Home Latest News CSK vs LSG | ధోనీ సిక్సర్లతో దద్దరిల్లిన చెపాక్‌ స్టేడియం.. లక్నోపై చెన్నై జయకేతనం

CSK vs LSG | ధోనీ సిక్సర్లతో దద్దరిల్లిన చెపాక్‌ స్టేడియం.. లక్నోపై చెన్నై జయకేతనం

CSK vs LSG | టైమ్‌ 2 న్యూస్‌, చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌ ఆరంభం పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయం పాలైన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. సొంతగడ్డపై జరిగి పోరులో విశ్వరూపం కనబర్చింది. సోమవారం జరిగిన పోరులో చెన్నై 12 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది.

గత మ్యాచ్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్న యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (31 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. కాన్వే (29 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్‌ దూబే (27; ఒక ఫోర్‌, 3 సిక్సర్లు) అంబటి రాయుడు (27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి ఓవర్‌లో క్రీజులోకి అడుగుపెట్టిన కెప్టెన్‌ కూల్‌ మహేంద్రసింగ్‌ ధోనీ.. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి మైదానాన్ని హోరెత్తించాడు. లక్నో బౌలర్లలో మార్క్‌ వుడ్‌, రవి బిష్ణోయ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్‌ కైల్‌ మయేర్స్‌ (22 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిలార్డర్‌ విఫలమవడంతో లక్నో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. పూరన్‌ (32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా అప్పటికే ఆలస్యమైపోయింది. చెన్నై బౌలర్లలో మోయిన్‌ అలీ 4 వికెట్లు పడగొట్టాడు. లీగ్‌లో భాగంగా మంగళవారం జరుగనున్న పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

రుతురాజ్‌ అదే జోరు

సీజన్‌ ఆరంభ పోరులో.. సహచరులంతా చేతులెత్తేసిన చోట అసమాన పోరాటం కనబర్చిన యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. ఈ మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించాడు. నాలుగేండ్ల తర్వాత చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు మైదానానికి పోటెత్తారు. ప్రేక్షకులతో కిక్కిరిసిన చెపాక్‌ స్టేడియాన్ని రుతురాజ్‌, కాన్వే తమ బాదుడు ఉర్రూతలూగించారు. వీరిద్దరి ధాటికి స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించగా.. గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అల్లాడించిన పేసర్‌ మార్క్‌వుడ్‌ ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అయినా అతడి బౌలింగ్‌లో చెన్నై ప్లేయర్లు భారీగా పరుగులు రాబట్టారు.

ఓపెనర్లతో పాటు మధ్య ఓవర్లలో శివమ్‌ దూబే, అంబటి రాయుడు, మోయిన్‌ అలీ అదే దూకుడు కొనసాగించడం చెన్నైకి కలిసొచ్చింది. గత మ్యాచ్‌లో స్లో రన్‌రేట్‌తో విమర్శలకు గురైన భారత ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేపై ధోనీ మరోసారి నమ్మకముంచాడు. స్కోరు బుల్లెట్‌ వేగంతో దూసుకెళ్తున్న సమయంలో తొలి వికెట్‌ పడగా.. ప్రధాన ఆటగాళ్లు ఎందరో వేచి ఉన్నా.. దూబేను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపాడు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించిన దూబే.. ఆ తర్వాత భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మధ్యలో మోయిన్‌ అలీ కొన్ని చక్కటి ఫోర్లు కొట్టగా.. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు.

ఇక ఆఖరి ఓవర్‌లో మైదానంలోకి దిగిన ‘తలా’ ధోనీ.. అసలు సిసలు ఫినిషింగ్‌ ఎలా ఉంటుందో మరోసారి చాటాడు. మార్క్‌ వుడ్‌ వేసిన 20వ ఓవర్‌ రెండో బంతిని ఎదుర్కొన్న ధోనీ దాన్ని సూపర్‌ సిక్సర్‌గా మలిచాడు. మరుసటి బంతిని కూడా మహీ ప్రేక్షకుల్లో పడేయడంతో చెపాక్‌ స్టేడియం ధోనీ నామస్మరణతో మార్మోగిపోయింది. అదే జోరులో మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసిన మాస్టర్‌ మైండ్‌.. రవి బిష్ణోయ్‌ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్‌ చేరాడు.

Exit mobile version