Home News International Gay Couple | పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇండియన్ గే కపుల్

Gay Couple | పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇండియన్ గే కపుల్

Image Source : Instagram

Gay Couple | హిందూ సంప్రదాయం ప్రకారం స్వలింగ సంపర్క వివాహం చేసుకుని అప్పట్లో సంచలనం సృష్టించిన ఆదిత్య మాదిరాజు, అమిత్ షా జంట మళ్లీ తెరపైకి వచ్చింది. తొందరలోనే తాము పేరెంట్స్ కాబోతున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది మేలో తమ మొదటి సంతానాన్ని స్వాగతించబోతున్నట్టు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆదిత్య మాదిరాజు, అమిత్ షా జంట ఈ శుభవార్తను నెటిజన్లతో పంచుకుంది.

ఢిల్లీకి చెందిన తెలుగు అబ్బాయి ఆదిత్య మాదిరాజు, న్యూజెర్సీకి చెందిన గుజరాతీ అమెరికన్ అమిత్ షా ఇద్దరూ ఓ స్నేహితుడి పార్టీలో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2019లో పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో ఇద్దరు భారతీయ పురుషులు చేసుకున్న ఈ గే పెళ్లి అప్పట్లో సంచలనంగా మారింది. అందరూ ఈ జంటను వింతగా చూసినప్పటికీ.. వీళ్లు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు పిల్లలు కూడా కావాలని అనుకున్నారు. ఇందు కోసం ఎగ్ డోనర్ (అండ దాతలు), అద్దె గర్భాలు వంటి వాటి ద్వారా పిల్లలను ఎలా పొందవచ్చు అనే దానిపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలో సాధారణ జంటలతో పోలిస్తే తాము పిల్లలను కనడం ఖర్చుతో కూడిన పని అని అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ సంతానం కావాలన్న ఆశతో ముందడుగు వేశారు. సరోగసీ ద్వారా పిల్లలను కనేందుకు కష్టపడి ఎగ్ డోనర్‌ను దొరకబట్టారు. నాలుగు రౌండ్లు ఐవీఎఫ్ చికిత్స తర్వాత చివరకు తమ కోరిక నెరవేర్చుకున్నారు.

పేరెంట్స్ అవ్వబోతున్న ఈ సంతోషాన్ని తాజాగా అమిత్ షా, ఆదిత్య మాదిరాజు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఈ సందర్భంగా వాళ్లు తెలిపారు. ఇప్పట్నుంచి అన్ని జంటల్లాగే ఫాదర్స్ డే, మదర్స్ డే ఉత్సాహంగా జరుపుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. స్వలింగ సంపర్క జంట అయినా కూడా మీరు కోరుకున్న జీవితాన్ని గడపవచ్చని నిరూపించాలని అనుకుంటున్నామని అమిత్, ఆదిత్య జంట చెప్పుకొచ్చింది. తమ జీవితంలోకి వచ్చాక స్వలింగ సంపర్క జంటలపై చూపిస్తున్న వ్యత్యాసం తగ్గిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమను చూసి ఎంతోమంది స్వలింగ సంపర్కులు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారని చెప్పిన అమిత్ షా.. ఇప్పుడు పిల్లల విషయంలోనూ తమను ఆదర్శంగా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపై అందరూ కపుల్ గురించే మాట్లాడతారు కానీ గే కపుల్ గురించి కాదని పేర్కొన్నాడు. మేము గే పేరెంట్స్ కాదు.. జస్ట్ పేరెంట్స్ అని ఆదిత్య చెప్పుకొచ్చాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Exit mobile version