Home Latest News RCB vs KKR | శార్దూల్‌ ఠాకూర్‌కు పూనకం..బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన ఆల్‌రౌండర్‌

RCB vs KKR | శార్దూల్‌ ఠాకూర్‌కు పూనకం..బ్యాట్‌తో విధ్వంసం సృష్టించిన ఆల్‌రౌండర్‌

RCB vs KKR | టైమ్‌ 2 న్యూస్‌, కోల్‌కతా: మొదట బ్యాటింగ్‌లో దంచికొట్టిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌).. ఆనక బౌలింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది. గురువారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన పోరులో కోల్‌కతా 81 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)పై గెలుపొందింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శార్దూల్‌ ఠాకూర్‌ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేసుకున్నాడు. రింకు సింగ్‌ (46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా రాణించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. వందో ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న మిస్సైల్‌ మ్యాన్‌ రస్సెల్‌ (0) గోల్డ్‌న్‌ డకౌట్‌గా వెనుదిరగగా.. మన్‌దీప్‌ సింగ్‌ (0), కెప్టెన్‌ నితీశ్‌ రాణా (1), వెంకటేశ్‌ అయ్యర్‌ (3) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో డేవిడ్‌ విల్లే, కరణ్‌ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. కెప్టన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (21; 3 ఫోర్లు), మిషెల్‌ బ్రాస్‌వెల్‌ (19) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. మ్యాక్స్‌వెల్‌ (5), షాబాజ్‌ అహ్మద్‌ (1), దినేశ్‌ కార్తీక్‌ (9), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనూజ్‌ రావత్‌ (1), హర్షల్‌ పటేల్‌ (0) విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 4, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సుయాశ్‌ శర్మ మూడు వికెట్లు పడగొట్టారు. డేవిడ్‌ విల్లే (20 నాటౌట్‌), ఆకాశ్‌దీప్‌ (17) ఆఖర్లో కాస్త పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఒక ఎండ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ ధాటిగా ఆడినా.. వెంకటేశ్‌ అయ్యర్‌, మన్‌దీప్‌ సింగ్‌, నితీశ్‌ రాణా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతున్నా.. రహ్మానుల్లా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దంచికొట్టాడు. అతడికి రింకూ సింగ్‌ నుంచి చక్కటి సహకారం లభించింది. ఇక కుదురుకున్నట్లే అనుకుంటున్న సమయంలో కరణ్‌ శర్మ 12వ ఓవర్లో వరుస బంతుల్లో రహ్మానుల్లాతో పాటు రస్సెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో కోల్‌కతా 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇక ప్రధాన ఆటగాళ్లు ఎవరూ లేరనుకుంటున్న సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్‌ ఠాకూర్‌ విశ్వరూపం కనబర్చాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండ్రీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటిన శార్దూల్‌. ఆకాశ్‌ దీప్‌ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. బ్రాస్‌వెల్‌కు రెండు సిక్సర్లు రుచి చూపించిన శార్దూల్‌.. హర్షల్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు దంచాడు. ఈ క్రమంలో శార్దూల్‌ 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 19వ ఓవర్లో రింకూ సింగ్‌ 4,6,6 బాది స్కోరును రెండొందలు దాటించాడు.

Exit mobile version