Kl Rahul – Athiya Shetty | టైమ్ 2 న్యూస్, ముంబై: భారత స్టార్ క్రికెటర్ లోకేశ్ రాహుల్ ఒక ఇంటివాడయ్యాడు. బాలీవుడ్ నటి అతియా శెట్టితో కలిసి రాహుల్ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టాడు. వీరి వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. పరిమిత అతిథల మధ్య వివాహ వేడుక ఘనంగా జరిగిందని అతియా శెట్టి తండ్రి, సీనియర్ నటుడు సునీల్ శెట్టి మీడియాకు తెలిపాడు.
ముంబైకి 82 కిలోమీటర్ల దూరంలోని ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్ హౌస్ ఈ వేడుకకు వేదికైంది. పెళ్లి ప్రమాణాలకు సంబంధించిన ఫొటోలను ఈ జంట సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘నీ వెలుగులో ప్రేమించడం నేర్చుకున్నా.. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. మా ఈ బంధానికి మీ ఆశీస్సులు కావాలి’ అని ఈ జంట రాసుకొచ్చింది.
పెళ్లి వేడుకల్లో అతియా గులాబీ రంగు లహెంగాలో మెరిసిపోగా.. రాహుల్ సంప్రదాయ షేర్వానీలో దర్శనమిచ్చాడు.
2015లో విడుదలైన ‘హీరో’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన అతియా.. ఆ తర్వాత ‘ముబారకన్’, ‘మోతీచూర్ చక్నాచూర్’ వంటి పలు బాలీవుడ్ చిత్రల్లో నటించి తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకుంది. ఇక కేఎల్ రాహుల్ భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి సన్నిహితులను మాత్రమే ఆహ్వానించడంతో.. రిసెప్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తున్నారు. ఐపీఎల్ సీజన్ తర్వాత టీమిండియా సభ్యులతో పాటు ఇతర ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.