Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleDevotionalTemple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Temple | గుడికి వెళ్లినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసినప్పుడు కొబ్బరి కాయ కొడుతుంటాం. అయితే మనం గుడికి వెళ్లినప్పుడు కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి? అసలు ఈ కొబ్బరికాయ ఎలా పుట్టిందనే విషయాలను ఆలోచించారా? నిజానికి దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. కొబ్బరికాయను సమర్పించడం ద్వారా భగవంతుడు మనకు ఏం చెప్పదలచుకున్నాడు అనే దానిపై గణేశ పురాణంలో ఇలా ఉంది.

ఒకానొక సమయంలో పరమేశ్వరుడు త్రిపురాసురులు అనే రాక్షసులను సంహరించేందుకు వెయ్యి సంవత్సరాల పాటు కఠోర తపస్సు ఆచరించాడు. ఆ తపోబలంతో త్రిపురాసురాలను చంపే ఒక అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నాడు. దాని పేరు అఘోరాస్త్రం. ఈ అస్త్రాన్ని త్రిపురాసురాల మీదకు పంపితే వారు మరణిస్తారు. ఇదే ఉత్సాహంతో యుద్ధానికి వెళ్లిన పరమేశ్వరుడు.. అఘోరాస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ ఆ అస్త్రం త్రిపురాసురాలపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీంతో పరమశివుడు ఆశ్చర్యపోతాడు. ఇంతటి తపోబలంతో తయారుచేసిన అఘోరాస్త్రం ఎందుకు ప్రభావం చూపించట్లేదని మదనపడతాడు. కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తూ శ్రీమహావిష్ణువును తలచుకుంటాడు.

అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై.. గణపతికి పూజ చేయడం మరిచిపోవడం వల్లనే ఇలా జరిగిందని చెబుతాడు. ఏ కార్యమైన నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే గణపతి పూజ చేయాలని గుర్తుచేస్తాడు. దీంతో తరువాత రోజు యుద్ధరంగంలోనే గణపతి పూజ చేసేందుకు శివుడు సర్వం సిద్ధం చేసుకుంటాడు. ఆ హడావుడిలో గణపతికి నైవేద్యం చేయడం మరిచిపోతాడు.దీంతో గణేశుడు అలక పూనుతాడు. పూజ అయిపోయిన తర్వాత మహాశివుడు ఈ విషయాన్ని గుర్తిస్తాడు. వెంటనే రకరకాల ఫలాలు, ఆహార పదార్థాలను గణపతి ముందు ఉంచుతాడు. కానీ అవేవీ గణేశుడు స్వీకరించడు. వెంటనే పార్వతీ దేవి యుద్ధరంగానికి వచ్చి శాకాంబరి దేవిగా మారి.. గణేశుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు సమర్పిస్తుంది. వాటిని కూడా గణపతి స్వీకరించడు. అప్పుడు పార్వతి దేవి ఏం కావాలని అడుగుతుంది. దానికి తన తలపండును సమర్పించమని శివుడిని అడుగుతాడు.

గణపతి కోరిక విని అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. కానీ తాను అలా ఎందుకు అడిగాడో గణపతి వివరిస్తాడు. శిరస్సు అనేది మానవుల అహంకారం, గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఆ శిరస్సును సమర్పిస్తే.. తమలోని అహంకారం, గొప్పదనాన్ని తొలగించుకుని భగవంతుడికి ఒక నివేదన చేసినట్టు అవుతుందని గణేశుడు చెబుతాడు. అది విన్న పరమశివుడు తన కళ్లు మూసుకుని శిరస్సును సమర్పించేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు శివుడి శిరస్సు నుంచి ఒక తేజస్సు ఉద్భవించింది. అదే కొబ్బరికాయ. ఆ విధంగా పరమేశ్వరుడు తన శిరస్సుకు సంకేతమైన కొబ్బరికాయను విఘ్నేశ్వరుడికి సమర్పించాడు. ఆ తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండా త్రిపురాసురాలను సంహరించగలిగాడు.

అందుకే కొబ్బరికాయను మనిషి తలతో పోలుస్తారు. గుండ్రని కొబ్బరి ఉండే ఆకారం మనిషి ముఖం.. అందులో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. లోపల ఉండే లేత కొబ్బరిని మనస్సుతో పోలుస్తారు. అలాగే కొబ్బరికాయ బయట భాగాన్ని వ్యక్తి కోపం, అహం వంటి గుణాలుగా పరిగణిస్తారు. లోపలి భాగాన్ని స్వచ్ఛమైన సానుకూల లక్షణాలుగా చెప్పుకుంటారు. అందువల్ల దేవుడి ముందు కొబ్బరికాయను కొట్టడం ద్వారా మనలోని కోపం, అహాన్ని పగలగొట్టి.. మంచి ఆలోచనలు కలిగించమని దేవుడిని నివేదించుకోవడంగా భావిస్తారు. కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి కూడా కొన్ని అంచనాలు వేస్తుంటారు. కొత్తగా పెళ్లయిన జంట టెంకాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. కొబ్బరికాయ సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని అంటారు. నిలువుగా పగిలితే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.

కొబ్బరికాయ కుళ్లిపోతే దోషమా?

టెంకాయ కుళ్లిపోతే చెడు జరుగుతుందని చాలామంది భయపడుతుంటారు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనసులోని కుళ్లు ఈ రూపంలో బయటకు వెళ్లిందని భావించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇంట్లో లేదా ఆలయాల్లో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దాన్ని బయటపడేసి.. కాళ్లు చేతులు కడుక్కొని మళ్లీ పూజ చేస్తే సరిపోతుందని అర్చకులు చెబుతుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Job notifications | తెలంగాణలో కొనసాగుతున్న కొలువుల జాతర.. న్యూఇయర్‌ ముందు మరో నాలుగు నోటిఫికేషన్లు జారీ

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News