Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsInternationalJoe Biden | రష్యా దాడులతో వణికిపోతున్న కీవ్‌కు అమెరికా అధ్యక్షుడు అంత సీక్రెట్‌గా ఎలా...

Joe Biden | రష్యా దాడులతో వణికిపోతున్న కీవ్‌కు అమెరికా అధ్యక్షుడు అంత సీక్రెట్‌గా ఎలా వెళ్లాడు.. ఉక్రెయిన్ పర్యటన ఎలా సాగింది?

Joe Biden | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు మరో దేశానికి వెళ్తున్నారంటే.. అధికారుల హడావిడి అంత ఇంత ఉండదు. పర్యటనకు కొద్ది నెలల ముందు నుంచే పక్క దేశంలో పాగ వేస్తారు. తమ అధ్యక్షునికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో భారీ సెక్యూరిటీ నడుమ అమెరికా అధ్యక్షుడు వచ్చి పర్యటిస్తారు. ఈ క్రమంలో అతను పర్యటించే కారును కూడా అమెరికా నుంచే తెచ్చుకుంటారు. ప్రతిసారి ఇంత పకడ్బందీగా అమెరికా అధ్యక్షుడి పర్యటన ఉంటుంది. కానీ ఈసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన పర్యటన మాత్రం అత్యంత రహస్యంగా సాగింది. కేవలం కొంతమంది రక్షణా సిబ్బంది మధ్యే బాహ్య ప్రపంచానికి ఎలాంటి సమాచారం లేకుండా జో బైడెన్ రహస్య పర్యటన సాగింది.

రష్యా దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రత్యక్షం కావడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వాషింగ్టన్‌లో బయలుదేరినప్పటి నుంచి కీవ్‌లో అడుగుపెట్టే వరకూ బైడెన్ పర్యటన మొత్తం అత్యంత రహస్యంగా కొనసాగింది. ఇరు దేశాలకు చెందిన కొందరు ముఖ్యమైన అధికారులు తప్ప ఇతరులకు ఈ టూర్ వివరాలు తెలియనివ్వలేదు. బైడెన్ పర్యటనలో ఇద్దరు అంతర్జాతీయ జర్నలిస్టులు ఉన్నప్పటికీ వారు కూడా కీవ్‌ లో దిగేంత వరకూ బైడెన్ ను చూడలేదన్నారు అంటే ఈ టూర్‌ ఎంత గోప్యంగా ఉంచారో తెలుసుకోవచ్చు.

రక్షణ శాఖ విమానంలోనే పోలాండ్‌కు

ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో వాషింగ్టన్‌లోని మిలిటరీ ఎయిర్‌‌పోర్ట్ హ్యాంగర్ నుంచి బైడెన్ టూర్ మొదలైంది. అధ్యక్షుడి పర్యటనకు వాడే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానానికి బదులు అమెరికా వాయుసేన విమానంలో బైడెన్ కీవ్ బయల్దేరి వెళ్లారు. బోయింగ్ 757 విమానం సీ 32లో బైడెన్, ఆయన అధికార బృందం, సెక్యూరిటీ సిబ్బంది, వైద్య బృందం, ఒక జర్నలిస్టు, ఒక ఫొటోగ్రాఫర్‌తో ఈ విమానం బయలుదేరింది. సుమారు ఏడు గంటలు ప్రయాణించి జర్మనీలోని అమెరికన్ మిలిటరీ బేస్ స్టేషన్‌లో ఈ విమానం ల్యాండ్ అయ్యింది. అక్కడి సిబ్బందికి కూడా విమానంలో ఎవరు ఉన్నదీ తెలియలేదు. విమానం కిటికీ తెరలన్నీ దించేసి ఉన్నాయి. తర్వాత విమానం పోలాండ్‌లోని జోసోస్ నగరానికి చెందిన ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడి నుంచి వాహనాల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు దగ్గర్లోని రైల్వే స్టేషన్ కు బైడెన్ చేరుకున్నారు. ఈ ప్రయాణంలోనూ ఎలాంటి హడావుడి లేదు. ముందు సెక్యూరిటీ వాహనాలు కానీ, సైరెన్ శబ్దం కానీ లేకుండా జర్నీ సాగింది.

10 గంటల పాటు రైలులో ప్రయాణం

పోలాండ్ సరిహద్దుల నుంచి బైడెన్ రైలులో కీవ్‌కు బయలుదేరారు. దాదాపు 10 గంటల జర్నీ తర్వాత సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బైడెన్ కీవ్ లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో కీవ్ నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు సైరెన్ కూడా మోగించడంతో బైడెన్ పర్యటించునున్నారని ప్రచారం మొదలైంది. కానీ ఎవరికీ దానిపై స్పష్టత లేదు. అయితే బైడెన్ కీవ్‌లో ఉన్నంతసేపు అమెరికా ఈ 3 సెంట్రీ ఎయిర్‌బార్న్ రాడార్ విమానం, ఎలక్ట్రానిక్ ఆర్సీ135 రివిట్ జాయింట్ ఎయిర్‌క్రాఫ్ట్ నిఘా విమానాలతో గగనతలంలో నిఘా ఉంచాయి. బైడెన్ పర్యటన ముగించుకుని తిరిగి రాత్రి 8 గంటలకు పోలాండ్ చేరుకున్నారు. అప్పటిదాకా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే బైడెన్ ఉక్రెయిన్‌లో ఉన్నంతసేపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో రష్యాకు ఈ విషయాన్ని ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.

వైట్‌హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు

సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్లినా సరే వెంట 13 మంది జర్నలిస్టులు తప్పనిసరిగా ఉంటారు. దేశంలో, విదేశాల్లో పర్యటించినా సరే ఈ బృందం ప్రెసిడెంట్ వెన్నంటి ఉంటుంది. బైడెన్ మాట్లాడే ప్రతీ మాటను వారు రికార్డు చేసి ప్రచురిస్తారు. కానీ ఈసారి మాత్రం ఉక్రెయిన్ టూర్ గురించి ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. ఆ రోజు సాయంత్రం వైట్ హౌస్ విడుదల చేసిన షెడ్యూల్‌లోనూ రాత్రి 7 గంటలకు పోలాండ్ బయల్దేరతారని ఉంది. కానీ స్పష్టంగా చెప్పలేదు. పైగా అప్పటికే రహస్యంగా బైడెన్ పర్యటన మొదలైపోయింది కూడా. అత్యంత రహస్యంగా ఈ జర్నీని కొనసాగించారు. దీనికోసం కేవలం ఒక జర్నలిస్ట్, ఒక ఫొటోగ్రాఫర్‌కు మాత్రమే సమాచారం అందించారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన సబ్రీనా సిద్దికీతో పాటు అసోసియేటెడ్ ప్రెస్ కు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ ను వెంట తీసుకెళ్లారు. అయితే, పర్యటన వివరాలను గోప్యంగా ఉంచుతామని వారి నుంచి హామీ తీసుకున్నారు. అదేవిధంగా విమానంలోకి ఎక్కే ముందే వారిద్దరి ఫోన్లనూ సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కీవ్ కు చేరుకున్నాకే ఫోన్లను తిరిగిచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే.. బైడెన్ తో పాటు అదే విమానంలో, వాహనాల్లో ప్రయాణించినా సరే కీవ్ చేరుకునేంత వరకూ తాము ప్రెసిడెంట్ ను చూడనేలేదని జర్నలిస్ట్ సబ్రీనా చెప్పారు. వైట్ హౌస్ అనుమతి వచ్చాక బైడెన్ టూర్ కు సంబంధించిన విశేషాలను ఆమె బయటపెట్టారు.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News