Home Entertainment Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

Chalapathi rao | నన్నే గుర్తుపట్టరు నువ్వేంత.. చలపతిరావును ఎన్టీఆర్ అలా ఎందుకు అన్నారు?

chalapathi rao | తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు వంద రెండు వందల సినిమాలు చేయాలంటేనే ప్రయాస పడుతున్నారు.కానీ చలపతిరావు అవలీలగా 1200కి పైగా చిత్రాల్లో నటించాడు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో మెప్పించాడు. ఇదంతా సులువుగా అయ్యిందా అంటే లేదు. దీని కోసం చలపతిరావు ఎంతగానో కష్టపడ్డాడు. సినిమాల్లో రాణించాలన్న ఆ మొండితనమే ఆయన్ను ఎన్టీ రామారావు దృష్టిలో పడేలా చేసింది. రామారావుతో పరిచయం చలపతి రావు జీవితాన్నే మార్చేసింది.

సినిమాల్లో అవకాశం కోసం 1967లో చలపతిరావు మద్రాసు వెళ్లాడు. ఆ సమయంలో లక్ష రూపాయలు అతని వెంట తీసుకెళ్లాడు. ఆ డబ్బుతో ఒక సినిమా కూడా డబ్ చేసి రిలీజ్ చేశాడు. అది అంతగా ఆడలేదు. ఆ తర్వాత లగ్జరీగా కనబడేందుకు ఒక కారు కొన్నాడు. దానికి కూడా యాక్సిడెంట్ అయిపోయింది. రిచ్ లుక్ మెయింటైన్ చేస్తే ఆఫర్లు వస్తాయేమోనని ఇలా తోచిన ప్రయత్నాలు అన్నీ చేశాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. తన ఆలోచన తప్పు అని తెలిసేసరికి చేతిలో డబ్బులు అయిపోయాయి. హీరోగా అవకాశాలు మాత్రం రాలేవు. అప్పటికే కృష్ణ, శోభన్ బాబు అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. అలాంటి టైమ్‌లో హీరోగా అవకాశాలు కష్టమని గ్రహించి విలన్‌గా ట్రై చేశాడు. కానీ అప్పటికే కైకాల సత్యనారాయణ, రాజనాల, ప్రభాకర్‌రెడ్డి వంటి నటులు విలన్లుగా రాణిస్తున్నారు. దీంతో విలన్‌గా కూడా అవకాశాలు రాలేదు. ఎన్టీఆర్ గూఢచారి 116లో తొలిసారి అవకాశం వచ్చినప్పటికీ.. తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేవు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లలేము.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైమ్‌లో ఎన్టీఆర్‌ను కలుద్దామని అనుకున్నాడు.

ఎన్టీఆర్ పరిచయం జీవితాన్నే మార్చేసింది

అప్పట్లో తిరుపతి యాత్రకు వచ్చిన తెలుగు ప్రజలు.. మద్రాసు వచ్చి రామారావును దర్శించుకుని వెళ్లేవాళ్లు. అలా ఆ గుంపులో ఉదయం 5 గంటలకు రామారావు దగ్గరకు చలపతిరావు వెళ్లాడు. అందరూ వెళ్లిపోయినా కూడా చలపతి రావు అక్కడే ఉన్నాడు. ఇది గమనించిన రామారావు ఏంటి విషయమని అడిగితే.. వేషాల కోసం వచ్చానని చెప్పాడు. ఈరోజుల్లో అవకాశాలు దొరకడం కష్టం.. తిరిగి ఇంటికి వెళ్లిపో అని ఎన్టీఆర్ సూచించాడు. ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్తామని మద్రాసులోనే ఉండిపోయాడు. వారం రోజుల తర్వాత మళ్లీ ఎన్టీఆర్‌ను కలిసేందుకు వెళ్లాడు. అప్పుడు చలపతిని చూసి గుర్తుపట్టిన ఎన్టీఆర్.. నువ్వు ఇంకా ఊరెళ్లిపోలేదా అని అడిగాడు. సినిమాల్లో వేషాలు వేయకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని రామారావుతో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు చలపతి రావు. దీంతో రామారావు పక్కనే ఉన్న డైరెక్టర్‌తో మొండోడిలా ఉన్నాడు.. ఏదైనా వేషం ఉంటే ఇవ్వండయ్యా అని అన్నాడు. అప్పుడే కథానాయకుడు సినిమా మొదలుపెట్టారు. అందులోనే చలపతిరావుకు మున్సిపల్ కమిషనర్ వేషం ఇచ్చారు. అప్పట్నుంచి అసలైన సినీ ప్రయాణం మొదలైంది.

