Home Latest News Vivek Ramaswamy | అమెరికా అధ్యక్షుడినైతే ఎఫ్‌బీఐని తీసేస్తా.. విద్యా శాఖ రద్దు చేస్తా.. వివేక్‌...

Vivek Ramaswamy | అమెరికా అధ్యక్షుడినైతే ఎఫ్‌బీఐని తీసేస్తా.. విద్యా శాఖ రద్దు చేస్తా.. వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు

Vivek Ramaswamy | తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మొదట విద్యా శాఖను రద్దు చేస్తానని భారత సంతతి నేత వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎఫ్‌బీఐ దర్యాప్తు సంస్థ ఎందుకు ఉందో అర్థం కావడం లేదని.. దాన్ని రద్దు చేసి కొత్త దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేస్తానని ప్రకటించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో దిగేందుకు వివేక్‌ రామస్వామి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన పోటీ గురించి ప్రకటించిన వివేక్‌ రామస్వామి.. శనివారం కన్జర్వేటివ్‌ రాజకీయ కార్యచరణ సదస్సులో ప్రసంగించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రదిపాదించిన అమెరికా ఫస్ట్‌ అనే నినాదం నుంచి తాను స్ఫూర్తి పొందానని వివేక్‌ రామస్వామి తెలిపారు. చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారాలు చేయకుండా నిషేధిస్తానని స్పష్టం చేశారు. అమెరికా విధానాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. జాతి, లింగ, పర్యావరణం అనేవి లౌకిక మతాలుగా అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. జాతి వివక్షతోనే వ్యక్తుల నేపథ్యాన్ని గుర్తిస్తున్నారని మండిప్డడారు. కాగా ఇదే రిపబ్లికన్‌ పార్టీ తరఫు నుంచి మరో భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ కూడా అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. అలాగే డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా నేనూ బరిలోనే ఉన్నా అని చెప్పుకుంటున్నాడు. తనపై ఎన్ని నేరాల అభియోగాలు మోపిన అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Exit mobile version