Friday, March 29, 2024
- Advertisment -
HomeSportsNikhat Zareen | బాక్సింగ్‌ అకాడమీ ఏర్పాటుకు నిఖత్‌ జరీన్‌ ప్లాన్‌?

Nikhat Zareen | బాక్సింగ్‌ అకాడమీ ఏర్పాటుకు నిఖత్‌ జరీన్‌ ప్లాన్‌?

Nikhat Zareen | టైమ్‌ 2 న్యూస్‌, హైదరాబాద్‌: వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌.. వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని అంటోంది. దాని కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. న్యూఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి సొంత ఇలాఖాలో అడుగుపెట్టిన యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న తెలంగాణ బిడ్డకు అభిమానులు జేజేలు పలికారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు సార్థకత చేకూరుస్తూ స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో ప్రత్యర్థులను నిఖత్‌ మట్టికరిపించి తన పంచ్‌ పవర్‌కు తిరుగలేదని చాటిచెప్పింది. సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా భేటీలో నిఖత్‌ జరీన్‌ తన మెగాటోర్నీ అనుభవాలతో పాటు భవిష్యత్‌ లక్ష్యాలను వివరించింది.

మేరీకోమ్‌ తర్వాత రెండో బాక్సర్‌గా..

మేరీ కోమ్‌ తర్వాత భారత్‌ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన ఏకైక మహిళా బాక్సర్‌గా రికార్డుల్లోకెక్కిన నిఖత్‌ భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగిస్తానని పేర్కొంది. డిఫెండింగ్‌ చాంపియన్‌హోదాను నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందన్న నిఖత్‌ దానికోసం చాలా కష్టపడ్డట్లు చెప్పుకొచ్చింది. ‘‘ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. గత టోర్నీతో పోలిస్తే ఈసారి నేను 52 కేజీలకు బదులు 48-50 విభాగానికి మారాను. దీంతో అన్‌సీడెడ్‌గా పోటీపడాల్సి వచ్చింది. టోర్నీలో మొత్తం ఆరు బౌట్లలో బరిలోకి దిగాను. బై లభించకపోవడంతో వరుసగా విరామం లేకుండా పోటీకి దిగాల్సి వచ్చింది. అయినా వెరవకుండా.. బౌట్‌ బౌట్‌కు మరింత దూకుడు కనబరిచాను. సెమీస్‌ బౌట్‌ చాలా టఫ్‌గా సాగింది. నాకన్నా మెరుగైన ర్యాకింగ్స్‌ ఉన్న బాక్సర్లపై విజయాలు సాధించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’ అని నిఖత్‌ వివరించింది.

భవిష్యత్తులో బాక్సింగ్‌ అకాడమీ!

చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని ముందుకు సాగుతున్న నిఖత్‌ వెల్లడించింది. ‘‘గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఆ తర్వాత కామన్వెల్త్‌గేమ్స్‌, జాతీయ చాంపియన్‌షిప్‌ ఇలా టోర్నీ ఏదైనా పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. అలాగే సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఆసియాగేమ్స్‌లో స్వర్ణం గెలువడం ద్వారా పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించవచ్చు. విశ్వక్రీడలకు ఆసియాగేమ్స్‌ అర్హత టోర్నీ. త్వరలోనే ప్రాక్టీస్‌ మొదలుపెడుతా. ప్రస్తుతం నాదృష్టంతా ఆసియా గేమ్స్‌పైనే ఉంది. అందులో నెగ్గడం ద్వారా పారిస్‌ టికెట్‌ కన్ఫామ్‌ చేసుకోవాలని భావిస్తున్నా’ అని నిఖత్‌ చెప్పింది. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి మరింత మంది అంతర్జాతీయ బాక్సర్లు వస్తారని నిఖత్‌ పేర్కొంది. ప్రతిభవంతులకు శిక్షణ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ సహకారం ఉంటే అది సాధ్యపడుతుందని చెప్పింది. ప్రస్తుతం మన దగ్గర బాక్సింగ్‌కు మెరుగైన వసతులు లేవని.. అంతర్జాతీయ ప్రమాణాలతో అకాడమీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించింది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News