ఒక్క సినిమాలోనే ఐదు వేషాలిచ్చిన ఎన్టీఆర్

కథానాయకుడు తర్వాత రామారావుతో చలపతిరావుకు సాన్నిహిత్యం పెరిగిపోయింది. రామారావు కూడా తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇచ్చేవాడు. ఆరేడేళ్ల పాటు రామారావు సినిమాల్లోనే చలపతిరావు యాక్ట్ చేశాడు. అలాంటి సమయంలోనే దానవీరశూరకర్ణ సినిమా మొదలైంది. అప్పుడే మరో సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో ఆర్టిస్టులు అందర్నీ ఆ సినిమా వాళ్లు పట్టుకెళ్లారు. దానవీరశూరకర్ణ సినిమాకు ఆర్టిస్టులు తక్కువయ్యారు. అప్పుడు చలపతిరావును ఎన్టీఆర్ పిలిపించుకున్నారు. ఆ సినిమాలో చలపతిరావుకు 5 వేషాలు ఇచ్చాడు. ఇంద్రుడు, శూతుడు, జరాసంధుడు.. ఇలా ఐదు గెటప్‌లు వేయించాడు. దీంతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన చలపతిరావు తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. మీరేమో మూడు వేషాలు వేస్తున్నారు. నాకేమో ఐదు వేషాలిచ్చారు. ఇక సినిమాలో ఇంకా ఐదారు గెటప్‌లే ఉన్నాయి కదా.. చూసిన వాళ్లు నవ్వుతారేమో అని తన మనసులోని సందేహాన్ని ఎన్టీఆర్ ముందు ఉంచాడు. దానికి ఎన్టీఆర్ పెద్దగా నవ్వి.. కొన్ని ఊర్లలో ఎన్టీ రామారావు అంటేనే తెలియదు.. నిన్నెవరు గుర్తుపడతారు? అని అన్నాడు. రామారావు ఇచ్చిన ధైర్యంతో చలపతిరావు ఆ సినిమాలో ఐదు వేషాలు వేశాడు. ఈ దెబ్బతో చలపతిరావుకు వరుసగా అవకాశాలు రావడం మొదలైంది.

ఆ తర్వాతే మారిన చలపతి రావు

ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉండటం వల్ల చలపతిరావు ఆయనకే గౌరవం ఇచ్చేవాడు. తన దృష్టిలో ఎన్టీఆర్ ఒక్కడే ఆర్టిస్టు అన్నట్టు ఉండేవాడు. దీంతో చలపతిరావు ఎన్టీఆర్ మనిషి అనే ముద్ర పడిపోయింది. చలపతి కూడా రామారావు సినిమాల్లోనే నటించేవాడు. కానీ దానవీర శూరకర్ణ సినిమా తర్వాత ఒకసారి నాగేశ్వర్‌రావు తనను పిలిచి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి చలపతిరావు తన ప్రవర్తనను మార్చుకున్నాడు. అందరూ ఆర్టిస్టులే.. అందర్నీ గౌరవించాలని తెలుసుకున్నాడు. అప్పట్నుంచి అందరి సినిమాల్లో చేశాడు. వయసులో ఉన్నప్పుడు రేప్ సీన్లలో నటించినప్పటికీ.. వయసు పెరిగేకొద్దీ విభిన్న పాత్రలు చేశాడు. అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ ఇండస్ట్రీలో బాబాయ్ అనే ముద్ర సంపాదించుకున్నాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Chalapathi Rao | టాలీవుడ్‌లో మరో విషాదం.. గుండెపోటుతో చలపతిరావు హఠాన్మరణం

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Exit mobile version