Tuesday, May 28, 2024
- Advertisment -
HomeLatest NewsIND vs AUS | మొన్నటికంటే మెరుగ్గా.. భారత్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 263 ఆలౌట్‌

IND vs AUS | మొన్నటికంటే మెరుగ్గా.. భారత్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా 263 ఆలౌట్‌

IND vs AUS | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్‌-గవాస్కర్‌’ సిరీస్‌ రెండో టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. నిలదొక్కుకోవడం కంటే.. ధాటిగా ఆడటంపైనే ఎక్కువ దృష్టి పెట్టిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు పరీక్ష పెడుతున్నా.. మొండిగా క్రీజులో నిల్చోవడంతో పాటు.. వేగంగా ఆడుతూ వీలైనన్నీ పరుగులు రాబట్టిన కంగారూలు గత టెస్టు (నాగ్‌పూర్‌) కంటే మంచి ఆటతీరు కనబర్చారు. ఉస్మాన్‌ ఖవాజా (125 బంతుల్లో 81; 12 ఫోర్లు, ఒక సిక్సర్‌), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (142 బంతుల్లో 72 నాటౌట్‌; 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించగా.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడుతూ విలువైన పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో మహమ్మద్‌ షమీ 4 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా చెరో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (13 బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమ్‌ఇండియా.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 242 పరుగులు వెనుకబడి ఉంది.

వార్నర్‌ మరోసారి..

గత కొన్ని మ్యాచ్‌లుగా విఫలమవుతున్న ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి పేలవ ప్రదర్శన కొనసాగించాడు. గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన వార్నర్‌.. ఈ సారి కాస్త కుదురుకునేందుకు ప్రయత్నించినా.. ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. తొలి వికెట్‌కు ఖవాజాతో కలిసి 50 పరుగులు జోడించిన అనంతరం మహమ్మద్‌ షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అశ్విన్‌ డబుల్‌ ధమాకా

వార్నర్‌ ఔటైనా.. మార్నస్‌ లబుషేన్‌ (18)తో కలిసి ఖవాజా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడీ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుండటంతో ఆస్ట్రేలియా కోలుకున్నట్లే కనిపించింది. నాగ్‌పూర్‌ టెస్టులో తొలి రోజు రెండు సెషన్లలోనే ఆలౌటైన ఆసీస్‌.. ఈసారి భిన్నమైన గేమ్‌ప్లాన్‌తో వచ్చినట్లు అనిపించింది. అయితే లంచ్‌కు ముందు చివరి ఓవర్‌ వేసిన అశ్విన్‌.. ఆసీస్‌కు గట్టి దెబ్బ కొట్టాడు. మూడు బంతుల వ్యవధిలో లబుషేన్‌తో పాటు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (0)ను వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్‌ 91/3తో నిలిచింది.

హ్యాండ్స్‌కోంబ్‌ పోరాటం..

ట్రావిస్‌ హెడ్‌ (12) కూడా విఫలం కాగా.. ఈ దశలో ఖవాజాతో కలిసి హ్యాండ్స్‌కోంబ్‌ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ జోడీ భారత స్పిన్నర్లను చక్కగా ఎదుర్కొంది. ఖవాజా పదే పదే స్వీప్‌ షాట్లు కొడుతూ అర్ధశతకం పూర్తి చేసుకోగా.. హ్యాండ్స్‌కోంబ్‌ నిధానంగా ముందుకు సాగాడు. ఇక కంగారూలకు తిరుగులేదు అనుకుంటున్న తరుణంలో ఖవాజాను జడేజా బుట్టలో వేసుకోగా.. తుదపరి ఓవర్‌లో అలెక్స్‌ కారీ (0) డకౌటయ్యాడు.

కమిన్స్‌ మెరుపులు..

కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక అటు బౌలింగ్‌తో పాటు.. బ్యాటింగ్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కమిన్స్‌ మరోసారి మెరిశాడు. ఎదురుదాడే ప్రధాన ఆయుధంగా వీలైనన్ని ఎక్కువ పరుగులు జోడించాలనే ఉద్దేశంతో భారీ షాట్లకు దిగాడు. మూడు ఫోర్లు రెండు సిక్సర్లతో జట్టు స్కోరును రెండొందలు దాటించాడు. అప్పటి వరకు నిధానంగా ఆడిన హ్యాండ్స్‌కోంబ్‌.. కమిన్స్‌ ఔటయ్యాక చివరి వరకు అజేయంగా క్రీజులో నిలిచి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.

పుజారాకు వందో టెస్టు..

కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న భారత వన్‌డౌన్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారాకు సునీల్‌ గవాస్కర్‌ జ్ఞాపిక అందజేశాడు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న గవాస్కర్‌.. టెస్టు క్రికెట్‌ గొప్పతనాన్ని వివరించాడు. ఈ సందర్భంగా జట్టు ఆటగాళ్లంతా పుజారా అభింనదనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుజారా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. మైలురాయి టెస్టులో పుజారా సెంచరీ కొట్టాలని.. సన్నీ ఆకాంక్షించాడు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News