Home Latest News Sukesh Chandrasekhar | ఆప్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌ ఆఫీసులోనే రూ.75 కోట్లు...

Sukesh Chandrasekhar | ఆప్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌ ఆఫీసులోనే రూ.75 కోట్లు ఇచ్చానన్న సుఖేష్‌ చంద్రశేఖర్‌

Sukesh Chandrasekhar | ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీపై సుఖేష్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసులో పార్కు చేసి ఉన్న రేంజ్‌ రోవర్‌ కారులో ఉన్న ఏపీ అనే వ్యక్తికి రూ. 75 కోట్లు అందించినట్లు పేర్కొన్నాడు. రూ. 200 కోట్ల చీటింగ్‌ కేసులో ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న సుఖేష్‌ ఈ మేరకు లేఖ విడుదల చేశాడు. తాజా ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.

మొత్తం ఐదు విడతల్లో రూ. 15 కోట్ల చొప్పున మొత్తం రూ. 75 కోట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసులో ఏపీ అనే వ్యక్తికి 2020లో ఇచ్చినట్లు పేర్కాన్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా 15 కిలోల నెయ్యి అనే కోడ్‌ పెట్టుకున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పైనా సంచలన ఆరోపణలు చేశాడు. కేజ్రీవాల్‌తో వాళ్లు జరిపిన 700 పేజీల వాట్సాప్‌ చాట్‌ను తన దగ్గర ఉందన్న తెలిపాడు. త్వరలోనే ఆ వాట్సాప్‌ చాట్‌ను విడుదల చేస్తానని బాంబు పేల్చాడు. అయితే ఏపీ అనే వ్యక్తి అంటే ఎవరనేది తేలాల్సి ఉంది. ఏపీ అంటే అరుణ్‌ పిళ్లై అయి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సుఖేష్‌ చంద్రశేఖర్‌ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి క్రిశాంక్‌ స్పందించారు. ఎవరో కోన్‌ కిస్కా గాళ్లు లేఖ రాస్తే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్థుల కుమ్మక్కై ప్రతిపక్షాలపై బీజేపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. అసలు జైల్లో ఉన్న చంద్రశేఖర్‌కు పెన్ను పేపర్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. దీని వెనుక ఎవరున్నారో విచారణ చేపట్టాలని అన్నారు. రాజ్యసభ సీటు కోసం రూ. కోట్ల రూపాయలు కేజ్రీవాల్‌ తీసుకున్నాడని సుఖేష్‌ చంద్రశేఖర్‌ గతంలో ఆరోపణలు చేశాడని క్రిశాంక్‌ అన్నారు. దీనిపై ఇప్పటివరకు విచారణ ఎందుకు చేపట్టలేదని అన్నారు. ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ బురద జల్లే ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని విమర్శించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Exit mobile version