Home Latest News Sunrisers Hyderabad | రైజర్స్‌ రాత మారేనా..ఉప్పల్‌ వేదికగా పంజాబ్‌తో అమీతుమీ

Sunrisers Hyderabad | రైజర్స్‌ రాత మారేనా..ఉప్పల్‌ వేదికగా పంజాబ్‌తో అమీతుమీ

Sunrisers Hyderabad | టైమ్‌ 2 న్యూస్‌, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతగడ్డపై రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఐపీఎల్‌-16వ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైన సన్‌రైజర్స్‌.. ఆదివారం పటిష్టమైన పంజాబ్‌ కింగ్స్‌ను డీకొననుంది. గత రెండు సీజన్లలో 8వ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ ఈ సీజన్‌లోనైనా స్థానాన్ని మెరుగుపరచుకోవాలని ఆశిస్తున్నది. తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్ల వైఫల్యంతో హైదరాబాద్‌కు పరాజయాలు తప్పలేదు. మెరుగైన బౌలింగ్‌ దళమున్నా స్వల్ప లక్ష్యాలను కాపాడుకోవడం వారి సామర్ధ్యానికి మించిన పనైంది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం తమ పరాజయాలకు ముఖ్య కారణమని హెడ్‌ కోచ్‌ లారా అంగీకరించాడు.

కొత్త కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ కూడా హైదరాబాద్‌ తలరాతను మార్చలేకపోతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న హ్యారీ బ్రూక్‌ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతున్నాడు. ఈసారి కూడా అభిషేక్‌ శర్మ స్థానంలో అమన్‌ప్రీత్‌ సింగ్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశాలున్నాయి.

భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న మయాంక్‌ అగర్వాల్‌తో పాటు రాహుల్‌ త్రిపాఠి రాణించాల్సిన అవసరముంది. ఆఖర్లో అబ్దుల్‌ సమద్‌ రాణించడం వల్లే గత రెండు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్‌ ఆమాత్రం స్కోౖర్లెనా సాధించగలిగింది. ఆఫ్ఘన్‌ పేసర్‌ ఫజల్‌హక్‌ ఫరూకి నిలకడగా రాణిస్తున్నాడు. అయితే బౌలర్లను సమర్ధించగలిగినంత స్కోరు అందించడంలో బ్యాటర్లు విఫలమవుతున్నారు.

పంజాబ్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ రెండు అర్ధసెంచరీలతో జట్టు విజయాలకు పునాది వేశాడు. ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌, భానుక రాజపక్సె, నాథన్‌ ఎలిస్‌ అవసరానికి తగ్గట్టు రాణిస్తున్నారు. ఇక భారీ మూల్యం వెచ్చించి కొన్న సామ్‌ కరన్‌ పర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్నీ అంశాల్లో పంజాబ్‌ పేపర్‌పై బలీయంగా కనిపిస్తున్నది. స్వస్థలంలో ఆడుతున్నా.. పంజాబ్‌పై గెలిచేందుకు సన్‌రైజర్స్‌ సామర్ధ్యానికి మించి రాణించాల్సి ఉంది. సమిష్టిగా రాణించకపోతే రైజర్స్‌ ఖాతాలో మూడో పరాజయం చేరడం ఖాయమే.

‘హ్యాట్రిక్‌’పై గుజరాత్‌ కన్ను

డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ‘హ్యాట్రిక్‌’ విజయాలపై కన్నేసింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయంతో తమకెదురు లేదని నిరూపించుకోవాలని గుజరాత్‌ ఉరకలు వేస్తున్నది. మరోవైపు తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై విజయం గాలివాటం కాదని నిరూపించుకోవాలని నైట్‌రైడర్స్‌ ఆశిస్తున్నది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, మిడిలార్డర్‌లో సాయి సుదర్శన్‌లు ఫామ్‌లో ఉండడంతో గుజరాత్‌ ప్రత్యర్థి స్కోర్లను సునాయాసంగా ఛేదించి విజయాలందుకున్నది. దానికితోడు సీనియర్‌ బౌలర్లు మహ్మద్‌ షమి, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తుండడంతో కోల్‌కతాకు విజయం అంత సులువేమీ కాదు. ఈ యేడాది మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించి జోరుమీదున్న గిల్‌ను నిలువరించడం బౌలర్లకు కష్టసాధ్యమే.

గత రెండు మ్యాచ్‌లలో సాహాతో కలిసి గిల్‌ శుభారంభాలను అందించాడు. దేశవాళీలో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న సాయి సుదర్శన్‌ ఐపీఎల్‌లో తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. రాహుల్‌ తెవాటియా సిక్సర్లపై దృష్టి సారిస్తుండగా, రషీద్‌ఖాన్‌ తన బ్యాటింగ్‌ సామర్ధ్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎనిమిదో స్థానం వరకు గుజరాత్‌ బ్యాటింగ్‌ బలీయంగా కనిపిస్తున్నది. పవర్‌ప్లేలో పరుగులను నియంత్రించడంలోనే గుజరాత్‌ తరచూ విఫలమవుతున్నది.

మరోవైపు నైట్‌రైడర్స్‌ జాసన్‌ రాయ్‌ చేరికతో కొంత బలపడింది. అయితే అతడిని ఏ స్థానంలో ఆడిస్తారన్నది చూడాలి. అఫ్ఘాన్‌ కీపర్‌బ్యాట్స్‌మన్‌ రహ్మతుల్లా గుర్బాజ్‌ గత రెండు మ్యాచ్‌లలో సత్తా చాటాడు. బెంగళూరుపై మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు దోహదం చేసిన శార్దూల్‌ ఠాకూర్‌పై జట్టు ఆశలు పెట్టుకున్నది. బౌలింగ్‌లో సుయాష్‌ శర్మ, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌లపైనే కెప్టెన్‌ నితీష్‌ రాణా ఆశలుపెట్టుకున్నాడు.

Exit mobile version