Thursday, May 30, 2024
- Advertisment -
HomeLatest NewsMI vs DC | ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్‌..ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాలుగో పరాజయం

MI vs DC | ఎట్టకేలకు బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్‌..ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాలుగో పరాజయం

MI vs DC | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో ముంబై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిట్స్‌ను చిత్తుచేసింది. తాజా సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ వార్నర్‌ (47 బంతుల్లో 51; 6 ఫోర్లు) హాఫ్‌సెంచరీ నమోదు చేసుకోగా.. అక్షర్‌ పటేల్‌ (25 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టాడు. ముంబై బౌలర్లలో పియూష్‌ చావ్లా, జాసెన్‌ బెహ్రన్‌డార్ఫ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (45 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చక్కటి అర్ధశతకంతో లయ అందుకోగా.. యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (31; 6 ఫోర్లు), తెలంగాణ కుర్రాడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ (28 బంతుల్లో 41; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (0) మరోసారి నిరాశ పరిచాడు. ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్నా.. కామెరూన్‌ గ్రీన్‌ (17 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (13 నాటౌట్‌) జట్టును గెలిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్‌ కుమార్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అక్షర్‌ మెరుపులు..

మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి మంచి ఆరంభం లభించేటట్లే కనిపించింది. గత మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఓపెనర్‌ పృథ్వీ షా (15; 3 ఫోర్లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. మనీశ్‌ పాండే (26; 5 ఫోర్లు) పర్వాలేదనిపించాడు. అరంగేట్ర ఆటగాడు యష్‌ ధుల్‌ (2), రావ్‌మన్‌ పావెల్‌ (4), లలిత్‌ యాదవ్‌ (2) విఫలమవడంతో క్యాపిటల్స్‌ 98/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ వార్నర్‌కు జత కలిసిన అక్షర్‌ ధాటిగా ఆడాడు. షోకీన్‌ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన అక్షర్‌.. గ్రీన్‌ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. బెహ్రన్‌డార్ఫ్‌కు రెండు సిక్సర్లు, మెరిడిత్‌కు 4,6 రుచి చూపించిన ఈ ఆల్‌రౌండర్‌ 22 బంతుల్లో అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. అప్పటికే వార్నర్‌ కూడా ఫిఫ్టీ పూర్తవడంతో ఢిల్లీ మరింత స్కోరు చేసేలా కనిపించింది.

ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు

బెహ్రన్‌డార్ప్‌ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫుల్‌ జోష్‌లో ఉన్న అక్షర్‌ తొలి బంతికి క్యాచ్‌ ఔట్‌ కాగా.. వార్నర్‌ అతడిని అనుసరించాడు. మధ్యలో కుల్దీప్‌ యాదవ్‌ (0) రనౌట్‌ కాగా.. చివరి బంతికి అభిషేక్‌ పొరెల్‌ (1) కూడా వెనుదిరిగాడు. ఆఖరి ఓవర్‌లో నోర్జే (5)ను ఔట్‌ చేసిన మెరిడిత్‌ మరో రెండు బంతులు మిగిలుండగానే ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగించాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి 165/5తో మంచి స్థితిలో కనిపించిన ఢిల్లీ.. చివరి రెండు ఓవర్లలో 7 పరుగులే చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది.

రోహిత్‌ రఫ్ఫాట..

ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయిన ముంబై ఇండియన్స్‌.. ఢిల్లీతో పోరులో సమిష్టిగా కదంతొక్కింది. తొలుత బౌలర్లు రాణించడంతో ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేస్తే.. ఆనక టాపార్డర్‌ దంచికొట్టడంతో ముంబై పాయింట్ల ఖాతా తెరిచింది. ముఖ్యంగా టచ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధాటిగా ఆడగా.. అతడికి ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ చక్కటి సహకారం అందించారు.

ముఖేశ్‌ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్‌ 4,6,4 కొట్టగా.. రెండో ఓవర్లో ఇషాన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లు దంచాడు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం ఇషాన్‌ రనౌట్‌గా వెనుదిరగగా.. తిలక్‌ వర్మ చక్కటి షాట్లతో అలరించాడు. నాలుగు సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆఖర్లో కామెరూన్‌ గ్రీన్‌, టిమ్‌ డేవిడ్‌ రాణించడంతో ముంబై తొలి విజయం ఖాతాలో వేసుకుంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News