Home Latest News IPL 2023 New Rules | ఐపీఎల్‌ కొత్త రూల్స్‌ తెలుసా!

IPL 2023 New Rules | ఐపీఎల్‌ కొత్త రూల్స్‌ తెలుసా!

IPL 2023 New Rules | టైమ్‌ 2 న్యూస్‌, న్యూఢిల్లీ: సహచరులే ప్రత్యర్థులుగా మారే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. బౌండ్రీల హోరు.. వికెట్ల జోరు.. బ్యాటర్ల వినూత్న షాట్లు.. ఫీల్డర్ల అద్భుత విన్యాసాలు ఇలా రెండు నెలల పాటు అభిమానులను క్రికెట్‌ ప్రపంచంలో విహరింప చేయనున్న ఐపీఎల్‌-16వ సీజన్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. లీగ్‌ ఆరంభంతోనే విశ్వవ్యాప్తంగా పెను విప్లవాన్ని సృష్టించిన ఐపీఎల్లో.. సరికొత్త నిబంధనలు తెరపైకి రానున్నాయి. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్‌ ఈసారి కొత్త నిబంధనలతో సరికొత్తగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. టాస్‌ తర్వాత తుది జట్టు ఎంపిక.. వైడ్‌, నోబాల్స్‌కు సమీక్ష విధానం.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఇలా ఎన్నో కొంగొత్త నియమాలను పరిచయం చేయనుంది.

ఈ ఐపీఎల్‌ నుంచి కొత్తగా అమల్లోకి రానున్న నిబంధనలు

  • ఈ ఐపీఎల్‌ నుంచి వైడ్‌, నోబాల్స్‌కు కూడా రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఎల్బీడబ్లూ్య, క్యాచ్‌ఔట్‌, రనౌట్‌లకు మాత్రమే ఈ అవకాశం ఉండగా.. ఒక్క బంతితో ఫలితాలు మారిపోయే అవకాశమున్న లీగ్‌ కోసం ఈ నిబంధనను కొత్తగా తీసుకొచ్చారు.
  • గతంలో టాస్‌కు ముందు జట్టు సారథులు ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటిస్తూ వస్తుండగా.. ఈ సారి నుంచి టాస్‌ ముగిసిన తర్వాత తుది పదకొండు మందిని ఎంపిక చేసుకోవచ్చు. అంటే టాస్‌ వేయడానికి వచ్చే సమయంలోనే జట్ల సారథులు రెండు లిస్ట్‌లతో సిద్ధం కావాల్సి ఉంటుంది. తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ఒక జట్టును, ఫీల్డింగ్‌ చేయాల్సి వస్తే మరో జట్టును ఎంపిక చేసుకునే వెసులుబాటు లభించింది.
  • ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ను ఈ సీజన్‌ నుంచి ప్రవేశ పెడుతున్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు.. ఫీల్డింగ్‌ సమయంలో అదనపు బౌలర్‌ కావాలనుకుంటే.. ఒక బ్యాటర్‌ను తప్పించి అతడి స్థానంలో స్పెషలిస్ట్‌ బౌలర్‌ను బరిలోకి దింపొచ్చు. ఈ అంశాన్ని ముందుగా ఫీల్డ్‌ అంపైర్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సూచికగా.. అంపైర్‌ రెండు చేతులను తలపైన క్రాస్‌గా పెట్టి మైదానంలోని ఆటగాళ్లకు సూచించనున్నాడు.
  • ఐపీఎల్‌ -16వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అందులో 70 లీగ్‌ మ్యాచ్‌లు కాగా, మిగిలిన నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు.
  • మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్న ఈ సీజన్‌లో 12 మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
  • అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, హైదరాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, లక్నో, మొహాలీ, ముంబైలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
  • లీగ్‌లో పాల్గొంటున్న ఎనిమిది జట్లకు ఒక్కో సొంత మైదానం ఉండగా.. రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌కు రెండు హోం గ్రౌండ్స్‌ ఉన్నాయి.
  • రాజస్థాన్‌ రాయల్స్‌ తన హోమ్‌ మ్యాచ్‌లను జైపూర్‌తో పాటు గువాహటిలోనూ ఆడనుండగా.. పంజాబ్‌ మొహాలీతో పాటు ధర్మశాలలో కొన్ని మ్యాచ్‌లు ఆడనుంది.
Exit mobile version