో పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయం ఉంది. ఇక్కడ రెండేళ్లకు ఒకసారి భారీ ఎత్తున జాతర జరుగుతుంది. హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లి ఉంది. 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా ఇక్కడికి వెళ్లాలి. ముందుగా సూర్యాపేట చేరుకొని అక్కడి నుంచి 5 కిలోమీటర్లు వెళితే దురాజ్‌పల్లి వస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో టేకుమట్ల గ్రామంలో భక్తులు మూసీనదికి పూజలు చేయడం ఆనవాయితీ.

గర్భిణి మరణంతో చలించిపోయిన స్వామి..
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ గ్రామమే దురాజ్‌పల్లిగా పేరొందిందని చరిత్రకారులు చెబుతుంటారు. కాకతీయుల కాలంలో ఉండ్రుగొండపై శివాలయం, నరసింహాలయం ఉండేవి. ఇక్కడ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగేవి. అయితే మొక్కులు చెల్లించేందుకు గుట్టకు వచ్చిన ఓ నిండు గర్భిణి గుట్ట ఎక్కుతుండగా జారిపడి చనిపోయిందట. చలించిన స్వామి భక్తులకు వీలుగా ఉండేట్లు పాలసేర్లయ్య గుట్టపై లింగమంతుల స్వామిగా వెలిశాడని స్థానికులు చెబుతుంటారు.
దిష్టిపూజ మహోత్సవంతో అంకురార్పణ
లింగమంతుల స్వామి జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతర ప్రారంభానికి 15 రోజులు ముందుగా సంప్రదాయబద్దంగా దిష్టిపూజ మహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టికుంభాన్ని మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెం నుంచి అందపు చౌడమ్మ ( దేవరపెట్టె ) ను తీసుకువస్తారు. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు. ప్రతి ఆది, సోమవారాల్లో ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతుంటాయి.
ఈ ఆలయాలు ఇంకెక్కడ ఉండవు..

అందనపు చౌడమ్మ తల్లి దేవరపెట్టెలో ఉంటుంది. ఉత్సవ సమయంలో ఊరేగిస్తుండగా దేవర కోసం ఎదురుచూస్తున్న భక్తులు ఓ లింగా.. ఓ లింగా అని స్మరిస్తూ దేవరపెట్టెను తాకేందుకు చూస్తారు. అలా తాకడం వల్ల పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. చౌడమ్మను సౌడమ్మతల్లి అంటారు. చండీమాతగా పిలుస్తారు. యాదవుల కులదేవత అయిన సౌడమ్మ ఆలయాలు సూర్యాపేట, దురాజ్‌పల్లి, పెన్‌పహాడ్ గ్రామాల్లో తప్ప ఇంకెక్కడా కనిపించవు. జాతరలో భాగంగా గొర్రె పొట్టేలును తీసుకొస్తారు. పూలదండ వేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జడ్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు.
లింగమంతుల స్వామి శాఖాహారి
లింగమంతుల స్వామి శాఖాహారి కావడంతో ఆయనకు ప్రత్యేకంగా నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి, గంగా భవాని, యలమంచమ్మ, ఆకుమంచమ్మ, మాణిక్యాలమ్మ దేవతలు దర్శనమిస్తూ ఇక్కడ భక్తులతో పూజలందుకుంటారు.
సంతానం లేని వాళ్లు ఇలా చేయాలి..
జాతరకు ఒకరోజు ముందు ఎడ్లబండ్ల మీద భక్తులు ఇక్కడి చేరుకోవడం ఇక్కడి ప్రత్యేకత. ఇప్పుడు ట్రాక్టర్లపై కూడా భక్తులు వస్తున్నారు. మగవాళ్లు ఎరుపురంగు బనియన్, గజ్జెల లాగు ధరించి కాళ్లకు గజ్జెలు కట్టుకొని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ నడుస్తూ ఓలింగా.. ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడిబట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, ఊదిబత్తీలతో అలంకరించిన గంప నెత్తిన పెట్టుకొని నడుస్తుంటారు. సంతానం లేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. సంతానం లేనివారు తడిబట్ట స్నానాలు చేసి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీన్ని పానసారం పట్టడం అని కూడా అంటారు.
Read More Articles:Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?