Home Latest News Fact Check | నిరుద్యోగులకు ప్రధాని నెలకు 6 వేల భృతి ఇస్తున్నాడా? ఈ వార్తల్లో...

Fact Check | నిరుద్యోగులకు ప్రధాని నెలకు 6 వేల భృతి ఇస్తున్నాడా? ఈ వార్తల్లో నిజమెంత ఉంది?

Image Source: PMO India facebook

Fact Check | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జాబ్ లేని యువకులకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.6వేల భృతిని అందజేస్తుంది. ప్రధానమంత్రి బేరోజ్‌గారి భత్తా యోజన కింద ఈ నిరుద్యోగ భృతిని అందజేస్తుంది. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న సందేశం ఇదీ. కొద్దిరోజులుగా ఈ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నిరుద్యోగ భృతిని పొందేందుకు అర్హులైన అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఇందుకోసం ఆ మెసేజ్‌లో ఓ వెబ్‌సైట్ లింక్ కూడా ఉంచారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ కావడంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం అలాంటి పథకం ఏది తీసుకురాలేదని స్పష్టం చేసింది. ఇదంతా సైబర్ నేరగాళ్ల పనే అని హెచ్చరించింది. పొరపాటున కూడా ఈ మెసేజ్ నిజం అనుకుని లింక్‌పై క్లిక్ చేయవద్దని సూచించింది. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారంతో పాటు అకౌంట్లలోని డబ్బులను సైబర్ నేరగాళ్లు కొట్టేసే అవకాశం ఉందని హెచ్చరింది. దీంతో పాటు ఈ మెసేజ్‌ను ఇతరులకు ఫార్వర్డ్ చేసి తప్పుదోవ పట్టించవద్దని సూచించింది.

ఇటీవల కాలంలో ఇలాంటి ఫేక్ మెసేజ్‌లు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాలు ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాయని చాలా మెసేజ్‌లు వాట్సాప్, ఫేస్‌బుక్ సహా ఇతరత్రా సోషల్ మీడియా అకౌంట్లలో చక్కర్లు కొట్టాయి. అంతేకాదు విదేశాల నుంచి రప్పించిన నల్ల ధనాన్ని దేశంలోని ప్రజలందరికీ మోదీ పంచుతున్నారని కూడా ఇలాగే ప్రచారం చేశారు. ఇలా ప్రజల అత్యాశలను సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే ఇలాంటి మెసేజ్‌లు వచ్చినప్పుడు తొందరపడి క్లిక్ చేయవద్దని.. వాటి గురించి నిజానిజాలు తెలుసుకోవాలని పీఐబీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు సూచించాయి.

Exit mobile version