Water Falls in AP |జలపాతాలు అనగానే.. కేరళ, కర్నాటక, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలే గుర్తొస్తాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లోనూ అందమైన జలపాతాలు ఉన్నాయి. వాటి గురించి పురాణాల్లో కూడా ప్రస్తావించారు. ఇవి ఎత్తైన కొండ ప్రాంతాల నుంచి జాలువారుతూ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఇంతకీ అవేంటి.. ఎక్కడ ఉన్నాయి?
1. Talakona Waterfall : తలకోన జలపాతాలు:

ఏపీలోని అందమైన జలపాతాల్లో ఇది ఒకటి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీవెంకటేశ్వర జాతీయ ఉద్యానవనానికి సమీపంలో ఉంది. సాక్షాత్తు ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడని పురాణాల్లోనూ ఉంది. కుబేరుని అప్పు తీర్చే క్రమంలో శ్రీనివాసుడు అలసిపోయి నిద్రపోయాడని పురాణాల్లో పేర్కొన్నారు. తల భాగాన్ని ఆ కొండ చివరలో ఆనించి పడుకున్నాడని .. అందుకే దీనికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు సందర్శనకు అనువైన సమయం.
2. Kaigal Falls : కైగల్ జలపాతం:

ఏపీలోని చిత్తూరు జిల్లాలో కైగల్ జలపాతం ఉంది. కైగల్ గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 633 మీటర్ల ఎత్తులో ఇది నెలవై ఉంది. దీనికి దుముకు జలపాతం అన్న పేరు కూడా ఉంది. ఇక్కడ నీళ్లు రాళ్లపై నుంచి కింద పడటం వల్ల దుముకు అని పేరు వచ్చింది. జూన్ నుంచి అక్టోబరులో సందర్శించడానికి అనుకూల సమయం.
3. Ubbalamadugu Waterfalls : ఉబ్బల మడుగు జలపాతం:


ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్దుల కోన అనే అడవి ఉంది. ఇక్కడే ఉబ్బల మడుగు జలపాతం ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది. అక్టోబరు నుంచి ఫ్రిబ్రవరి వరకు సందర్శనకు అనుకూల సమయం. పర్వతారోహణకు, విహారయాత్రలకు ఇది చాలా అనువైన ప్రాంతం.
4. Katiki Waterfalls : కటికి జలపాతం:

వైజాగ్ సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. బొర్రా గుహల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కటికి జలపాతం ఉంటుంది. సుమారు 50 అడుగుల ఎత్తునుంచి నీళ్లు కిందపడి.. కనువిందు చేస్తుంటాయి. గోస్తనీ నది నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు సందర్శనకు అనుకూల సమయం.
5. Kailasa Kona Water Falls : కైలాస కోన జలపాతం:

ఏపీలోని ప్రముఖ జలపాతాల్లో ఇదీ ఒకటి. చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోన గుహ ఉంటుంది. దీని పక్కనే కైలాసకోన ఉంటుంది. వంద అడుగుల ఎత్తునుంచి నీరు కింద పడుతూ మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటుంది. పద్మావతి, వెంకటేశ్వరుల వివాహన్ని వీక్షించేందుక పార్వతీ, పరమేశ్వరులు వచ్చినప్పడు ఈ ప్రాంతాన్ని చూసి.. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్దులై కొంతకాలం పాటు ఇక్కడే ధ్యానం చేసినట్లు పురాణాల్లో ఉంది. అందుకే దీనికి కైలాస కోనగా పేరు వచ్చింది. ఏడాది పొడవునా ఈ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మొత్తంగా మూడు జలపాతాలు ఉన్నాయి. తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
6. Nagalapuram Water Falls : నాగలాపురం జలపాతం:

తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో నాగలాపురం జలపాతం ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయలు చోర, పాండ్య రాజులను ఓడించి హంపికి వెళుతుండగా ఈ ప్రాంతంలో విడిది చేశాడు. ఆ సమయంలో తన తల్లి గుర్తు వచ్చి.. అరుణా నదీ పరివాహక ప్రాంతంలో ఒక ఊరిని నెలకొల్పాడు. దానికి నాగలాంబపురం అనే పేరు పెట్టాడు. కాలక్రమంలో అదే ఇప్పుడు నాగలాపురంగా మారింది. ఇక్కడున్న జలపాతం పేరే నాగలాపురం జలపాతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వేదనారాయణ స్వామి ఆలయం చాలా ఫేమస్. దీన్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం ఏపీ నుంచే కాకుండా చెన్నై నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఏడాది పొడవునా సందర్శనకు అనుకూల సమయం.
7. Amruthadhara Water Fall : అమృతధార జలపాతం:

రాజమండ్రి సమీపంలో దట్టమైన అడవుల మధ్య ఈ జలపాతం ఉంది. మారేడుమిల్లి వద్ద దట్టమైన అడవుల్లో 64 మీటర్ల ఎత్తైన కొండ పైనుంచి జాలువారుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇది రెండు దశల్లో ప్రవహిస్తుంది. ఆగస్టు, సెప్టెంబర్ సందర్శనకు అనుకూల సమయం.
8. Rampa Water Falls : రాంప జలపాతం


తూర్పుగోదావరి జిల్లాలో ఫేమస్ జలపాతం ఇది. రాజమండ్రి నుంచి మారేడుపల్లి వెళ్లే దారిలో రంపచోడవరం సమీపంలో ఈ జలపాతం ఉంటుంది. రంప కొండ దిగువన శివాలయం సమీపంలో జలపాతం ఉంటుంది. 50 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందపడుతూ కనువిందు చేస్తుంటుంది. సెప్టెంబరు నుంచి జనవరి వరకు సందర్శనకు అనుకూల సమయం.
Read More Articles |
ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?