Home Entertainment Nandamuri Tarakaratna | హైదరాబాద్‌ చేరుకున్న తారకరత్న పార్థివదేహం.. రేపు సాయంత్రం అంత్యక్రియలు

Nandamuri Tarakaratna | హైదరాబాద్‌ చేరుకున్న తారకరత్న పార్థివదేహం.. రేపు సాయంత్రం అంత్యక్రియలు

Nandamuri Tarakaratna | బెంగళూరులోని నారాయణ హృదయాలయ నుంచి నందమూరి తారకరత్న పార్థివ దేహాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఉన్న తన నివాసానికి తారకరత్న భౌతిక కాయాన్ని తరలించారు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుంటున్నారు. కాగా రేపు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతకుముందు తారకరత్న పార్థివదేహాన్ని ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఫిలింఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.

ఎన్టీఆర్‌ తనయుడు మోహన్‌కృష్ణ కుమారుడే తారకరత్న. 1988 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో తారకరత్న జన్మించాడు. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉన్న తారకరత్న 20 ఏళ్ల వయసులోనే హీరోగా తెరంగేట్రం చేశాడు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒకటో నెంబర్‌ కుర్రాడు సినిమాతో సినిమాల్లోకి వచ్చాడు. ఆ సినిమా సక్సెస్‌తో తారకరత్నకు వరుస అవకాశాలు వచ్చాయి. ఒకే రోజు 9 సినిమాలకు సైన్‌ చేసి రికార్డు కూడా సృష్టించాడు. కానీ ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్‌ కావడంతో అతని క్రేజ్‌ పడిపోయింది. యువరత్న, భద్రాద్రి రాముడు మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి. దీంతో విలన్‌గానూ ట్రై చేశాడు.

తొలిసారిగా రఘుబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతిలో నెగెటివ్‌ పాత్రలో నటించి ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో విలన్‌గా నటించాడు. ఈ మధ్య రాజకీయాల్లో చురుగ్గా మారిన తారకరత్న.. గుడివాడ నియోజవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఇంతలో గుండెపోటుకు గురై 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి కన్నుమూశాడు.

Exit mobile version