Home Latest News GT vs PBKS | హర్దిక్‌ సేనకు మూడో విజయం.. పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసిన గుజరాత్‌...

GT vs PBKS | హర్దిక్‌ సేనకు మూడో విజయం.. పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసిన గుజరాత్‌ టైటాన్స్‌

GT vs PBKS | టైమ్‌ 2 న్యూస్‌, మొహాలీ: ఐపీఎల్‌16వ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఫుల్‌ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (8) విఫలం కాగా.. మాథ్యూ షార్ట్‌ (36), భానుక రాజపక్స (20), జితేశ్‌ శర్మ (25), సామ్‌ కరన్‌ (22), షారుక్‌ ఖాన్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో మోహిత్‌ శర్మ రెండు, షమీ, రషీద్‌, జోసెఫ్‌, లిటిల్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. 2020 తర్వాత తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన మోహిత్‌ శర్మ చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (49 బంతుల్లో 67; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. వెటరన్‌ ప్లేయర్‌ వృద్ధిమాన్‌ సాహా (30; 5 ఫోర్లు) రాణించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌, రబడ, హర్‌ప్రీత్‌ బ్రార్‌, సామ్‌ కరన్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

ఒకరి వెంట ఒకరు..

మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (0) పెవిలియన్‌ చేరగా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పోరులో ఒక్క పరుగు తేడాతో శతకం కోల్పోయిన సారథి శిఖర్‌ ధవన్‌ ఎక్కువసేపు నిలువలేకపోయాడు. దీంతో ఆరంభంలోనే పంజాబ్‌ ఇన్నింగ్స్‌ తడబడగా.. మిడిలార్డర్‌ తలాకొన్ని పరుగులు చేసినా.. యాంకర్‌ రోల్‌ పోషించే వాళ్లు లేక ఆ జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన మాథ్యూ షార్ట్‌ను రషీద్‌ ఖాన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయగా.. రాజపక్స, జితేశ్‌ శర్మ మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ బంతికో పరుగు చొప్పున రాబట్టాడు

అదిరే ఆరంభం..

ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ వరుస బౌండ్రీలతో విరుచుకుపడటంతో గుజరాత్‌ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం రబడ బౌలింగ్‌లో సాహా ఔటైనా.. గిల్‌ జోరు కొనసాగించాడు. సాయి సుదర్శన్‌ (19) కాసేపు అలరించగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (8) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయినా టార్గెట్‌ పెద్దది కాకపోవడంతో గుజరాత్‌ ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు. చివరి ఓవర్‌లో 7 పరుగులు చేయాల్సిన దశలో గిల్‌ ఔట్‌ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. రాహుల్‌ తెవాటియా (5 నాటౌట్‌), డేవిడ్‌ మిల్లర్‌ (17 నాటౌట్‌) మిగిలిన పనిపూర్తి చేశారు.

Exit mobile version