Home Latest News CSK vs GT | చెన్నై చెపాక్‌లో దుమ్మరేపిన ధోనీ సేన..ఐపీఎల్‌-16వ సీజన్‌ ఫైనల్‌ చేరిన...

CSK vs GT | చెన్నై చెపాక్‌లో దుమ్మరేపిన ధోనీ సేన..ఐపీఎల్‌-16వ సీజన్‌ ఫైనల్‌ చేరిన సూపర్‌ కింగ్స్‌

CSK vs GT | టైమ్‌ 2 న్యూస్‌, చెన్నై: సొంతగడ్డపై అశేష అభిమాన సందోహం ఉత్సాహపరుస్తున్న వేళ అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో దుమ్మురేపిన చెన్నై.. క్వాలిఫయర్‌-1లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను మట్టికరిపించి సగర్వంగా పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం జరుగనున్న మెగా ఫైట్‌లో ట్రోఫీ కోసం ధోనీ సేన బరిలోకి దిగనుండగా.. హార్దిక్‌ బృందానికి క్వాలిఫయర్‌-2 రూపంలో ఫైనల్‌ చేరేందుకు మరో చాన్స్‌ ఉంది. సొంతగడ్డపై చెన్నై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై మొదట మంచి స్కోరు చేసిన ధోనీ సేన.. ఆనక గుజరాత్‌ను కట్టడి చేసి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 16వ సీజన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. చెన్నై ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడనుండటం ఇది పదోసారి కావడం విశేషం. పసుపు రంగు పులుముకున్న చెపాక్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 15 పరుగుల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను చిత్తుచేసింది. ఐపీఎల్లో గుజరాత్‌పై చెన్నైకి ఇదే తొలి విజయం కావడం గమనార్హం.

ఓపెనర్లు అదుర్స్‌..

లీగ్‌ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టిక టాప్‌లో నిలిచిన గుజరాత్‌కు క్వాలిఫయర్‌-2 రూపంలో ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతరాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 87 పరుగులు జతచేయగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన శివమ్‌ దూబే (1), అజింక్యా రహానే (17), అంబటి రాయుడు (17), రవీంద్ర జడేజా (22) ఆకట్టుకోలేకపోయారు. సొంతగడ్డపై ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ (1) ఎక్కువసేపు నిలువ లేకపోయాడు. గుజరాత్‌ బౌలర్లలో మహమ్మద్‌ షమీ, మోహిత్‌ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

భాగస్వామ్యాలు లేక..

అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. వరుస సెంచరీలతో జోరు మీదున్న యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) కాస్త పోరాడగా.. తక్కినవాళ్లు విఫలమయ్యారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (8), సాహా (12), దసున్‌ షనక (17), మిల్లర్‌ (4), విజయ్‌ శంకర్‌ (14), రాహుల్‌ తెవాటియా (3) పెవిలియన్‌కు వరుస కట్టారు. రషీద్‌ ఖాన్‌ (16 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌, జడేజా, తీక్షణ, పతిరణ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Exit mobile version