Home Latest News GT vs RR | ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో.. రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘనవిజయం

GT vs RR | ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో.. రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘనవిజయం

GT vs RR | టైమ్‌ 2 న్యూస్‌, జైపూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. 10 మ్యాచ్‌ల్లో ఏడో విజయం నమోదు చేసుకున్న టైటాన్స్‌.. 14 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగిన పోరులో పాండ్యా సేన 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 17.5 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (30; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. అఫ్గాన్‌ స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌ (3/14), నూర్‌ అహ్మద్‌ (2/25) ధాటికి బట్లర్‌ (8), యశస్వి జైస్వాల్‌ (14), దేవదత్‌ పడిక్కల్‌ (12), అశ్విన్‌ (2), రియాన్‌ పరాగ్‌ (4), హెట్‌మైర్‌ (7), ధ్రువ్‌ జురేల్‌ (9) పెవిలియన్‌కు వరుస కట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (41 నాటౌట్‌; 5 ఫోర్లు), శుభ్‌మన్‌ గిల్‌ (36; 6 ఫోర్లు) జట్టుకు శుభారంభం అందించగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. రాయల్స్‌ బౌలర్లలో చాహల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. రషీద్‌ ఖాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శనివారం జరుగనున్న డబుల్‌ హెడర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్న రాజస్థాన్‌ ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. హార్దిక్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే బట్లర్‌ ఔట్‌ కాగా.. యశస్వి జైస్వాల్‌ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌ బాటపట్టాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 47/1తో మంచి స్థితిలో కనిపించిన రాయల్స్‌ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను జోస్‌ లిటిల్‌ వెనక్కిపంపగా.. అక్కడి నుంచి అఫ్గాన్‌ స్పిన్నర్ల తడాఖా మొదలైంది. ఇటు రషీద్‌, అటూ నూర్‌ అహ్మద్‌ పోటీపడి వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి ధాటికి రాయల్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడను తలపించింది. చివర్లో బౌల్ట్‌ (15; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) కాస్త ప్రతిఘటించడంతో రాజస్థాన్‌ వంద పరుగుల మార్క్‌ దాటగలిగింది.

గత మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాండ్యా అతి జాగ్రత్తకు పోవడంతో టైటాన్స్‌కు ఓటమి ఎదురవగా.. ఈసారి అలాంటి తప్పిదం జరగనివ్వలేదు. మొదట సాహా, గిల్‌ వికెట్‌ కాపాడుకుంటూ అడపాదడపా బౌండ్రీలతో పరుగులు రాబట్టగా.. గిల్‌ ఔట్‌ కావడంతో క్రీజులోకి వచ్చిన పాండ్యా శివాలెత్తిపోయాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ చూస్తుండగానే మ్యాచ్‌ను ముగించాడు. హార్దిక్‌ విశ్వరూపం చూపడంతో మరో 37 బంతులు మిగిలుండగానే టైటాన్స్‌ విజయం సాధించింది.

Exit mobile version