Cool Roof Policy | కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకో అలర్ట్. మీరు ఇల్లు ఎలా కట్టుకున్నా సరే రూఫింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లే వినాలి. కొత్తగా కట్టుకునే ఇంటికి కూల్ రూఫ్ తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ మేరకు కూల్ రూఫ్ పాలసీ 2023-28ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ పాలసీని ఆవిష్కరించారు. భవన యజమానులు ఎండ వేడిమిని తగ్గించుకునేందుకు సహజ విధానాలు పాటించేలా ఈ విధానాన్ని రూపొందించామని పేర్కొన్నారు. 2023 నాటికి రాష్ట్రంలోని 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్ టాఫ్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే కట్టిన భవనాలకు కూడా కూల్ రూఫ్ విధానం అమలు చేయవచ్చని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పాలసీలో భాగంగా కూల్ రూఫ్ ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం కూడా అందిస్తామని తెలిపారు.

ఏంటి కూల్ రూఫ్ పాలసీ?
కూల్ రూఫ్ పాలసీ ప్రకారం కొత్తగా నిర్మించే ప్రభుత్వ, వాణిజ్య భవనాలకు కూల్ రూఫింగ్ తప్పనిసరి. నిరుపేదల కోసం నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్లకు కూడా ఈ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయనున్నారు. ప్రైవేటు గృహాలకు మాత్రం ఇది తప్పనిసరి కాదు. కానీ కూల్ రూఫ్ ప్రయోజనాలను వివరించి వారు కూడా ఈ విధానాన్ని ఫాలో అయ్యేలా ప్రోత్సహిస్తారు. ఇక 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటిని కట్టుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కూల్ రూఫ్ విధానం పాటించాల్సిందే. దీనికోసం చదరపు మీటర్‌కు రూ.300 వరకు అదనంగా ఖర్చవుతుంది. అయితే దానికి తగ్గట్టుగా విద్యుత్ వినియోగం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పైగా ఈ విధానాన్ని అమలు చేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహకాలు కూడా అందించనుంది. ఐదేళ్ల లక్ష్యంతో ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది.
కూల్‌రూఫ్ విధానం అంటే ఏంటి?
ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి వస్తోంది. సమ్మర్‌లో ఉక్కబోత నుంచి తప్పించుకునేందుకు ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. దీనివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువైపోయింది. పైగా ఏసీల కారణంగా కాలుష్య ఉద్గారాలు కూడా వాతావరణంలోకి ఎక్కువగా విడుదలవుతున్నాయి. అదే ఈ కూల్ రూఫ్ విధానంలో పైకప్పు నిర్మిస్తే గది ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుతాయి. ఈ కూల్ రూఫ్ విధానంలో భాగంగా పైకప్పు నిర్మాణానికి ఉపయోగించే సామగ్రిలో పలు మార్పులు చేస్తారు. అలాగే ప్రత్యేక రసాయనాలు వినియోగిస్తారు. దీనివల్ల పైకప్పు పడిన సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకే పరావర్తనం చెందుతాయి. దీంతో ఇంటిలోపలికి వేడి రావడం తగ్గుతుంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయి. ఇంట్లో చల్లగా ఉండటంతో ఏసీలు, కూలర్ల వినియోగం తగ్గుతుంది. కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది.
కొత్త భవనాలకేనా? పాత ఇళ్లకూ కూల్ రూఫ్ సాధ్యమేనా?
ఇప్పటికే నిర్మించిన భవనాలపై కూడా కూల్ రూఫ్ ఏర్పాటుకు పలు పద్ధతులు ఉన్నాయి. ఇంటి శ్లాబ్‌పై కూల్ పెయింట్ వేయడం, వినైల్ షీట్లను పరచడం, టైల్స్ వేసుకోవడం, భవనాలపై మొక్కల పెంపకం, సౌర విద్యుత్తు ఫలకాల ఏర్పాటు వంటి వాటి వల్ల కూడా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
SSC Exams | పదో తరగతి పేపర్ లీక్.. రేపటి పరీక్షపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Samantha | అసలు నాకు మంచి రోజులొస్తాయా? అని రోజూ బాధపడేదాన్ని.. ఎమోషనల్ అయిన సమంత